Share News

Central Water Resources Board: హిమాయత్‌సాగర్‌, మూసీల్లో పూడిక!

ABN , Publish Date - Jan 15 , 2026 | 06:13 AM

పూడిక చేరికతో హిమాయత్‌సాగర్‌, మూసీల సామర్థ్యం ఆందోళనకరస్థాయిలో తగ్గింది. కృష్ణా నదికి ఉపనదులైన ఈసీపై నిర్మించిన హిమాయత్‌సాగర్‌, మూసీపై నిర్మించిన మూసీ రిజర్వాయర్‌లో ఏటా...

Central Water Resources Board: హిమాయత్‌సాగర్‌, మూసీల్లో పూడిక!

  • 3.8 నుంచి 2.6 టీఎంసీలకు పడిపోయిన హిమాయత్‌సాగర్‌ సామర్థ్యం

  • 4.83 నుంచి 4.09 టీఎంసీలకు తగ్గిన మూసీ స్టోరేజీ

  • 2084లో మూసీ డెడ్‌ స్టోరేజీ కనుమరుగు

  • కేంద్ర జలవనరుల సంఘం నివేదిక

హైదరాబాద్‌, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): పూడిక చేరికతో హిమాయత్‌సాగర్‌, మూసీల సామర్థ్యం ఆందోళనకరస్థాయిలో తగ్గింది. కృష్ణా నదికి ఉపనదులైన ఈసీపై నిర్మించిన హిమాయత్‌సాగర్‌, మూసీపై నిర్మించిన మూసీ రిజర్వాయర్‌లో ఏటా వరదతో పాటు వచ్చి చేరుతున్న పూడిక రేటు నిల్వ సామర్థ్యాన్ని కబళిస్తోందని కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) పేర్కొంది. హిమాయత్‌సాగర్‌ను 1927లో నిర్మించారు. అదే ఏడాది నిర్వహించిన సర్వే ప్రకారం జలాశయం గరిష్ట నిల్వ సామర్థ్యం(ఎ్‌ఫఆర్‌ఎల్‌) 3.8 టీఎంసీలు కాగా, 2020-21 నాటికి 2.68 టీఎంసీలకు పడిపోయింది. 94 ఏళ్లలో నికరంగా 1.12 టీఎంసీల (29.47శాతం) నిల్వ సామర్థ్యాన్ని జలాశయం కోల్పోయింది. 1963లో మూసీ రిజర్వాయర్‌ నిర్మించారు. అదే ఏడాది నిర్వహించిన సర్వే ప్రకారం జలాశయం గరిష్ట నిల్వ సామర్థ్యం 4.83 టీఎంసీలు కాగా, 2024 నాటికి 4.09 టీఎంసీలకు పడిపోయింది. గత 62 ఏళ్లలో జలాశయం పూడికతో 0.74 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయిందని పేర్కొంది. హిమాయత్‌ సాగర్‌ జలాశయంపై 2020-21 మధ్యకాలంలో శాటిలైట్‌ రిమోట్‌ సెన్సింగ్‌ డేటా ఆధారంగా, 2024లో మూసీ జలాశయంపై జాతీయ హైడ్రాలజీ ప్రాజెక్టు(ఎన్‌హెచ్‌పీ)లో భాగంగా హైడ్రోగ్రాఫిక్‌ సర్వే నివేదికల్లో ఈ విషయాన్ని సీడబ్ల్యూసీ వెల్లడించింది.


పూడికను అడ్డుకోకపోతే 2084లో మూసీలో డెడ్‌స్టోరేజీ పూర్తిగా కనుమరుగు కానుందని హెచ్చరించింది. ఈ నివేదికలను సీడబ్ల్యూసీ నీటిపారుదల శాఖకు పంపించి పూడిక తొలగింపునకు చర్యలు తీసుకోవాలని కోరింది. శాటిలైట్‌ రిమోట్‌ సెన్సింగ్‌ టెక్నాలజీ ఆధారంగా దేశ వ్యాప్తంగా ఉన్న జలాశయాల్లో పూడిక స్థితిగతులపై సీడబ్ల్యూసీ అధ్యయనాలు నిర్వహిస్తోంది. పూడికతో జలాశయాల నిల్వ సామర్థ్యంలో ఏటా కోతపడుతోంది. 1927 నుంచి 2020-21 మధ్యకాలంలో హిమాయత్‌ సాగర్‌ ఏటా సగటున 0.31 శాతం నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయినట్టు సీడబ్ల్యూసీ లెక్కతీసింది. ఇక మూసీ రిజర్వాయర్‌ 1963 నుంచి 2024 మధ్యకాలంలో ఏటా సగటున 0.25శాతం నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయింది.

Updated Date - Jan 15 , 2026 | 06:16 AM