సింగరేణి నిధులు గజ్వేల్, కొడంగల్‌కు
ABN , Publish Date - Feb 10 , 2026 | 04:38 AM
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణిని అందినకాడికి దోచుకుని సర్వనాశనం చేశాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్ సింగరేణి నిధులను గజ్వేల్‌కు తరలించుకుపోతే, రేవంత్‌రెడ్డి కొడంగల్‌కు ...
అందినకాడికి దోచుకుని సంస్థను నాశనం చేశారు.. బొగ్గు, కరెంటు వాడుకుని రూ.51వేల కోట్లు బకాయి
బిల్లులకు మంత్రులు 12 శాతం కమీషన్లు వసూలు
సింగరేణి అక్రమాలను మోదీ దృష్టికి తీసుకెళతా: కిషన్‌రెడ్డి
గోదావరిఖని/మంచిర్యాల, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణిని అందినకాడికి దోచుకుని సర్వనాశనం చేశాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్ సింగరేణి నిధులను గజ్వేల్‌కు తరలించుకుపోతే, రేవంత్‌రెడ్డి కొడంగల్‌కు తరలించుకుపోతున్నారని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో, పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. కేసీఆర్, రేవంత్ ప్రభుత్వాలు సింగరేణి బొగ్గు, కరెంటు వాడుకొని రూ.51వేల కోట్లు అప్పు పెట్టాయని ధ్వజమెత్తారు. సంస్థలో మోసాలు చేసి లాభాలు చూపిస్తున్నారని, జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. సింగరేణి బిల్లులకు మంత్రుల ముఠాలు 12 శాతం కమీషన్లు వసూలు చేస్తున్నాయని మండిపడ్డారు. సింగరేణి నిధులను ఇష్టానుసారంగా తరలించుకుపోతున్నారని, ఇటీవల రూ.500 కోట్లు పాఠశాలల పేరు మీద, ఫుట్‌బాల్ మ్యాచ్‌ల పేరు మీద దుర్వినియోగం చేశారని పేర్కొన్నారు. 49శాతం వాటా ఉన్న కేంద్రంతో సంప్రదించకుండానే ఏకపక్షంగా సంస్థను నడిపిస్తున్నారని మండిపడ్డారు. సింగరేణిలో అవకతవకలు, వ్యవహారాలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళతామన్నారు. త్వరలోనే సింగరేణిలో ఉన్న కేంద్ర ప్రభుత్వ డైరెక్టర్లను మారుస్తామని తెలిపారు. డీఎంఎ్‌ఫటీ నిధులు దుర్వినియోగం కాకుండా ప్రధాని మోదీ నేతృత్వంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం జరగనుందని, ఈ సమావేశంలో కొత్త మార్గదర్శకాలు ప్రవేశపెడతామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వానికి బొగ్గు బ్లాక్‌లు ఇస్తే వారు ప్రైవేట్ వారికి అమ్ముకుంటున్నారని, గతంలో బీఆర్‌ఎస్ తాడిచర్లను అమ్మిందని, ఇప్పుడు కాంగ్రెస్ నైనీ బ్లాక్‌కు ఎసరు పెట్టిందన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే బొగ్గు గని కార్మికులకు ఐటీ మినహాయింపునకు సంబంధించి చర్యలు తీసుకుంటుందని, రాష్ట్ర ప్రభుత్వమే ఆ మొత్తాన్ని భరిస్తుందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.