‘బొగ్గు చోరీ’ కథనాలు అవాస్తవం
ABN , Publish Date - Jun 22 , 2026 | 04:51 AM
సింగరేణిలో భారీగా బొగ్గు చోరీకి గురవుతోందంటూ ఇటీవల వెలువడుతున్న కథనాలను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఖండించింది.
ఆర్‌ఎఫ్ఐడీ, జీపీఎస్, సీసీటీవీలతో పకడ్బందీ పర్యవేక్షణ
బొగ్గు చోరీకి అవకాశమే లేదని సింగరేణి స్పష్టీకరణ
హైదరాబాద్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): సింగరేణిలో భారీగా బొగ్గు చోరీకి గురవుతోందంటూ ఇటీవల వెలువడుతున్న కథనాలను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఖండించింది. బొగ్గు ఉత్పత్తి నుంచి వినియోగదారుడి వద్దకు చేరే వరకు ప్రతి దశ అత్యాధునిక సాంకేతిక వ్యవస్థల పర్యవేక్షణలోనే జరుగుతోందని, బొగ్గు మాయమవడం లేదా చోరీ అవడానికి అవకాశం లేదని ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో సంస్థ యాజమాన్యం స్పష్టం చేసింది. సింగరేణిలో ఉత్పత్తయ్యే ప్రతి టన్ను బొగ్గు డిజిటల్ రికార్డుల్లో నమోదవుతుందని అధికారులు తెలిపారు. దాదాపు 85శాతం రైళ్ల ద్వారా, మిగిలిన 15శాతం రోడ్డు మార్గంలో వినియోగదారులకు సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. బొగ్గు కేటాయింపులు, సరఫరా తేదీలు, వినియోగదారుల వివరాలు, పరిమాణాలు అన్నీ సాప్ ఆధారిత సమగ్ర వ్య వస్థద్వారా జరుగుతున్నాయని తెలిపారు. రోడ్డు మార్గంలో బొగ్గు రవాణా చేసే ప్రతి వాహనాన్ని ఎలకా్ట్రనిక్ వెయిబ్రిడ్జ్‌ల వద్ద తూకం వేస్తున్నట్లు వివరించారు. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్(ఆర్‌ఎఫ్ఐడీ) ఆధారిత బూమ్ బ్యారియర్లు, జీపీఎస్ ట్రాకింగ్, జియోఫెన్సింగ్ వ్యవస్థల ద్వారా వాహనాల కదలికలను రియల్‌టైమ్‌లో పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. గనులు, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లు, వెయిబ్రిడ్జ్‌లు, రైల్వే సైడింగ్‌లు, స్టాక్‌యార్డులు, ఎంట్రీ-ఎగ్జిట్ పాయింట్ల వద్ద సీసీ కెమెరాలు, ఆర్‌ఎ్‌ఫఐడీ వ్యవస్థలు, చెక్‌పోస్టులు, ఫ్లయింగ్‌స్క్వాడ్లు, భద్రతా సిబ్బంది 24 గంట లూ నిఘా కొనసాగిస్తున్నారని అధికారులు తెలిపారు.