Blast Case Investigation: సిగాచీ ఎండీని అరెస్ట్ చేశాం
ABN , Publish Date - Jan 01 , 2026 | 07:58 AM
దాదాపు 60 మందికి పైగా కార్మికుల ప్రాణాలను బలిగొన్న పాశమైలారం సిగాచీ ఇండస్ట్రీస్ భారీ పేలుడు ఘటనకు సంబంధించి..
పరారీలో మరో ఐదుగురు నిందితులు
పేలుడు తర్వాత కనిపించకుండా పోయిన 8 మంది కార్మికులు మృతి
దుర్ఘటనకు ఒకరిదే బాధ్యత అని చెప్పలేం
హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం, దర్యాప్తు అధికారులు
హైదరాబాద్, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): దాదాపు 60 మందికి పైగా కార్మికుల ప్రాణాలను బలిగొన్న పాశమైలారం సిగాచీ ఇండస్ట్రీస్ భారీ పేలుడు ఘటనకు సంబంధించి.. ఆ కంపెనీ ఎండీ, సీఈవో అమిత్‌రాజ్ సిన్హాను అరెస్ట్ చేశామని రాష్ట్ర ప్రభుత్వం, దర్యాప్తు అధికారులు హైకోర్టుకు తెలియజేశారు. మరో ఐదుగురు నిందితులు కనిపించకుండాపోయారని.. వారిని సైతం అరెస్ట్ చేస్తామని, పూర్తి వివరాలతో దిగువ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేస్తామని పేర్కొన్నారు. పేలుడు అనంతరం.. కనిపించకుండాపోయిన ఎనిమిది మంది సైతం మృతిచెందినట్లు గుర్తించామని న్యాయస్థానానికి వెల్లడించారు. సిగాచీ పేలుడుపై దర్యాప్తు నత్తనకడన సాగుతోందని.. ఆ దుర్ఘటనలో చనిపోయినవారి కుటుంబాలకు పరిహారం చెల్లించడం లేదని పేర్కొంటూ రిటైర్డ్ సైంటిస్ట్ కలపల బాబురావు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై గతంలో విచారణ చేపట్టిన హైకోర్టు.. సిగాచీ పేలుడుకు సంబంధించి అప్పటివరకూ ఎలాంటి అరెస్టులూ చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. పరిశ్రమల విభాగంతోపాటు, ఇతర అన్ని శాఖల బాధ్యత ఎంటో తేల్చాలని ఆదేశాలు జారీచేసింది. బుధవారం ఈ పిటిషన్ మరోసారి.. చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్, జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. విచారణకు దర్యాప్తు అధికారుల బృందం సభ్యులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం, దర్యాప్తు అధికారుల తరఫున ఏఏజీ తేరా రజినీకాంత్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ కేసులో 300 మంది సాక్షులను విచారించామని తెలిపారు. చట్టప్రకారం నియంత్రణ సంస్థలు, వివిధ ప్రభుత్వశాఖల అధికారులందరినీ విచారించినట్లు పేర్కొన్నారు.
దర్యాప్తు దాదాపు పూర్తికావచ్చిందని.. పూర్తి వివరాలతో ట్రయల్ కోర్టు ఎదుట చార్జిషీట్ దాఖలు చేస్తామని తెలిపారు. కనిపించకుండాపోయిన ఎనిమిది మంది కార్మికులు మృతిచెందినట్లు గుర్తించామని.. వారి కుటుంబాలకు కూడా పూర్తి పరిహారం అందజేస్తామని పేర్కొన్నారు. ఈ దుర్ఘటనకు ప్రత్యేకంగా ఫలానా వ్యక్తే కారణం అని చెప్పలేమని పేర్కొన్నారు. సిగాచీ పరిశ్రమ తరఫు సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్‌రెడ్డి వాదిస్తూ.. పేలుడులో చనిపోయిన బాధిత కార్మికుల కుటుంబాలకు పరిశ్రమ తరఫున రూ.42 లక్షల చొప్పున చెల్లించామని తెలిపారు. ప్రకటించిన రూ.కోటి పరిహారంలో మిగతా రూ.58 లక్షలను.. చట్టప్రకారం ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. అయితే ఇది ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్‌మెంట్ కాదని స్పష్టం చేశారు. కంపెనీ ఎండీని పోలీసులు అరెస్ట్ చేశారని.. ఈ వ్యాజ్యానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ ప్రభావం ట్రయల్ కోర్టుపై ఉండే అవకాశం ఉందని, కంపెనీ ఎండీకి బెయిల్ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయని తెలిపారు. కాబట్టి ఈ వ్యాజ్యం ప్రభావం లేకుండా స్వతంత్రంగా బెయిల్‌పై విచారణ చేపట్టేలా దిగువ కోర్టుకు ఆదేశాలు జారీచేయాలని కోరారు. పరారీలో ఉన్న నిందితుల తరఫున, ఇప్పటికే అరెస్ట్ అయిన ఎండీ తరఫున బెయిల్ పిటిషన్‌లు దాఖలు చేస్తామని తెలిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వసుధా నాగరాజ్ వాదిస్తూ.. సిగాచీ కంపెనీ స్వయంగా ఇస్తానన్న రూ.కోటి పరిహారం పూర్తిగా ఇవ్వలేదని.. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. వాదనలూ విన్న ధర్మాసనం.. దర్యాప్తులో, బాధిత కుటుంబాలకు పరిహారం విషయంలో పురోగతి ఉన్నందున తదుపరి వివరాలు తెలియజేయాలని పేర్కొంటూ విచారణను 29కి వాయిదా వేసింది. పిల్ ప్రొసీడింగ్స్ ప్రభావం ట్రయల్ కోర్టుపై ఉండదని.. కేసులో మెరిట్ ఆధారంగా ట్రయల్ కోర్టు నిర్ణయం తీసుకుంటుందని స్పష్టంచేసింది.