కుటుంబం జలసమాధి
ABN , Publish Date - Aug 21 , 2026 | 05:35 AM
సిద్దిపేట జిల్లా అప్పనపల్లి వద్ద ఘోరం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న వ్యవసాయ బావిలో పడిపోయింది.
బావిలోకి దూసుకెళ్లిన కారు.. భార్యాభర్తలు, ఇద్దరు పిల్లల దుర్మరణం
సిద్దిపేట జిల్లా అప్పనపల్లి వద్ద ప్రమాదం
బంధువు అంత్యక్రియలకు హాజరై తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా ఘటన
మృతుడు రాజు తండ్రి రెండేళ్ల క్రితం.. తల్లి 4 నెలల క్రితం మృతి
దుబ్బాక రూరల్, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): సిద్దిపేట జిల్లా అప్పనపల్లి వద్ద ఘోరం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న వ్యవసాయ బావిలో పడిపోయింది. ఈ ఘటనలో కారు బానెట్ నుంచి డిక్కీ అంచుదాకా నిలువునా నీళ్లలో మునిగిపోవడంతో లోపలున్న నలుగురూ ఊపిరాడకపోవడంతో మృతిచెందారు. మృతులు దుబ్బాక మండలం బల్వంతాపూర్ గ్రామానికి చెందిన దండుగుల రాజు (33), అతడి భార్య భాగ్యలక్ష్మి (26), కుమారుడు నిహాన్ష్ (4), కుమార్తె శాన్విక (2)! బావ దశదినకర్మ కోసం రాజు తన కుటుంబసభ్యులతో కలిసి బుధవారం కారులో సిద్దిపేట వెళ్లి, ఆ కార్యక్రమం ముగించుకొని సాయంత్రం బల్వంతాపూర్‌కు తిరిగివస్తుండగా ఈ ఘటన జరిగింది. రోడ్డు మూలమలుపు వద్ద వాహనంపై రాజు నియంత్రణ కోల్పోవడంతోనే ఈ ఘటన జరిగినట్టు భావిస్తున్నారు. రాజు స్థానికంగా ఇసుక వ్యాపారం చేస్తుంటాడు. దశదినకర్మ కార్యక్రమం ముగిశాక సాయంత్రం రాజు, అతడి భార్యాపిల్లలు ఇంటికి కారులో తిరుగు ప్రయాణమయ్యాడు. రాత్రి అయినా వారు ఇంటికి చేరుకోకపోవడం.. రాజుకు ఫోన్ చేసినా, భాగ్యలక్ష్మికి ఫోన్ చేసినా స్విచ్‌ఆ్‌ఫ వస్తుండటంతో అతడి సోదరుడి కుటుంబసభ్యుల్లో ఆందోళన మొదలైంది. ఘటనపై రాజు సోదరుడు యాదగిరి దుబ్బాక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
పోలీసులు రాజు ఫోన్ ఆధారంగా అప్పనపల్లి సమీపంలో లొకేషన్‌ను ట్రేస్ చేసి గ్రామస్థులకు సమాచారం అందించారు. స్థానికులు అదేరోజు రాత్రి అక్కడికి వెళ్లారు. రోడ్డు పక్కనే ఉన్న బావిలో టార్చి వేసి చూడగా కారు డిక్కీ పైభాగం కనిపించింది. వెంటనే విషయాన్ని పోలీసులకు చెప్పారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని రెండు, మూడు గంటలు శ్రమించి క్రేన్ సాయంతో కారును బయటకు తీశారు. అప్పటికే లోపల నలుగురూ ప్రాణాలు విడిచారు. మృతదేహాలను తెల్లవారుజామున పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం బల్వంతాపూర్ గ్రామంలో నలుగురి అంత్యక్రియలను నిర్వహించారు. రెండేళ్ల క్రితమే రాజు తండ్రి దర్గయ్య మృతిచెందాడు. నాలుగునెలల క్రితం రాజు తల్లి లక్ష్మి కరెంట్ షాక్‌తో మృతిచెందింది. ఇప్పుడు రాజుతో పాటు అతడి భార్య, పిల్లలు కూడా మృతిచెందడంతో ఆ కుటుంబమే అంతమైపోయింది.
అధికారుల నిర్లక్ష్యంతోనే..
ప్రమాదకరంగా ఉన్న రోడ్డు పక్కన బావికి రిటర్నింగ్ వాల్ నిర్మించాలని ఎన్నోసార్లు ఆర్‌అండ్‌బీ అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని అప్పనపల్లి గ్రామస్థులు మడిపడుతున్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు..