కోల్‌బెడ్ మిథేన్ అన్వేషణకు సింగరేణికి ఆహ్వానం
ABN , Publish Date - Feb 28 , 2026 | 04:17 AM
తెలంగాణలోని ప్రాణహిత-గోదావరి లోయ ప్రాంతంలో విస్తారంగా ఉన్న కోల్ బెడ్ మిథేన్ నిక్షేపాలను వెలికితీసేందుకు కేంద్ర పెట్రోలియం, సహజ వనరుల శాఖ సింగరేణి సంస్థను ఆహ్వానించింది.
వేలంలో పాల్గొనాలని కోరిన కేంద్ర పెట్రోలియం శాఖ
హైదరాబాద్, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలోని ప్రాణహిత-గోదావరి లోయ ప్రాంతంలో విస్తారంగా ఉన్న కోల్ బెడ్ మిథేన్ నిక్షేపాలను వెలికితీసేందుకు కేంద్ర పెట్రోలియం, సహజ వనరుల శాఖ సింగరేణి సంస్థను ఆహ్వానించింది. సుమారు 19 బిలియన్ క్యూబిక్ మీటర్ల మిథేన్ గ్యాస్ నిక్షేపాలు ఉన్నట్లు ప్రాథమిక అంచనాలు ఉన్న ఈ ప్రాజెక్టు వేలంలో పాల్గొనాలని కేంద్ర ప్రతినిధులు కోరారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో సంస్థ సీఎండీ బుద్ధప్రకాష్ జ్యోతిని కేంద్ర పెట్రోలియం శాఖ శాఖ ఏడీజీ సచివ్ కుమార్ కలిసి చర్చించారు. ఈ అన్వేషణ కోసం కేంద్రం ప్రధానంగా రెండు బ్లాకులను గుర్తించింది. ఇందులో మొదటి బ్లాక్ పరిధిలోకి మంచిర్యాల, పెద్దపల్లి, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలు రాగా, రెండో బ్లాక్ కింద భద్రా ద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలను చేర్చారు. ‘వికసిత్ భారత్’ లక్ష్యంలో భాగంగా దేశం ఇంధన రంగం లో స్వయం సమృద్ధి సాధించాలనే ఉద్దేశంతో ఈ అ డుగులు వేస్తున్నట్లు కేంద్ర ప్రతినిధులు తెలిపారు. ఈ ప్రతిపాదనలపై కూలంకశంగా చర్చించి, నిర్ణ యం తీసుకుంటామని బుద్ధప్రకాష్ జ్యోతి చెప్పారు.