6,429 బస్తాల యూరియా మాయం
ABN , Publish Date - Jun 29 , 2026 | 04:43 AM
ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చే యూరియా బస్తాల కోసం ఓ పక్క రైతులు పడిగాపులు పడుతుంటే.. కొందరు వ్యాపారులు కాసులు కక్కుర్తితో...
సిద్దిపేటలో హోల్‌సేల్, రిటైల్ డీలర్ల చేతివాటం.. ప్రభుత్వ ‘యూరియా’ యాప్ వల్ల బయటపడ్డ మోసం
రైతులకు రూ.266కు ఇవ్వాల్సిన బస్తాను.. రూ.1000 చొప్పున బాంబుల పరిశ్రమకు అమ్మేశారని ఆరోపణలు
ఆలస్యంగా బయటకు.. నామమాత్రపు చర్యలతో సరి
సదరు వ్యాపారులపై కేసుల నమోదు, ఓ వ్యవసాయాధికారి బదిలీ
సంగారెడ్డి, జూన్ 28 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చే యూరియా బస్తాల కోసం ఓ పక్క రైతులు పడిగాపులు పడుతుంటే.. కొందరు వ్యాపారులు కాసులు కక్కుర్తితో ఆ యూరియా బస్తాలను దారి మళ్లిస్తున్నారు. సిద్దిపేటకు చెందిన కొందరు వ్యాపారులు రైతులకు విక్రయించాల్సిన ఒకటి, రెండు కాదు ఏకంగా 6,429 యూరియా బస్తాలను పక్కదారి పట్టించారు. వ్యవసాయ శాఖ యూరియా యాప్ ద్వారా ఈ భారీ మోసం వెలుగు చూసింది. రైతులకు రూ.266 చొప్పున విక్రయించాల్సిన బస్తాను సదరు వ్యాపారులు రూ.1000 చొప్పున ఓ బాంబుల పరిశ్రమకు అమ్మి డబ్బు చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అసలేం జరిగిందంటే.. సిద్దిపేటలోని హోల్‌సేల్ డిస్ట్రిబ్యూటర్లు ఆంజనేయ ఫర్టిలైజర్స్, గణేష్ ట్రేడర్స్ నుంచి చేర్యాలలోని శ్రీసాయి శివ ఫర్టిలైజర్స్‌కు సబ్సిడీ యూరియా బస్తాలు బదిలీ అయ్యాయి. వ్యవసాయ శాఖ యాప్ ప్రకారం శ్రీసాయి శివ ఫర్టిలైజర్స్ వద్ద 6,429 యూరియా బస్తాలు ఉన్నాయి. కానీ ఆ దుకాణం నుంచి రైతులకు బస్తాలు అందడంలో తీవ్ర జాప్యం జరిగింది. ఈ విషయాన్ని గమనించిన వ్యవసాయ శాఖ అధికారులు ఈ నెల 9వ తేదీన సదురు దుకాణానికి చెందిన గోదాములో తనిఖీ చేశారు. 6,429 బస్తాలు ఉండాల్సిన చోట ఒకేఒక్క బస్తా కనిపించింది. యూరియా బస్తాలను రైతులకు విక్రయించారనేందుకు ఎలాంటి ఆధారాలు కూడా లేవు. దీంతో శ్రీసాయిశివ ఫర్టిలైజర్ యజమాని సందీప్ రెడ్డి, హోల్‌సేల్ డీలర్ల అయిన గణేశ్ ట్రేడర్స్, ఆంజనేయ ఫర్టిలైజర్స్ యజమానులపై వ్యవసాయ శాఖ అధికారులు చేర్యాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారిపై కేసులు నమోదయ్యాయి. మరోపక్క, యూరియా బస్తాలు పక్కదారి పట్టినా పట్టించుకోకుండా విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన చేర్యాల వ్యవసాయ శాఖ అధికారిని ఉన్నతాధికారులు మరో విభాగానికి బదిలీ కూడా చేశారు. అయితే, ఈ ఘటన జరిగి ఇన్ని రోజులవుతున్నా ఈ వ్యవహారంలో తదుపరి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కాగా, వ్యాపారులు 3వేల ఎకరాలకు సరిపడా యూరియాను దారిమళ్లించారని, ఇప్పుడు తమ పంటల పరిస్థితేంటి ? అని రైతులు ఆందోళన చెందుతున్నారు.
బాంబుల ఫ్యాక్టరీలకి యూరియా!
సిద్దిపేటలో రైతులకు చెందాల్సిన యూరియాను బాంబుల తయారీ పరిశ్రమలకు తరలించారనే ఆరోపణలు ఉన్నాయి. పేలుడు పదార్థాల తయారీలో యూరియాను వినియోగిస్తారు. బాంబుల తయారీ పరిశ్రమలు యూరియా పరిశ్రమల నుంచి తమకు కావాల్సిన యూరియాను కొనుగోలు చేస్తుంటాయి. ఈ పరిశ్రమలకు ఒక్కో బస్తాకు రూ.2000 దాకా ఖర్చవుతుంది. ప్రభుత్వం రైతులకు రాయితీపై ఇచ్చే యూరియా బస్తా ధర రూ.266 మాత్రమే. దీంతో ఎరువుల డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లు, బాంబుల ఫ్యాక్టరీ వారితో కుమ్మకై ఒక్కో బస్తాను రూ. వెయ్యికి విక్రయించినట్టు తెలుస్తోంది. చేర్యాలలోని 6,429 బస్తాలను ఇలానే బాంబుల ఫ్యాక్టరీకి తరలించారని తెలిసింది. యూరియా యాప్ రాక ముందు లక్షలాది బస్తాలు ఇలానే పక్కదారి పట్టాయని ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఆ బాంబుల తయారీ పరిశ్రమలు ఎక్కడున్నాయి? అనే వివరాలు తెలియాల్సి ఉంది.