కేదార్‌నాథ్‌లో అన్నదానానికి 14న సిద్దిపేట నుంచి సరుకులతో లారీ
ABN , Publish Date - Apr 12 , 2026 | 04:01 AM
కేదార్‌నాథ్‌లో భక్తుల ఆకలి తీర్చేందుకు, వారికి అన్న ప్రసాదం అందించేందుకు సిద్దిపేటలోని ‘కేదార్‌నాథ్ అన్నదాన సేవా సమితి’ మరోసారి సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు...
సిద్దిపేట కల్చరల్, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): కేదార్‌నాథ్‌లో భక్తుల ఆకలి తీర్చేందుకు, వారికి అన్న ప్రసాదం అందించేందుకు సిద్దిపేటలోని ‘కేదార్‌నాథ్ అన్నదాన సేవా సమితి’ మరోసారి సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు 5సార్లు అక్కడ అన్న ప్రసాద వితరణ చేసిన సమితి ఈ సారి కూడా కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ మేరకు శనివారం స్థానిక శ్రీదాసాంజనేయ స్వామి దేవాలయంలో సమితి సభ్యులు కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సేవాసమితి అధ్యక్షుడు చీకోటి మధుసూధన్‌తో పాటు సభ్యులు మాట్లాడారు. అన్నప్రసాద వితరణ కోసం ఈ నెల 14న సరుకుల లారీ బయలుదేరి వెళ్తుందని, ఈ లారీని ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రారంభిస్తారని తెలిపారు. గతంలో సోన్‌ప్రయాగ వద్ద భోజనం అందించే వాళ్లమని, ప్రస్తుతం దానితో పాటు కేదార్‌నాథ్ గుడికి దగ్గరలో మరో లంగర్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు.ఉదయం 4గంటల నుంచి రాత్రి ఒంటి గంట వరకు భక్తులకు ఆహారం అందిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 110 మంది సభ్యుల సహకారంతో ఈ సేవ చేస్తున్నట్లు వారు చెప్పారు.