Share News

సింగరేణికి బకాయిల గుదిబండ

ABN , Publish Date - Jan 27 , 2026 | 04:07 AM

సింగరేణి మెడకు బకాయిల గుదిబండ వేలాడుతోంది. సంస్థ నుంచి కరెంటు, బొగ్గు కొనుగోలు చేస్తున్న విద్యుత్‌ సంస్థలు ఎప్పటికప్పుడు చెల్లింపులు చేయకపోవడంతో ఆ బాకీలు గుట్టల్లా పేరుకుపోయాయి.

సింగరేణికి బకాయిల గుదిబండ

  • జెన్‌కో నుంచి 17,757 కోట్లు

  • డిస్కమ్‌ల నుంచి 25,886 కోట్ల బాకీలు

హైదరాబాద్‌, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): సింగరేణి మెడకు బకాయిల గుదిబండ వేలాడుతోంది. సంస్థ నుంచి కరెంటు, బొగ్గు కొనుగోలు చేస్తున్న విద్యుత్‌ సంస్థలు ఎప్పటికప్పుడు చెల్లింపులు చేయకపోవడంతో ఆ బాకీలు గుట్టల్లా పేరుకుపోయాయి. దీంతో సింగరేణిలో నెల నెలా కార్మికుల జీతాలకు దిక్కులు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. సింగరేణి నుంచి బొగ్గు కొన్న జెన్‌కో రూ.17,757.90 కోట్లు బకాయి పడింది. అలాగే కరెంటు కొనుగోలు చేసిన దక్షిణ డిస్కమ్‌(టీజీఎస్పీడీసీఎల్‌), ఉత్తర డిస్కమ్‌(టీజీఎన్పీడీసీఎల్‌)లు .25,886.17 కోట్లు బాకీ పడ్డాయి. దీంతో బకాయిల మొత్తం 43,644 కోట్లకు చేరింది. ఇవి 2025 సెప్టెంబరు 30 నాటి వరకు ఉన్న లెక్కలు. తెలంగాణ జెన్‌కోతో పాటు ఏపీ జెన్‌కో, ఎన్‌టీపీసీ, మహా జెన్‌కో(మహారాష్ట్ర), కేపీసీఎల్‌(కర్ణాటక), టాన్‌ జెడ్‌కో(తమిళనాడు)కు కూడా సింగరేణి బొగ్గును విక్రయిస్తోంది. ఆయా సంస్థల నుంచి రావాల్సిన బకాయిలు రూ.20,618 కోట్లుగా ఉండగా.. అందులో మన జెన్‌కో వాటానే రూ.17,757.90 కోట్లుగా ఉంది. మిగిలిన సంస్థలు సకాలంలోనే చెల్లింపులు చేస్తుండగా.. తెలంగాణ జెన్‌కో మాత్రం చేయడం లేదు. సింగరేణి నుంచి టన్ను బొగ్గును రూ.6,420కు జెన్‌కో కొంటోంది. దేశంలో మరే సంస్థ ధర ఇంత లేదు. ఒప్పందం మేరకు నాణ్యమైన బొగ్గు ఇవ్వడం లేదనే కారణం చూపి సకాలంలో చెల్లింపులకు జెన్‌కో ముఖం చాటేస్తోంది.

రూ.12,448 కోట్ల ఆలస్య రుసుము..

సింగరేణికి మంచిర్యాల జిల్లా జైపూర్‌లో 1,200 మెగావాట్ల థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌, పలు చోట్ల సోలార్‌ ప్లాంట్లు ఉన్నాయి. తన అవసరాలు పోను మిగిలిన కరెంటును డిస్కమ్‌లకు అమ్ముతోంది. విద్యుత్‌ కొనుగోళ్లకు సంబంధించి సింగరేణికి రూ.25,886 కోట్లు డిస్కమ్‌లు బాకీ ఉండగా.. ఇందులో రూ.12,448 కోట్లు ఆలస్య రుసుము సర్‌ఛార్జీ కావడం గమనార్హం. రూ.25,886 కోట్లలో అసలు బిల్లు రూ.13,438 కోట్లే. ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎల్‌పీఎస్‌ నిబంధనల ప్రకారం ఏకకాలంలో లేదా సమాన వాయిదాల్లో కట్టడానికి పూచీ ఇస్తే రూ.12,488 కోట్లు మాఫీ అయ్యే అవకాశం ఉంటుంది. దీని కోసం డిస్కమ్‌లు సింగరేణితో ఒప్పందం చేసుకోవాలి.

బీఆర్‌ఎస్‌ వాటా రూ.27,312 కోట్లు..

కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరే నాటికి తెలంగాణ విద్యుత్‌ సంస్థలు సింగరేణికి చెల్లించాల్సిన బకాయిలు రూ.27,312.17 కోట్లు. ఇవన్నీ బీఆర్‌ఎస్‌ హయాంలో పేరుకున్న బకాయిలే. ఇందులో విద్యుత్‌ కొనుగోళ్ల ఖాతాలో 19,955.37 కోట్లు, బొగ్గు ఖాతాలో రూ.7,356.80 కోట్లున్నాయి. అయితే విద్యుత్‌ సంస్థలకు ప్రభుత్వ శాఖలు కరెంటు బిల్లులు చెల్లించకపోవడంతో ఆ సంస్థలు జెన్‌కో, సింగరేణికి చెల్లింపులు చేయలేని పరిస్థితి. వెరసి ఒకదానికి మరొకటి ముడిపడి.. అటు సింగరేణి, ఇటు విద్యుత్‌ సంస్థలు కష్టాల్లోకి వెళుతున్నాయి. ఇక రాష్ట్రంలో 2023 డిసెంబరులో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగా.. ఈ ప్రభుత్వ ఖాతాలో రూ.16,332 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి.

Updated Date - Jan 27 , 2026 | 04:07 AM