బ్యాటరీలో సౌరవిద్యుత్తు నిల్వతో ఆదాయం
ABN , Publish Date - May 22 , 2026 | 04:16 AM
సౌర విద్యుత్తు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ (బెస్)లో నిల్వ చేసుకొని నాలుగు నెలల్లోనే రూ.26 లక్షలను సింగరేణి యాజమాన్యం ఆదా చేసుకుంది.
రాష్ట్రంలో తొలి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్‌తో సింగరేణి రికార్డు
హైదరాబాద్, మే 21 (ఆంధ్రజ్యోతి): సౌర విద్యుత్తు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ (బెస్)లో నిల్వ చేసుకొని నాలుగు నెలల్లోనే రూ.26 లక్షలను సింగరేణి యాజమాన్యం ఆదా చేసుకుంది. పగటిపూట ఉత్పత్తి జరిగే సోలార్ విద్యుత్తు ప్లాంట్‌లో వినియోగించని విద్యుత్తును ఉచితంగా గ్రిడ్‌లో పంప్ చేయకుండా.. ఆ విద్యుత్తును బ్యాటరీలో నిల్వ చేసుకొని ఆ తర్వాత వినియోగించుకొని సింగరేణి లాభపడింది. నాలుగు నెలల క్రితం మందమర్రి ఏరియాలోని 28 మెగావాట్ల సింగరేణి సోలార్ ప్లాంట్‌కు అనుబంధంగా ఒక మెగావాట్ బ్యాటరీ ఎనర్జీ సిస్టమ్ నెలకొల్పారు. 4నెలలుగా ఈ బ్యాటరీలో నిల్వ చేసిన 3,35,485 యూనిట్లను అవసరమైన సందర్భాల్లో సింగరేణి వినియోగించుకుంది. తద్వారా సంస్థకు రూ. 25,66,460 ఆర్థిక లబ్థి చేకూరింది. పునరుత్పాదక ఇం ధన వనరులను ప్రోత్సహించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా మరిన్ని ప్రాజెక్టులను చేపట్టేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు సింగరేణి ప్రకటించింది.