సిద్దిపేట మున్సిపల్ కమిషనర్‌పై వేటు
ABN , Publish Date - Jun 06 , 2026 | 04:39 AM
రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్‌కుమార్‌పై చర్యలు తీసుకుంది.
రాష్ట్ర అవతరణ వేడుకల కోసం జిల్లా కేంద్రంలో ఏర్పాట్లు సరిగా చేయలేదంటూ సస్పెన్షన్
కలెక్టర్ ఫిర్యాదుతో చర్యలు
స్టాళ్లు ఏర్పాటు చేయని అధికారులకూ నోటీసులు
సిద్దిపేట జూన్ 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్‌కుమార్‌పై చర్యలు తీసుకుంది. ఆయనను సస్పెండ్ చేస్తూ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ) టీకే శ్రీదేవి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. విధి నిర్వహణలో విఫలమైనందుకు ఈ చర్య తీసుకున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 2న సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో అధికారిక కార్యక్రమం జరిగింది. ఇందులో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమం ఏర్పాట్లు, నిర్వహణలో జిల్లా యంత్రాంగం నుంచి ప్రొటోకాల్, జాతీయ పతాకావిష్కరణ, జాతీయ గీతం, తెలంగాణ రాష్ట్ర గీతం ఆలాపన విషయంలో స్పష్టమైన ఆదేశాలున్నా.. మున్సిపల్ కమిషనర్ బేఖాతరు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. వేడుకలకు మున్సిపల్ సిబ్బంది, ప్రజలను సమీకరించడంలో విఫలమయ్యారు. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్‌కుమార్ తీరుపై మున్సిపాలిటీ స్పెషలాఫీసర్, జిల్లా కలెక్టర్ కె.హైమావతి మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అవతరణ వేడుకలకు కూడా ఆయన హజరుకాలేదని, ప్రజావాణి వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని పేర్కొన్నట్టు తెలిసింది. ఈ క్రమంలో ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. కాగా, అవతరణ వేడుకలకు హాజరుకాని, స్టాళ్లు ఏర్పాటు చేయని పలు శాఖలకు చెందిన 15 మంది జిల్లా స్థాయి అధికారులు, 150 మంది ఉద్యోగులకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఎందుకు హాజరుకాలేదో, పథకాల లబ్ధిదారులను ఎందుకు సమీకరించలేదో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. దీంతో వివరణ ఇచ్చేందుకు పలు శాఖల అధికారులు, ఉద్యోగులు శుక్రవారం అడిషనల్ కలెక్టర్ చాంబర్ వద్ద క్యూ కట్టారు.
ఫ్లెక్సీల వివాదమూ కారణమే?
సిద్దిపేటలో ఇటీవల ఓ నాయకుడి జన్మదినం సందర్భంగా స్థానిక బీజేఆర్ చౌరస్తా వద్ద పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దానిని తొలగించాలని అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకులు మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. కానీ తొలగించలేదు. ఆయన సస్పెన్షన్‌కు ఇది కూడా కారణమై ఉండొచ్చనే చర్చ జరుగుతోంది.