సింగరేణికే తాటిచర్ల-2 బొగ్గు
ABN , Publish Date - Jul 08 , 2026 | 06:42 AM
తాటిచర్ల-2 బొగ్గు గని ఎట్టకేలకు సింగరేణికే దక్కింది. ఎలాంటి వేలం లేకుండానే.. కేంద్ర ప్రభుత్వం ఈ గనిని సింగరేణికి కేటాయించింది. తెలంగాణలోని బొగ్గుగనులను కేంద్రం వరుసగా వేలం వేస్తుండటంతో.. తవ్వేందుకు సింగరేణికి గనులు కరువయ్యే పరిస్థితి నెలకొంది.
182 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు
40-50 ఏళ్లు బొగ్గు ఉత్పత్తి చేయొచ్చు
సంస్థకు రూ.64 వేల కోట్ల ఆదాయం
1200 అదనపు ఉద్యోగాలు: కిషన్‌రెడ్డి
తాటిచర్ల కేటాయింపుపై సింగరేణి హర్షం
న్యూఢిల్లీ, వరంగల్, జూలై 7 (ఆంధ్రజ్యోతి): తాటిచర్ల-2 బొగ్గు గని ఎట్టకేలకు సింగరేణికే దక్కింది. ఎలాంటి వేలం లేకుండానే.. కేంద్ర ప్రభుత్వం ఈ గనిని సింగరేణికి కేటాయించింది. తెలంగాణలోని బొగ్గుగనులను కేంద్రం వరుసగా వేలం వేస్తుండటంతో.. తవ్వేందుకు సింగరేణికి గనులు కరువయ్యే పరిస్థితి నెలకొంది. సంస్థ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో.. తాటిచర్ల-2 గనిని సింగరేణికే కేటాయిస్తున్నట్టు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఢిల్లీలో ప్రకటించడంతో సంస్థ కార్మికుల్లో హర్షాతిరేకాలు నెలకొన్నాయి. రాష్ట్ర అభివృద్థి, సింగరేణి భవిష్యత్తు, కార్మికులు, రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ గనిని సింగరేణికే కేటాయించాలంటూ.. ప్రధాని మోదీని తాను అభ్యర్థించానని, అందుకు ఆయన అనుమతిచ్చారని, దీంతో ఆ ఫైల్‌పై తాను మంగళవారమే సంతకం చేశానని కిషన్‌రెడ్డి చెప్పారు. 2020 నుంచి ఇప్పటివరకూ ఏ బొగ్గు గనినీ వేలం లేకుండా ప్రభుత్వ రంగ సంస్థకు ఇవ్వలేదని గుర్తుచేసిన ఆయన.. ఒక్క సింగరేణి విషయంలోనే ఈ చొరవ తీసుకున్నామని చెప్పారు. సింగరేణిలో ఉద్యోగాలు తగ్గుతున్నాయని, బొగ్గు ఉత్పత్తి పడిపోతోందని.. సంస్థకు రావాల్సిన రూ.వేల కోట్ల బకాయిలు పేరుకుపోయి, సంస్థభవిష్యత్తు ఆందోళనకరంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో నైని, తాటిచర్ల-2 బొగ్గు గనులను కేటాయించడం కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ అభివృద్ధి పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
మంగళవారం ఢిల్లీలోని తన శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. తాటిచర్ల-2 గనిలో దాదాపు 182 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని, దాని ద్వారా ఏటా 6 మిలియన్ టన్నుల చొప్పున 40-50ఏళ్లపాటు బొగ్గు ఉత్పత్తి అవుతుందని ఆయన తెలిపారు. అన్నింటికీ మించి.. ఈ గనిలో ఉన్న బొగ్గు నాణ్యమైనదని, గ్రేడ్-8 రకానికి చెందినదని గుర్తుచేశారు. ఈ గని సింగరేణికి లాభాలు చేకూరుస్తుందని.. దీని ద్వారా సింగరేణికి రూ.64 వేల కోట్ల ఆదాయం వస్తుందని చెప్పారు. వేలం లేకుండా సింగరేణికి ఈ గనిని కేటాయించడం వల్ల ఆక్షన్ ప్రీమియం రూపంలో సంస్థకు రూ.2,550 కోట్లు మిగులుతాయన్నారు. అదేవిధంగా, తెలంగాణ ప్రభుత్వానికి కూడా రాయల్టీ సహా వివిధ మార్గాల్లో దాదాపు రూ.16 వేల కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని.. దాదాపు 1200 అదనపు ఉద్యోగాల కల్పన జరుగుతుందని కిషన్‌రెడ్డి తెలిపారు.
2015లో 32 భూగర్భ గనులు..
రోజురోజుకూ బొగ్గుగనులు మూతపడుతుండటంతో సింగరేణి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. 2015లో సింగరేణికి 32 భూగర్భ గనులుంటే ప్రస్తుతం ఆ సంఖ్య 21కి పడిపోగా.. 16 ఓసీపీలు ఏర్పాటయ్యాయి. 2000-01లో సంస్థ కార్మికులు, అధికారుల సంఖ్య 1,05,627 కాగా.. ఇప్పుడా సంఖ్య 40,136కు తగ్గింది. 2015 వరకు తెలంగాణలో ఉన్న బొగ్గుగనులన్నింటినీ ప్రభుత్వం సింగరేణికే కేటాయిస్తూ వచ్చింది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత 2015లో తీసుకొచ్చిన కొత్త చట్టాలతో బొగ్గు గనులు వేలంలోకి వెళ్లటంతో సింగరేణి మనుగడపై అనుమానాలు పెరిగాయి. సత్తుపల్లి బ్లాక్-3, కోయగూడెం బ్లాక్-3, కళ్యాణఖని బ్లాక్-6, శ్రావణపల్లి గనుల్లో బొగ్గు నిక్షేపాల గుర్తింపునకు సింగరేణి రూ.66 కోట్ల దాకా ఖర్చు చేయగా.. కేంద్రం ఆ గనులను సింగరేణికి కేటాయించకుండా వేలంలో పెట్టింది. వీటిలో కోయగూడెం బ్లాక్-3, సత్తుపల్లి బ్లాకు-3లను ప్రవేటు కంపెనీలు సింగిల్ బిడ్డర్లుగా దక్కించుకున్నాయి. 2024లో శ్రావణపల్లి గనులు ప్రైవేటు చేతికి చిక్కాయి. ఈ క్రమంలోనే సింగరేణికి అత్యంత కీలకమైన బ్లాక్‌గా భావిస్తున్న తాటిచర్ల బొగ్గు గనిని సైతం కేంద్ర ప్రభుత్వం వేలంలో పెట్టేందుకు ప్రణాళిక రూపొందించింది. దీంతో సింగరేణి కార్మికుల్లో ఆందోళన వ్యక్తమైంది. ఆ గనిని సింగరేణికి కేటాయించాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి పలుమార్లు ప్రధాని మోదీకి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. మైన్స్ అండ్ మినరల్ డెవల్‌పమెంట్ అండ్ రెగ్యులేషన్ (ఎంఎండీఆర్) చట్టంలోని సెక్షన్ 17ఏ/11ఏ కింద తెలంగాణలోని బొగ్గు గనులను నామినేషన్ ప్రతిపాదికన సింగరేణికి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఇదే చట్టం కింద గుజరాత్, ఒడిశా రాష్ట్రాల్లో నేరుగా బొగ్గు గనులను కేంద్రం కేటాయిస్తోందని.. తెలంగాణ విషయంలో మాత్రం ద్వంద వైఖరి అవలంబిస్తోందనే వాదన వినిపించింది. ఎట్టకేలకు ఇప్పుడు తాటిచర్లను వేలం లేకుండా నేరుగా సింగరేణికి కేటాయించడంతో ఆ సంస్థ కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. సింగరేణి మనుగడకు భరోసా లభించిందని అభిప్రాయపడ్డారు.
తాటిచర్ల నుంచే ప్రైవేటుకు ‘గులాబీ’ బాటలు
భూపాలపల్లి జిల్లా తాటిచర్ల-1 ఓసీపీలో ప్రస్తుతం ఏఎంఆర్ అనే ప్రైవేటు సంస్థ బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. వాస్తవానికి 2005లో తాటిచర్ల బొగ్గుగనిని క్యాప్టివ్ మైనింగ్ కింద అప్పటి ప్రభుత్వం జెన్‌కోకు కేటాయించింది. జెన్‌కో వద్ద బొగ్గును తవ్వుకునే సాంకేతికత లేకపోవటంతో నాటి సర్కారు తాటిచర్ల బొగ్గు బ్లాక్‌ను పీఎల్‌ఆర్ కంపెనీకి అప్పగించింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో 2011లో రోశయ్య సర్కారు పీఎల్‌ఆర్ కంపెనీకి కేటాయింపులను రద్దు చేసింది. తెలంగాణ ఏర్పడిన తరువాత అధికార పగ్గాలు చేపట్టిన కేసీఆర్ సర్కారు.. తాటిచర్లలో బొగ్గు ఉత్పత్తి కాంట్రాక్టును ఏఎంఆర్ కంపెనీకి ఇచ్చింది. తాటిచర్ల గని నుంచి తాము బొగ్గు తీయలేమంటూ సింగరేణి సంస్థ నుంచి 2015లో కేసీఆర్ సర్కారు లేఖ తీసుకున్నట్టుగా ఆరోపణలున్నాయి. ఆ సంగతెలా ఉన్నా.. 2017 నుంచి తాటిచర్ల-1లో బొగ్గు ఉత్పతి అవుతోంది. 30ఏళ్ల పాటు ఏఎంఆర్ కంపెనీ తాటిచర్ల-1 నుంచి కేటీపీపీకి బొగ్గును సరఫరా చేయనుంది.