Share News

అప్పుడు ముగ్గురు.. ఇప్పుడు అందరూ!

ABN , Publish Date - Jul 15 , 2026 | 06:33 AM

సింగరేణిలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు వేల కోట్లు దోచుకున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి ఆరోపించారు.

అప్పుడు ముగ్గురు.. ఇప్పుడు అందరూ!

  • సింగరేణిలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ వేల కోట్ల దోపిడీ.. పదేళ్లలో రూ.26 వేల కోట్లు కొల్లగొట్టిన బీఆర్‌ఎస్‌

  • రెండున్నరేళ్లలోనే కాంగ్రెస్‌ దోపీడీ రూ.27 వేల కోట్లు

  • సింగరేణిని రక్షించాలనే తాడిచర్ల బ్లాక్‌ 2 ఇప్పించాం

  • తాడిచర్ల కోసం జైలుకు వెళ్లడానికైనా నేను సిద్ధం

  • రాష్ట్ర ప్రభుత్వం 60 వేల కోట్ల బకాయిలు చెల్లించాలి

  • సింగరేణి భరోసా యాత్రలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

కాళేశ్వరంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల దిగువ ప్రాంతాల్లో నివసించే ప్రజల ప్రాణాలు, ఆస్తుల భద్రత దృష్ట్యా బ్యారేజీల్లో నీటిని ఎత్తిపోయొద్దని, నిల్వ చేయొద్దని రిటైర్డ్‌ హైదరాబాద్‌ ఇంజనీర్ల సంఘం అభిప్రాయపడింది. ఎన్‌డీఎ్‌సఏ ( జాతీయ ఆనకట్టల భద్రతా ప్రాధికార సంస్థ) సూచించిన అన్ని భద్రతా చర్యలు పూర్తయ్యే వరకు నీటిని ఎత్తిపోయడం కానీ, నిల్వ చేయడం వద్దని పేర్కొంది. ఆ సంఘం అధ్యక్షుడు జంబుల్‌ రెడ్డి, ఉపాఽధ్యక్షులు రఘుమారెడ్డి ఈ మేరకు ఓ ప్రకటన చేశారు.

భూపాలపల్లి/మంచిర్యాల/గోదావరిఖని, జూలై 14 (ఆంధ్రజ్యోతి): సింగరేణిలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు వేల కోట్లు దోచుకున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి ఆరోపించారు. గతంలో ఓ వెలుగు వెలిగిన సింగరేణిలో నేడు నీలినీడలు కమ్ముకున్నాయని, అవినీతి అక్రమాల వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. సింగరేణి భరోసా యాత్రలో భాగంగా ఆయన మంగళవారం భూపాలపల్లి, మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌, పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో పర్యటించారు. కార్మికులతో, క్యాతన్‌పల్లి, జీడీకే ఓపెన్‌కాస్టు 5 ఆవరణలో నిర్వహించిన సభల్లో మాట్లాడారు. భూపాలపల్లి జిల్లా మల్హర్‌ మండలంలోని తాడిచర్ల బ్లాక్‌ 2 గని భూములను పరిశీలించి స్థానికులతో ముచ్చటించారు. పదేళ్లలో బీఆర్‌ఎస్‌ సింగరేణిలో రూ.26 వేల కోట్లు దోచుకుంటే ఈ రెండున్నరేళ్లలో కాంగ్రెస్‌ రూ.27 వేల కోట్లు దోచుకుందని ఆరోపించారు. సింగరేణిని అప్పుడు బీఆర్‌ఎస్‌, ఇప్పుడు కాంగ్రెస్‌ బంగారు బాతులా వాడుకుంటున్నాయన్నారు. అప్పుడు హరీశ్‌రావు, కేటీఆర్‌, కవిత దోచుకుంటే... ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో హోల్‌సేల్‌గా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.


తాడిచర్ల బ్లాక్‌ 2 బొగ్గు గని ప్రాజెక్టు రాష్ట్రానికి ఒక మణికిరీటం కానుందని, దాంతో ఈ ప్రాంత ఆర్థిక రూపురేఖలు మారిపోనున్నాయన్నారు. వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని, వ్యాపారాభివృద్ధి జరగడంతో పాటు చిన్నతరహా అనుబంధ పరిశ్రమలు వస్తాయని చెప్పారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఈ బ్లాక్‌ సింగరేణి పరమైందని, 20 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడిందని చెప్పారు. మార్కెట్‌ ధర ప్రకారమే నిర్వాసితులకు పరిహారం చెల్లిస్తామన్నారు. తాడిచర్ల బ్లాక్‌ కేటాయింపుపై కొందరు న్యాయపరమైన బెదిరింపులకు దిగుతున్నారని, ఈ విషయంలో అవసరమైతే తాను జైలుకు వెళ్లడానికైనా సిద్ధమని చెప్పారు. 2013-14 ప్రాంతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం 430కి పైగా బొగ్గు బ్లాక్‌లను గుర్తించి 118 బొగ్గు బ్లాకులను నామినేషన్‌ పద్ధతిలో ఇవ్వడాన్ని నాడు సుప్రీంకోర్టు తప్పుపట్టిందని, అప్పటి కేంద్ర మంత్రులే ఆ కుంభకోణంలో జైలుకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. మోదీ ప్రభుత్వంలో కోల్‌ ఇండియాలోని 15 సంస్థలకు క్యాప్టివ్‌మైన్ల కింద కొన్ని బొగ్గు బ్లాకులు కేటాయించడం మినహా మిగతావాటిని పారదర్శకంగా వేలం పాటల్లోనే కేటాయిస్తున్నామని చెప్పారు. సింగరేణి పరిస్థితి మేడిపండులా ఉందని, దాన్ని కాపాడుకునేందుకే తాడిచర్ల బ్లాక్‌ 2ను కేటాయించామని తెలిపారు. సింగరేణి ప్రాంతంలోని ఒక్క బొగ్గు బ్లాక్‌ కూడా ప్రైవేటుకు వెళ్లదని, వేలం వేసే ప్రతీ బ్లాక్‌ సింగరేణికి వచ్చేలా ప్రయత్నం చేయాలన్నారు. జెన్‌కో, ట్రాన్స్‌కోల నుంచి సింగరేణికి రావాల్సిన రూ.60 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 2015 లోనే ఒడిసాలోని నైనీ బొగ్గు బ్లాక్‌ను సింగరేణికి కేటాయిస్తే కేసీఆర్‌ పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా నైనీ బొగ్గు బ్లాక్‌కు మైన్‌ డెవలపర్‌ అండ్‌ ఆపరేటర్‌ (ఎండీవో) నియమించే విషయంలో తంటాలు పడుతోందని, మంత్రులు, ముఖ్యమంత్రి తనకు అనుకూలమైన వ్యక్తిని నియమించుకునేందుకు జాప్యం చేస్తున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడేందుకు సింగరేణి ప్రాంతమే నాంది కావాలన్నారు. కార్యక్రమాల్లో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌, బీజేపీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

Updated Date - Jul 15 , 2026 | 06:34 AM