Share News

kumaram bheem asifabad-ఆశావహుల పక్కచూపులు

ABN , Publish Date - Jan 22 , 2026 | 10:41 PM

మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో రాజకీయం రోజురోజుకు రంజుగా మారుతోంది. మున్సిపల్‌ ఎన్నికల బరిలో నిలవడమే లక్ష్యంగా పోటీలు నిలువాలనుకునే వారు ఎత్తుగడలు వేస్తున్నారు. ఒక పార్టీ టికెట్‌ ఇవ్వకపోతే మరో పార్టీ నుంచి దక్కించుకునే యత్నం చేస్తున్నారు. మున్సిపల్‌ ఎన్నికలకు ఇప్పటి వరకు తుది ఓటరు జాబితా, చైర్మన్‌, వార్డుల వారిగా రిజర్వేషన్‌ ఖరారు కావడంతో పార్టీలన్నీ క్షేత్ర స్థాయిలో కసరత్తు ప్రారంభించాయి.

kumaram bheem asifabad-ఆశావహుల పక్కచూపులు
లోగో

- ఒక పార్టీ టికెట్‌ ఇవ్వకపోతే మరో పార్టీ నుంచి దక్కించుకునే యత్నం

కాగజ్‌నగర్‌, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో రాజకీయం రోజురోజుకు రంజుగా మారుతోంది. మున్సిపల్‌ ఎన్నికల బరిలో నిలవడమే లక్ష్యంగా పోటీలు నిలువాలనుకునే వారు ఎత్తుగడలు వేస్తున్నారు. ఒక పార్టీ టికెట్‌ ఇవ్వకపోతే మరో పార్టీ నుంచి దక్కించుకునే యత్నం చేస్తున్నారు. మున్సిపల్‌ ఎన్నికలకు ఇప్పటి వరకు తుది ఓటరు జాబితా, చైర్మన్‌, వార్డుల వారిగా రిజర్వేషన్‌ ఖరారు కావడంతో పార్టీలన్నీ క్షేత్ర స్థాయిలో కసరత్తు ప్రారంభించాయి. నోటిఫికేషన్‌ కోసం అంతా నిరీక్షిస్తున్నారు. ముఖ్యంగా కౌన్సిలర్‌ టికెట్ల కోసం ఆశావహుల మధ్య పోటీ తీవ్రమవుతోంది. టికెట్‌ దక్కే అవకాశాలు లేవని స్పష్టమవుతుండడంతో కొందరు నేతలు వెంటనే ఇతర పార్టీల వైపు చూపు మళ్లిస్తున్నారు. దీంతో రోజు రోజుకు చేరికలు పెరుగుతూ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.

- వార్డుల వారీగా

వార్డుల వారీగా బలాబలాలను అంచనా వేసేందుకు బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఎవరికి టికెట్‌ ఇస్తే గెలుపు ఖాయమవుతుందన్న అంశంపైనే ప్రధానంగా దృష్టి పెట్టాయి. ఈ క్రమంలో స్థానిక నాయకులు ఇంటింటా తిరుగుతూ అభిప్రాయాలు సేకరిస్తున్నారు. టికెట్‌ ఎంపిక విషయంలో తప్పు జరిగితే పార్టీకి నష్టం తప్పదన్న భావనతో అధిష్టానాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. కాగా బీజేపీ నుంచి ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌ బాబు, కాంగ్రెస్‌ నుంచి ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ దండే విఠల్‌, బీఆర్‌ఎస్‌ నుంచి డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వార్డుల్లో తిరుగుతున్నారు. ఇక బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలో ఇప్పటికే టికెట్‌ ప్రక్రియ కొనసాగుతుండగా, బీ ఫాం, క్లియరెన్స్‌ అంశాలు కీలకంగా మారాయి. మరో వైపు బీఆర్‌ఎస్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. సిర్పూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ప్రాధాన్యతతో టికెట్‌ కేటాయింపుపై ఉత్కంఠ నెలకొంది. బీఆర్‌ఎస్‌ బీ ఫాం ఎవరికి కేటాయిస్తారు..? ఇటు కోనప్పకా లేక అటు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కు అప్పజెప్పుతారన్న విషయంలో బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో నరాలు తెగే టెన్షన్‌ ఏర్పడింది. ఈ విషయంలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ మాత్రం టికెట్లకు సంబంధించి బీ ఫాం అందజేత ప్రక్రియ అంతా కూడా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కేటీఆర్‌ అంతా చూసుకుంటారని ప్రకటించారు. సిర్పూరు నియోజకవర్గంలో వర్గ పోరు లేదని, కేవలం కేసీఆర్‌ వర్గమే ఉందని స్పష్టం చేశారు. కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం టికెట్ల కేటాయింపు ధర్మ సంకట పరిస్థితి నెలకొంది. ఈ పార్టీలో టికెట్‌ ఇచ్చిన బీ ఫాం అందక పోతే భవితవ్యం ఎంటన్న ప్రశ్న చుట్టు స్థానికంగా చర్చ సాగుతోంది. పార్టీ మారుతారా..? స్వతంత్రంగా బరి లో దిగుతారా..? లేక మౌనంగా ఉండీ పోతారా..? అన్న అంశాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. మున్సిపల్‌ ఎన్నికలు పార్టీలకు మాత్రమే కాదు, ఆశావహ నేతలకు కూడా అగ్ని పరీక్షగా మారుతాయన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Updated Date - Jan 22 , 2026 | 10:41 PM