కోల్‌బెల్ట్‌లో కార్మికుడిదే తీర్పు
ABN , Publish Date - Feb 09 , 2026 | 02:15 AM
రాష్ట్రంలో జరుగుతున్న మునిసిపల్ ఎన్నికలు ‘కోల్ బెల్ట్’లో రణరంగాన్ని తలపిస్తున్నాయి. ఐదు మునిసిపాలిటీలు, మూడు మునిసిపల్ కార్పొరేషన్ల పరిధిలో సింగరేణి విస్తరించి ఉండడంతో..
మునిసిపల్ ఎన్నికలను శాసించనున్న సింగరేణి.. లక్షకుపైగా కార్మికుల కుటుంబాలు.. 5లక్షల ఓట్లు
మూడు ప్రధాన పార్టీల మధ్య హోరాహోరీ పోరు
హైదరాబాద్, ఫిబ్రవరి 8 (మంచిర్యాల నుంచి ఆంధ్రజ్యోతి ప్రత్యేక ప్రతినిధి): రాష్ట్రంలో జరుగుతున్న మునిసిపల్ ఎన్నికలు ‘కోల్ బెల్ట్’లో రణరంగాన్ని తలపిస్తున్నాయి. ఐదు మునిసిపాలిటీలు, మూడు మునిసిపల్ కార్పొరేషన్ల పరిధిలో సింగరేణి విస్తరించి ఉండడంతో.. ఈ సంస్థ ఓటుబ్యాంకు ఇప్పుడు అత్యంత శక్తివంతమైన అస్త్రంగా మారింది. నిన్నటి వరకు భూగర్భంలో బొగ్గు తీసిన కార్మికుడు నేడు వాటి పరిధిలోని బల్దియా పీఠాల తలరాతను మార్చే రాజకీయ శక్తిగా అవతరించాడు. ఇక్కడ ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ప్రస్తుతం సింగరేణిలో సుమారు 42 వేల మంది శాశ్వత ఉద్యోగులు ఉన్నారు. ఒక్కో కుటుంబంలో సగటున నలుగురు ఓటర్లను లెక్కించినా కేవలం సిబ్బంది కుటుంబాల నుంచే 1.60 లక్షల ఓట్లు ఉన్నాయి. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో మరో 30 వేలకు మించే ఉద్యోగులున్నారు. వీరి కుటుంబాల ఓట్లు 1.20 లక్షలు ఉండగా.. సింగరేణిలో పని చేసి పదవీ విరమణ పొందిన కుటుంబాల ఓట్లు మరో 2.5 లక్షలకు పైనే ఉన్నాయి. మంచిర్యాల, రామగుండం, కొత్తగూడెం కార్పొరేషన్లతో పాటు బెల్లంపల్లి, క్యాతనపల్లి, భూపాలపల్లి, సత్తుపల్లి, ఇల్లెందు మునిసిపాలిటీలు పూర్తిగా వీరి ఓట్లపైనే ఆధారపడి ఉన్నాయి. సింగరేణి ఉద్యోగులు తమ ఉద్యోగానికి రాజీనామా చేయకుండానే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే వెసులుబాటును ఎన్నికల సంఘం కల్పించడంతో కొన్ని చోట్ల కార్మికులే నేరుగా రంగంలోకి దిగారు. గతంలో తెలంగాణ ఉద్యమ సెగతో బీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టేది. కానీ, 2022 కార్మిక సంఘ ఎన్నికల ఫలితాలు ఈసారి సీన్‌ను రివర్స్ చేశాయి. బెల్లంపల్లి, మందమర్రి, భూపాలపల్లి, కొత్తగూడెం, సత్తుపల్లి వంటి మెజారిటీ ఏరియాల్లో కాంగ్రెస్ అనుబంధ ఐఎన్‌టీయూసీ గెలిచింది. దీంతో సహజంగానే ఈ మునిసిపాలిటీల్లో ఆ సంఘం ఓట్లు కాంగ్రె్‌సకు అనుకూలంగా మారతాయని అ పార్టీ నేతలు భావిస్తున్నారు. మంచిర్యాలలో సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ బలంగా ఉంది. ఇక్కడ కాంగ్రె్‌స-సీపీఐ దోస్తీ కట్టగా.. క్యాతనపల్లిలో మాత్రం సీపీఐ అనూహ్యంగా బీఆర్‌ఎ్‌సకు మద్దతు ప్రకటించింది. ఏఐటీయూసీ ఓట్లను తనవైపు తిప్పుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా, బీఆర్‌ఎస్ పట్టు నిలుపుకోవాలని చూస్తోంది. ఇక కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు విజయం సాధించారు. అయితే.. ఈ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ వేర్వేరుగా పోటీ చేస్తుండడం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే.. కార్మికుల ఓట్ల కోసం నేతలు వ్యూహాత్మకంగా హామీల వర్షం కురిపిస్తున్నారు. ఏళ్ల తరబడి సింగరేణి స్థలాల్లో నివసిస్తున్న వారికి వాటిని క్రమబద్ధీకరించాలనేది దశాబ్దాల డిమాండ్. దీనిపై అన్ని పార్టీలు ‘మేమే చేస్తాం’ అంటూ హామీలు ఇస్తున్నాయి. సింగరేణి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో వైద్య సమస్యలు, వసతుల కల్పనను అజెండాగా మార్చుకున్నాయి. రికార్డు స్థాయిలో బోనస్ ఇచ్చామని కాంగ్రెస్ ప్రచారం చేస్తుండగా, వారసత్వ ఉద్యోగాల ఘనత తమదేనని బీఆర్‌ఎస్ చెబుతోంది. మొత్తంగా మునిసిపోల్స్‌లో సింగరేణి కార్మికుడే కీలకం కానున్నాడు.