Share News

kumaram bheem asifabad-మూగరోదన.. వినేదెవరు?

ABN , Publish Date - May 24 , 2026 | 10:39 PM

జిల్లాలో ముగజీవాల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. వాంకిడి, కౌటాల ప్రాంతం మీదుగా హైదరాబాద్‌ వరకు పశువుల తరలింపు వివిధ వాహనాల్లో తరలించి దళారులు సొమ్ము చేసుకొని లాభాలు గడిస్తున్నారు. ఈ తలింపులో మాఫియా తరహాలోనే ముఠా పని చేస్తుందనే ఊహగానాలున్నాయి. అక్రమంగా తరలిస్తున్న పట్టించుకోవాల్సిన అధికారులే అక్రమ దందాను సక్రమంగా చేసి ఈ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా జరుగుతుండడం విశేషం.

kumaram bheem asifabad-మూగరోదన.. వినేదెవరు?
చింతలమానేపల్లిలో తరలిస్తుండగా మృతి చెందిన పశువులు (ఫైల్‌)

- కానరాని కనీస నిబంధనలు

కాగజ్‌నగర్‌ టౌన్‌, మే 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ముగజీవాల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. వాంకిడి, కౌటాల ప్రాంతం మీదుగా హైదరాబాద్‌ వరకు పశువుల తరలింపు వివిధ వాహనాల్లో తరలించి దళారులు సొమ్ము చేసుకొని లాభాలు గడిస్తున్నారు. ఈ తలింపులో మాఫియా తరహాలోనే ముఠా పని చేస్తుందనే ఊహగానాలున్నాయి. అక్రమంగా తరలిస్తున్న పట్టించుకోవాల్సిన అధికారులే అక్రమ దందాను సక్రమంగా చేసి ఈ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా జరుగుతుండడం విశేషం. పశువుల తరలింపులో నకిలీ సర్టిఫికేట్లను తయారు చేసి వివిధ వాహనాల్లో తరలింపు చేస్తున్నట్టు, ఇందుకు ప్రభుత్వ అధికారులే సహకరిస్తున్నట్టు రెండ్రోజులుగా సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌ బాబు బహిరంగ ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు తెరలేపినట్లయింది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సరిహద్దులు సిర్పూర్‌కు ఉండడంతో అక్కడి నుంచి నేరుగా కౌటాలకు తరలించి అక్కడి నుంచి రైతుల ద్వారా కొనుగోలు చేసి తాము వ్యవసాయ పనులకు వినియోగించేందుకు తీసుకెళ్లుతున్నట్టు దరఖాస్తులు పెట్టుకొని పశువుల డాక్టర్‌ వద్ద సర్టిఫికెట్‌ తయారు చేసి ఇస్తున్నారు. ఇదంతా ఒక వైపు ఉండగా, మరో వైపు ఈ వాహనాలను రాత్రి వేళల్లోనే ఎందుకు తరలిస్తున్నారు..? అన్నీ సవ్యంగా ఉన్నప్పటికీ రాత్రి 12 గంటల తర్వాత తరలించడం ఏంటనే ప్రశ్నలకు అధికారుల వద్ద కూడా సమాధానం దొరకని పరిస్థితి ఉంది. వాహనాల్లో అనుమతికి మించి పశువులను తరలించడంతో గతేడాది పెద్దవాగు సమీపంలో, రెబ్బెన వద్ద, ఇటీవల చింతలమానేపల్లి వద్ద పశువులు మృత్యువాత పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ నెల 27న బక్రిద్‌ పండుగ ఉన్న నేపథ్యంలో నిత్యం వాహనాల్లో పశువులను తరలించడం ఎక్కువగా జరుగుతోందని చెబుతున్నారు. కౌటాల నుంచి లైన్‌ క్లియర్‌ కాగానే ఓ వాహనం ద్వారా అన్ని చెక్‌ పోస్టుల వద్ద ఎవరు ఉన్నారు..? ఎంత మంది ఉన్నారు..? అనే సమాచారం పక్కాగా తెలుసుకున్న పశువుల లోడ్‌ వాహనాలు ఒకే సారి ఐదు నుంచి ఆరు తరలిస్తున్నారు. పశువుల తరలింపు డాక్టర్‌ సర్టిఫికెట్‌ ఉంది..? గ్రామ పంచాయతీ నుంచి క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ ఉండడంతో అన్నీ చెక్‌ పోస్టుల్లో ఈ వాహనాలు ఆపేందుకు కూడా ఎవరు సాహసించడం లేదంటే ఈ దందా ఏ మేరకు చేరుకుందో ఇట్టే తెలుస్తోంది. వారంతపు సంతలో పశువుల క్రయ విక్రయాలు చేయాల్సి ఉండగా, నిత్యం పశువులు ఎక్కడి నుంచి వస్తున్నాయి..? జిల్లా అధికారులు పశువుల వార సంత నిలిపివేయాలని ఆదేశాలు ఈనెల 16న ఇచ్చినా తిరిగి 22న ఆదేశాలు నిలిపివేయడం బట్టి చూస్తే అంతరాష్ట్ర ముఠా ఏమేరుకు పని చేస్తుందోనని చర్చించుకుంటున్నారు. పశువులు తరలిస్తున్న వాహనానికి ఫిట్‌ నెస్‌ ఉందా..? ఎనియల్‌ యాక్టు-1960 ప్రకారం తరలింపులో వాటికి తగిన గాలి, నీరు, ఆహారం కల్పించాల్సి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే జంతు క్రూరత్వం, అక్రమ రవాణా కేసులు నమోదు చేసి వాహనాలు కూడా సీజ్‌ చేసే అధికారం అధికారులకు ఉంది. నిబంధనలన్ని కూడా పక్కన పెట్టేసి ఈ దందా నిత్యం కొనసాగిస్తున్నారు. ప్రతి రోజు ఐదు నుంచి పది వాహనాల్లో పశువులను తరలిస్తున్నారు. వీటి సమయం కూడా రాత్రి 12 గంటల నుంచి ప్రారంభం కావటం, ఉయదం ఐదు గంటల కల్లా హైదరాబాద్‌లో ఉండేట్లు తర్పీదు పొందిన డ్రైవర్లతో దందా కొనసాగిస్తున్నారు.

- నదిని దాటిస్తున్నారు..

సిర్పూర్‌ నియోజకవర్గానికి సరిహద్దుగా ఉన్న ప్రాణహితను అవతలి మహారాష్ట్ర నుంచి నదిని దాటిస్తున్నారు. నాటు పడవకు తాళ్లతో కట్టి ఒక్కసారిగా పదుల సంఖ్యలో మూగజీవాలను ఈడ్చుకుంటు కౌటాల, తదితర పరివాహక ప్రాంతాలకు తరలించి వారాంతపు సంతల్లో విక్రయిస్తున్నారు. రవాణా, తరలింపులో పలు పశువులు మృత్యువాత పడ్డ సంఘటన దళారుల క్రూరత్వానికి అద్దం పడుతున్నాయి. జిల్లాలో పోలీసుల ఆధ్వర్యం లో 11 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. మూగ జీవాల అక్రమ తరలింపు విషయంలో సిర్పూర్‌ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు డీజీపీతో పాటు పశు సంవర్థకశాఖ మంత్రి శ్రీహరికి వినతి పత్రాలు అందించారు. ఇటీవల చింతలమానెపల్లి మండలంలోని గూడెం వద్ద చెక్‌పోస్టు వద్ద ఓ లారీలో 37 ఆవులు, 3 దూడలను తరలిస్తుండగా పట్టుకున్నారు. ఎస్పీ నితికా పంత్‌ ప్రత్యేక నిఘా పెట్టి అర్థరాత్రి ప్రత్యేకంగా తనిఖీలు చేస్తున్నారు.

ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు..

- హరీష్‌బాబు, సిర్పూర్‌ ఎమ్మెల్యే

పశువుల అక్రమ రవాణా కౌటాల కేంద్రంగా కొనసాగుతోంది. వెటర్నరి డాక్టర్లు అనుమతికి మించి సర్టిఫికెట్లు ఇవ్వాలని ఒత్తిడి చేసి అక్రమరవాణాకు ఆజ్యం పోస్తున్నారు. కౌటాల పశువుల వార సంత మూసి వేసి తిరిగి ఐదు రోజుల్లోనే ప్రారంభించారు. నిత్యం వివిధ వాహనాల్లో హైదరాబాద్‌ ప్రాంతాలకు తరలిస్తున్నారు. చెక్‌ పోస్టులలో కూడా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి.

Updated Date - May 24 , 2026 | 10:39 PM