Share News

బొగ్గు మాయం.. అసత్యం

ABN , Publish Date - Jun 27 , 2026 | 06:41 AM

సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని హరీశ్‌రావు చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ గౌరవ అధ్యక్షుడు..

బొగ్గు మాయం.. అసత్యం

  • హరీశ్‌ రావు చెబుతున్నవన్నీ అవాస్తవాలే

  • అనుమానాలుంటే సీబీఐ విచారణ కోరండి

  • నేను ఎప్పుడూ కార్మికుల పక్షానే : కూనంనేని

హైదరాబాద్‌, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని హరీశ్‌రావు చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ గౌరవ అధ్యక్షుడు కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. ఒక్క బొగ్గు పెళ్ల కూడా దొంగతనం జరిగే అవకాశం లేదని, హరీశ్‌ వ్యాఖ్యలు అభ్యంతరకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు నిల్వలపై అనుమానాలుంటే సీబీఐ విచారణ కోరాలని సూచించారు. రుణాలు తీసుకోవడానికో లేక రేటింగ్‌ పొందడానికో.. లేని బొగ్గును ఉన్నట్లుగా సింగరేణి రికార్డుల్లో చూపించినట్లు కనిపిస్తోందన్నారు. ఇది సత్యం స్కామ్‌ లాంటిదని, కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌కు ఇప్పటికే ఫిర్యాదు చేసినట్లు గుర్తుచేశారు. బీఆర్‌ఎస్‌ హయాంలోనూ 75లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఎక్కువగా చూపించారని ఆరోపించారు. ఇప్పుడు 40లక్షల టన్నుల బొగ్గు మాయమైతే... అప్పుడు 75లక్షల టన్నుల మేర స్కామ్‌ జరిగినట్టేనని, దీన్ని హరీశ్‌ ఒప్పుకుంటారా? అని ప్రశ్నించారు. ఏదైనా అంశంపై మాట్లాడేటప్పుడు పూర్వపరాలు తెలుసుకోవాలని హితవు పలికారు. తాను సింగరేణి పక్షమా? స్కామ్‌ పక్షమా? అని హరీశ్‌ ప్రశ్నించారని చెబుతూ.. తాను ఎప్పుడూ కార్మికుల పక్షమేనని స్పష్టం చేశారు. సింగరేణిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించకపోతే ఆగస్టు 15నుంచి సమ్మెకు పిలుపునిస్తామని హెచ్చరించారు. 2015లో కేంద్రం తీసుకొచ్చిన చట్టంతో బొగ్గు గనులు సైతం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయని, ఈ చట్టానికి బీఆర్‌ఎస్‌ కూడా మద్దతు తెలిపిందని గుర్తు చేశారు. తద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సింగరేణి ఊపిరి తీశాయని విమర్శించారు.

Updated Date - Jun 27 , 2026 | 06:43 AM