Share News

సింగరేణిలో రేవంత్‌ సర్కార్‌ లూటీ గుట్టు రట్టు!

ABN , Publish Date - Mar 09 , 2026 | 04:21 AM

సింగరేణి టెండర్లలో దోపిడీకి ‘సైట్‌ విజిట్‌ సర్టిఫికెట్‌’ ముసుగులో కాంట్రాక్టర్ల రింగ్‌ ఏర్పాటు చేసి రేవంత్‌రెడ్డి సర్కార్‌ చేసిన లూటీ ప్రయత్నం గుట్టు రట్టయిందని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

సింగరేణిలో రేవంత్‌ సర్కార్‌ లూటీ గుట్టు రట్టు!

  • ఎస్సార్పీ ఓసీ-2 టెండరుతో బాగోతం బయటకు: హరీశ్‌

హైదరాబాద్‌, మార్చి 8 (ఆంధ్రజ్యోతి) : సింగరేణి టెండర్లలో దోపిడీకి ‘సైట్‌ విజిట్‌ సర్టిఫికెట్‌’ ముసుగులో కాంట్రాక్టర్ల రింగ్‌ ఏర్పాటు చేసి రేవంత్‌రెడ్డి సర్కార్‌ చేసిన లూటీ ప్రయత్నం గుట్టు రట్టయిందని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఓ ఫైనాన్షియల్‌ బిడ్‌ను దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏడుసార్లు ఎందుకు వాయిదా వేశారని తాము నిలదీయడంతో.. శ్రీరాంపూర్‌ ఓసీ-2 టెండర్‌ ఫైనాన్షియల్‌ బిడ్ల అసలు బాగోతం బయటపడిందని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తమ డిమాండ్‌కు తలొగ్గి ఎట్టకేలకు సిండికేట్‌ ప్రమేయం లేకుండా పారదర్శకంగా బిడ్లు తెరిచేసరికి.. ఈ టెండర్‌ ఏకంగా మైనస్‌ 12 శాతానికి పూర్తయిందన్నారు. కొత్త నిబంధనలు తెచ్చాక సింగరేణిలో నమోదైన తొలి నెగెటివ్‌ బిడ్‌ ఇదేనని, సీఎం బావమరిది సృజన్‌రెడ్డి సిండికేట్‌ను బద్దలు కొడితే అసలైన పోటీ ఎలా ఉంటుందో, ధరలు ఎలా దిగివస్తాయో ఈ ఒక్క టెండర్‌ నిరూపించిందని అన్నారు. ఆన్‌లైన్‌ టెండర్ల పారదర్శకతను దెబ్బతీయడానికి సీఎం బావమరిది సృజన్‌రెడ్డి నేతృత్వంలో కావాలని ‘సైట్‌ విజిట్‌ సర్టిఫికెట్‌’ నిబంధన తెచ్చారని, దీంతో టెండర్‌ వేయకముందే ఎవరెవరు టెండర్‌ వేస్తున్నారో ముందుగానే తెలుసుకున్నారన్నారు.

Updated Date - Mar 09 , 2026 | 04:21 AM