Share News

హత్యలతోనే ఉపాధి!

ABN , Publish Date - Aug 17 , 2026 | 06:08 AM

నడిపేది కిరాణా దుకాణం.. చేసేది మాత్రం హత్యలు, దొంగతనాలు. ఇతరులతో గొడవలు ఉన్న మహిళలే వారి లక్ష్యం. అక్రమ డబ్బు సంపాదనే లక్ష్యంగా ఓ మహిళ తన మైనర్‌ కుమారుడితో కలిసి ఇద్దరు మహిళలను దారుణంగా హత్య చేసింది.

హత్యలతోనే ఉపాధి!

  • ఇతరులతో గొడవలు ఉన్నవారే ఆమె టార్గెట్‌

  • మైనర్‌ కొడుకుతో కలిసి ఇద్దరు మహిళల్ని గొంతు నులిమి చంపి, పెట్రోల్‌ పోసి తగులబెట్టిన మహిళ

  • అనారోగ్యంతో ఉన్న భర్తకు జీవిత బీమా చేసి.. ఆపై అతన్ని చంపేందుకు నిందితురాలి పథకం

  • సిద్దిపేట జిల్లాలో హత్య కేసుల్ని ఛేదించిన పోలీసులు

సిద్దిపేట క్రైం, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): నడిపేది కిరాణా దుకాణం.. చేసేది మాత్రం హత్యలు, దొంగతనాలు. ఇతరులతో గొడవలు ఉన్న మహిళలే వారి లక్ష్యం. అక్రమ డబ్బు సంపాదనే లక్ష్యంగా ఓ మహిళ తన మైనర్‌ కుమారుడితో కలిసి ఇద్దరు మహిళలను దారుణంగా హత్య చేసింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలో మూడు నెలల్లో వరుసగా జరిగిన ఇద్దరు మహిళల హత్య కేసులను పోలీసులు ఛేదించారు. ఆ వివరాలను సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్‌ ఆదివారం వెల్లడించారు. మండలంలోని భూంపల్లి గ్రామానికి చెందిన చాకలి రజిత అనే మహిళ తన భర్త దుబ్బయ్య, మైనర్‌ కుమారుడితో కలిసి నివసిస్తూ స్థానిక డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల వద్ద కిరాణా షాపు, టీస్టాల్‌ నడుపుతోంది. దుబ్బయ్య అనారోగ్యంతో మంచానికి పరిమితమయ్యాడు. రజిత అక్రమంగా డబ్బు సంపాదించాలని.. అందుకు పోలీసులకు దొరకకుండా బంగారం దొంగలించి హత్యలు చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకు తన మైనర్‌ కొడుకును ఉపయోగించుకుంది. వీరు టీ షాపు వద్ద కూర్చున్న వారి కదలికలను గమనిస్తుండేవారు. వారిలో ఆస్తి తగాదాలు ఇతర గొడవలు ఉన్న వ్యక్తులను, ముఖ్యంగా ఒంటరి మహిళలను గుర్తించి వారి వద్ద ఉన్న బంగారు నగలను దొంగిలించి ప్రాణాలు తీస్తారు. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండే రేఖ(25) అనే మహిళను ఈ ఏడాది మే నెలలో హత్యచేసి, ఒంటిపై ఉన్న నగలను దొంగిలించి స్థానిక అడవుల్లో పెట్రోల్‌ పోసి తగులబెట్టారు.


ఆమెను చంపితే ఇన్‌స్టాగ్రామ్‌లో మాట్లాడేవారిపై పోలీసులకు అనుమానం వస్తుందని ఆమెను ఎంచుకున్నారు. ఈ నెల 7న అదే గ్రామానికి చెందిన అతికం విజయ(45) అనే మరో మహిళను కూడా అదేవిధంగా హత్యచేశారు. ఆమెకు తన దాయాదులతో భూతగాదాలు ఉన్నాయి. ఆమె కనిపించకపోతే వారిపైనే పోలీసులకు అనుమానం వస్తుందని ఆమెను ఎంచుకుని హత్య చేశారు. మృతదేహాన్ని స్థానిక అచ్చాయిపల్లి అడవిలోకి తీసుకువెళ్లి కాల్చివేద్దాం అనుకున్నారు. కానీ వర్షం బాగా పడుతుండడంతో మార్గంమధ్యలో ఉన్న రామక్కపేట గ్రామం దగ్గర రోడ్డు పక్కన మృతదేహాన్ని వేసి పెట్రోల్‌ పోసి నిప్పు అంటించారు. పాక్షికంగా కాలిన మృతదేహాన్ని గమనించిన గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సీసీ ఫుటేజ్‌ల ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. దర్యాప్తులో తేలిన వివరాల ఆధారంగా వెంటనే అచ్చాయిపల్లి అడవిలోకి వెళ్లి అక్కడ పూర్తిగా కాలిన రేఖ పుర్రెను స్వాధీనం చేసుకున్నారు. గతేడాది జూన్‌ నెలలో ఇదే గ్రామంలో ఒంటరిగా వాకింగ్‌కి వెళ్తున్న అన్నపూర్ణ అనే మహిళను దారుణంగా కొట్టి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును దొంగలించుకపోయినట్లు నిందితులు ఒప్పుకొన్నారు. అనారోగ్యంతో ఉన్న భర్త దుబ్బయ్యకు బీమా చేయించి చంపాలని, మరో ముగ్గురు ఒంటరి మహిళలనూ చంపేసి బంగారం నగలు తీసుకోవాలని రజిత పథకం వేసినట్లు దర్యాప్తులో తేలింది. నిందితుల నుంచి రూ.10 లక్షల సొత్తు, 5.1 తులాల బంగారు ఆభరణాలు, 53 తులాల వెండి ఆభరణాలు, రెండు మొబైల్‌ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రజితను జ్యుడీషియల్‌ రిమాండ్‌కు, బాలుడిని జువైనల్‌ హోమ్‌కు పంపించారు.

Updated Date - Aug 17 , 2026 | 06:11 AM