Share News

సింగరేణి సీఎండీగా జ్యోతి బుద్ధప్రకాశ్‌

ABN , Publish Date - Feb 12 , 2026 | 01:02 AM

రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఐఏఎ్‌సలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎ్‌సలతో పాటు నాన్‌-కేడర్‌ అధికారుల బదిలీలతో పాటు పోస్టింగ్‌లు ఇచ్చింది.

సింగరేణి సీఎండీగా జ్యోతి బుద్ధప్రకాశ్‌

  • సవ్యసాచి ఘోష్‌కు మరిన్ని అదనపు బాధ్యతలు

  • జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్‌, మల్కాజిగిరి కార్పొరేషన్లకు కొత్త కమిషనర్ల నియామకం

  • రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఐఏఎ్‌సలు,

  • నాన్‌-కేడర్‌ అధికారుల బదిలీలు, పోస్టింగులు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఐఏఎ్‌సలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎ్‌సలతో పాటు నాన్‌-కేడర్‌ అధికారుల బదిలీలతో పాటు పోస్టింగ్‌లు ఇచ్చింది. సింగరేణి సంస్థ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ)గా సీనియర్‌ ఐఏఎస్‌ జ్యోతి బుద్ధప్రకాశ్‌ను నియమించింది. ప్రస్తుతం ఈ పోస్టులో ఉన్న కృష్ణభాస్కర్‌ను రిలీవ్‌ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు బుధవారం వేర్వేరు జీవోలను జారీ చేశారు. ప్రస్తుతం షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఉన్న జ్యోతి బుద్ధప్రకాశ్‌ను బదిలీ చేసి, సింగరేణికి పూర్తి స్థాయి సీఎండీగా నియమించింది. 1994 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి సవ్యసాచి ఘోష్‌కు మరిన్ని బాధ్యతలు అప్పగించింది. ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు యూనిట్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయనకు షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం అదనంగా ఉన్న గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సంక్షేమ కమిషనర్‌, గిరిజన సంక్షేమ కమిషనర్‌ పోస్టుల్లోనూ కొనసాగాలంటూ సవ్యసాచి ఘోష్‌ను ఆదేశించింది. జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించిన ప్రభుత్వం.. ప్రస్తుత జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఉన్న ఆర్‌వీ కర్ణన్‌నే కొత్తగా ఏర్పాటైన జీహెచ్‌ఎంసీకి కమిషనర్‌గా కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ఉమ్మడి జీహెచ్‌ఎంసీలో అదనపు కమిషనర్లుగా ఉన్న ఐఏఎస్‌ అధికారులు జి.సృజనను సైబరాబాద్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌గా, టి.వినయ్‌కృష్ణారెడ్డిని మల్కాజిగిరి కార్పొరేషన్‌ కమిషనర్‌గా నియమించింది. మరో ముగ్గురు నాన్‌-కేడర్‌ అధికారులను బదిలీ చేసి, పోస్టింగులు ఇవ్వగా, వెయిటింగ్‌లో ఉన్న మరో అధికారికి కూడా పోస్టింగ్‌ ఇచ్చింది. జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌ (యూసీడీ) పి.పంకజను బదిలీ చేసి, మల్కాజిగిరి వాటర్‌ బోర్డు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా నియమించింది. వెయిటింగ్‌లో ఉన్న మరో అదనపు కమిషనర్‌ సామ్రాట్‌ అశోక్‌ను హైదరాబాద్‌ వాటర్‌ బోర్డు ఈడీగా నియమించింది. రంగారెడ్డి జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల అధికారి ఎం.సంతో్‌షను బదిలీ చేసి, సైబరాబాద్‌ వాటర్‌ బోర్డు ఈడీగా; కార్మిక ఉపాధి, శిక్షణ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కె.శశికిరణాచారిని బదిలీ చేసి లోక్‌భవన్‌ జాయింట్‌ సెక్రటరీగా నియమించింది.


సింగరేణి కొత్త బాస్‌కు కత్తిమీద సామే!

బొగ్గు రూపంలో జెన్‌కో నుంచి, కరెంట్‌ రూపంలో డిస్కమ్‌ల నుంచి భారీగా బకాయిలు సింగరేణికి రావాల్సి ఉంది. లాభాలు కాగితాల్లో కనిపిస్తూ నగదు నిల్వలు తగ్గిపోవడంతో ప్రతి నెల ఉద్యోగుల జీతాలకు కూడా దిక్కులు చూడాల్సిన పరిస్థితి. మరోవైపు బొగ్గు గనులపై అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి.. కొత్త గనులు పొందాలంటే విధిగా వేలం పాటలో పాల్గొనాలనే నిబంధన సమస్యగా మారింది. ఇక భూగర్భ గనుల్లో బొగ్గు ఉత్పత్తి ధర భారీగా పెరగడం సింగరేణిని మరింత కష్టాల్లోకి నెట్టుతోంది. దేశంలోని ఇతర సంస్థలతో పోల్చితే సింగరేణి బొగ్గు ధర భారీగా ఉండటం.. బొగ్గు నాణ్యత నిరాశాజనకంగా ఉండటం సంస్థ ఎదుర్కొంటున్న సమస్యల్లో భాగంగా ఉన్నాయి. ఈ క్రమంలో సింగరేణి కొత్త చైర్మన్‌, మేనేజింగ్‌ (సీఎండీ) జ్యోతి బుద్ధప్రకాశ్‌కు ఈ సవాళ్లు కత్తిమీద సామే. వీటిని ఎలా ఎదుర్కొని సంస్థను ముందుకు తీసుకెళ్తారో మున్ముందు తేలనుంది. 2024 జనవరి తర్వాత సంస్థకు పూర్తిస్థాయిలో సీఎండీ నియామకం జరగలేదు. ఐఆర్‌ఎస్‌ అధికారి బలరామ్‌ రెండేళ్లు సీఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తించి గత డిసెంబరు 16న రిలీవ్‌ అయ్యారు. ఆ తర్వాత సంస్థ సీఎండీగా ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. తాజాగా ఆ స్థానంలో జ్యోతిబుద్ధప్రకాశ్‌ను నియమించారు. ప్రస్తుతం ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి, గిరిజన సంక్షేమశాఖ కమిషనర్‌గా ఆయన పనిచేస్తున్నారు.

Updated Date - Feb 12 , 2026 | 01:02 AM