Share News

ఆత్మహత్యకు ప్రేరేపించడం.. నేరమే

ABN , Publish Date - Feb 18 , 2026 | 05:12 AM

కలసి చనిపోదామనే ఒప్పందం(మ్యూచువల్‌ సూసైడ్‌ ప్యాక్ట్‌)లో బతికి ఉన్న వాళ్లు దోషులేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఇద్దరూ కలిసి ఆత్మహత్యకు యత్నించినప్పుడు అందులో ఒకరు ప్రాణాలతో బయటపడితే..

ఆత్మహత్యకు ప్రేరేపించడం.. నేరమే

  • సినీ నటి ప్రత్యూష కేసులో సిద్ధార్థరెడ్డికి రెండేళ్ల జైలు శిక్షను ఖరారు చేసిన సుప్రీం

  • ‘అన్‌ ప్రొఫెషనల్‌’గా మునిస్వామి నివేదిక

  • విషం కొనుగోలు ముమ్మాటికీ తప్పే

  • సిద్ధార్థరెడ్డి 4 వారాల్లో లొంగిపోవాలి

  • హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): కలసి చనిపోదామనే ఒప్పందం(మ్యూచువల్‌ సూసైడ్‌ ప్యాక్ట్‌)లో బతికి ఉన్న వాళ్లు దోషులేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఇద్దరూ కలిసి ఆత్మహత్యకు యత్నించినప్పుడు అందులో ఒకరు ప్రాణాలతో బయటపడితే.. అది ఆ వ్యక్తి చేసిన నేరంగానే పరిగణించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. సినీ నటి ప్రత్యూష కేసులో ఆమె స్నేహితుడైన సిద్ధార్థ రెడ్డే స్వయంగా విష పదార్థం కోనుగోలు చేసినట్లు తేలిందని, అతడు ముమ్మాటికీ దోషేనని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. 24 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన సినీనటి ప్రత్యూష కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన సుప్రీం ధర్మాసనం.. నిందితుడు సిద్ధార్థ రెడ్డికి రెండేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. నాలుగు వారాల్లోగా లొంగిపోవాలని సిద్ధార్థరెడ్డిని ఆదేశించింది. 2002 ఫిబ్రవరి 23న సినీనటి ప్రత్యూష, ఆమె స్నేహితుడు సిద్ధార్థ రెడ్డి కూల్‌ డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకొని తాగి ఆత్మహత్యకు యత్నించారు. మరుసటి రోజు ప్రత్యూష మరణించగా, ఆస్పత్రిలో చికిత్స తర్వాత సిద్ధార్థ రెడ్డి కోలుకున్నాడు. ప్రత్యూష మృతిపై పలు అనుమానాలు రావడంతో అప్పటి ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. అప్పట్లో విచారణ చేపట్టిన ట్రయల్‌ కోర్టు.. 2004 ఫిబ్రవరి 23న సిద్ధార్థ రెడ్డిని దోషిగా తేల్చింది. ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు ఐపీసీ సెక్షన్‌ 306 కింద ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5,000 జరిమానా విధించింది. ఆత్మహత్యాయత్నం చేసినందుకు ఐపీసీ సెక్షన్‌ 309 కింద మరో ఏడాది శిక్ష విధించింది.


ట్రయల్‌ కోర్టు తీర్పును సవాలు చేస్తూ సిద్ధార్థ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అదేక్రమంలో తన కుమార్తె మృతికి సిద్ధార్థ రెడ్డే కారణమని, అతడికి కఠిన శిక్ష విధించాలని ప్రత్యూష తల్లి సరోజినీ దేవి కూడా హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన అప్పటి ఉమ్మడి ఏపీ హైకోర్టు.. 2011 డిసెంబరు 28న తీర్పు వెలువరించింది. సిద్ధార్థ రెడ్డికి ట్రయల్‌ కోర్టు విధించిన 5 ఏళ్ల జైలు శిక్షను 2 ఏళ్లకు తగ్గించి, జరిమానాను రూ.50,000కు పెంచింది. ఈ తీర్పును సిద్ధార్థ రెడ్డి సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. తనను నిర్దోషిగా ప్రకటించాలని అభ్యర్థించారు. మరోవైపు.. తన కుమార్తె మరణానికి సిద్దార్థ రెడ్డినే కారణమని, అతడికి యావజ్జీవ శిక్ష విధించాలని ప్రత్యూష తల్లి సరోజినీ దేవి కూడా అదే ఏడాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ రెండు పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. గత ఏడాది నవంబరులో తీర్పును రిజర్వ్‌ చేసింది. మంగళవారం జస్టిస్‌ రాజేష్‌ బిందాల్‌, జస్టిస్‌ మన్మోహన్‌తో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరిస్తూ.. సిద్ధార్థరెడ్డికి రెండేళ్ల జైలు శిక్ష విధించడాన్ని సమర్థించింది.


సుప్రీం కోర్టు పేర్కొన్న అంశాలు ఇవీ..

  • ప్రత్యూషను గొంతు నులిమి చంపారన్న

  • ఆరోపణలకు సరైన ఆధారాలు లేవు.

  • నిపుణుల కమిటీనివేదిక పరిశీలించిన తర్వాత ప్రత్యూష విషం తీసుకుందని నిర్ధారణ అవుతోంది.

  • నిందితుడు సిద్ధార్థ రెడ్డి ప్రత్యూషపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలు రుజువు కాలేదు.

  • చాలా కాలం తర్వాత అత్యాచారం ఆరోపణలు చేయడం సరికాదు. దానికీ సరైన ఆధారాలు లేవు.

  • డాక్టర్‌ మునిస్వామి సమర్పించిన పోస్టుమార్టం నివేదిక అశాస్ర్తీయంగా, బాధ్యతారహితంగా ఉంది. ఆయన తీరు ‘అన్‌ ప్రొఫెషనల్‌’గా ఉంది.

  • నివేదికను అధికారికంగా సమర్పించకముందే.. అసంపూర్తి సమాచారాన్ని మునిస్వామి బహిర్గతం చేశారు. కేసు దారి మళ్లడానికి ఇదే కారణం.

  • హైదర్‌గూడలోని ‘రేవతి ఏజెన్సీలలో పని చేస్తున్న సేల్స్‌మాన్‌ అనిల్‌(పీడబ్ల్యూ-34) వద్ద ‘నువాక్రాన్‌’ అనే విషాన్ని నిందితుడు కొన్నాడు. హిమాయత్‌నగర్‌లోని ‘ఫుడ్‌వరల్డ్‌’లో ఉన్న ఆనంద్‌ రావు(పీడబ్ల్యూ-35) వద్ద చాక్లెట్‌, కత్తి ేసకరించాడు.

  • ఈ కేసులో పరిస్థితుల ప్రభావం, సాక్ష్యాలు స్పష్టంగా నిందితుడికి వ్యతిరేకంగా ఉన్నాయి.

  • కూల్‌డ్రింక్‌లో ఏదో కలిపామని, అది ప్రమాదవశాత్తు జరిగిందన్న వాదనను తిరస్కరిస్తున్నాం.

  • విషం కొన్నది సిద్ధార్థరెడ్డే అని సాక్ష్యాలతో రుజువైంది. ఆత్మహత్యకు ప్రేరేపించడం నేరమే.

  • ఇద్దరు పరస్పర అంగీకారంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు.. అందులో ఒకరు చనిపోయి, మరొకరు బతికితే.. చట్టప్రకారం బతికున్న వ్యక్తి ఆ మరణానికి బాధ్యుడవుతాడు.


మునిస్వామి నివేదిక ‘అన్‌ ప్రొఫెషనల్‌’

డాక్టర్‌ మునిస్వామిని విచారించకపోవడం వల్లే ఈ కేసులో స్పష్టత లోపించిందని ప్రత్యూష తల్లి తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ప్రత్యూష గొంతు పిసికి చంపినట్లుగా ఆధారాలు ఉన్నాయని మునిస్వామి నివేదికలో ఉందని గుర్తుచేశారు. ఈ క్రమంలో ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ‘‘డాక్టర్‌ మునిస్వామిని విచారించాల్సిన అవసరం లేదని కోర్టు భావిస్తోంది. ఎందుకంటే ఆయన ఇచ్చిన నివేదికను ముగ్గురు సభ్యుల నిపుణుల కమిటీ, ఎయిమ్స్‌ కమిటీ పూర్తిగా తప్పుబట్టాయి. ఇది గొంతు పిసికి చంపిన కేసు కాదు, విషప్రయోగం వల్ల జరిగిన మరణమని అవి స్పష్టం చేశాయి. డాక్టర్‌ మునిస్వామి అన్‌ ప్రొఫెషనల్‌గా వ్యవహరించారు’’ అని ధర్మాసనం పేర్కొంది. ప్రత్యూష మరణానికి విషప్రయోగమే కారణమని, చేతులతో గొంతు నులిమి చంపినట్లు ఎటువంటి ఆధారాలు లేవని, ఆమె మరణానికి ముందు లైంగిక దాడి జరిగినట్లు ఆధారాలు లేవని డాక్టర్‌ ఎం.నారాయణ రెడ్డి నేతృత్వంలోని కమిటీ నివేదిక ఇచ్చిన విషయాన్ని ధర్మాసనం గుర్తుచేసింది. ‘గొంతు పిసికి చంపడం ఆమె మరణానికి కారణం కాదు. ఆమెపై లైంగికదాడి జరిగినట్టు ఆధారాలు దొరకలేదు. అత్యాచారం జరిగిందనే సూచనలు లేనందున, దర్యాప్తు కోసం ఆమె దుస్తులను సేకరించాల్సిన అవసరం పోలీసులకు రాలేదు’ అని సుప్రీంకోర్టు పేర్కొంది.


  • మాకు న్యాయం జరగలేదు

  • నా కూతురిని అత్యాచారం చేసి చంపేశారు

  • న్యాయం కోసం పోరాడతా: ప్రత్యూష తల్లి

సుప్రీంకోర్టు తీర్పును ప్రత్యూష తల్లి సరోజిని స్వాగతించారు. అయితే, తమకు పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదని, దోషికి యావజ్జీవ శిక్ష పడుతుందని ఆశించినా.. ఆ దిశగా ఉత్తర్వులు రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. డాక్టర్‌ మునిస్వామి ఇచ్చిన రిపోర్టును పోలీసులు, న్యాయస్థానం పరిగణనలోకి తీసుకొని ఉంటే కచ్చితంగా దోషులకు కఠిన శిక్ష పడి ఉండేదని అభిప్రాయపడ్డారు. ‘‘నా కూతురు ఆత్మహత్య చేసుకోలేదు. అత్యాచారం చేసి చంపేశారు. దోషికి యావజ్జీవ శిక్ష పడి ఉంటే మా అమ్మాయి ఆత్మకు శాంతి కలిగేది. 24 ఏళ్లుగా నాది ఒంటరి పోరాటం. మెడికో లీగల్‌ కేసు కింద ప్రత్యూష ఆస్పత్రిలో చేరినప్పుడు ఆమె ధరించిన దుస్తులు భద్రపరచాల్సి ఉండగా.. తగలబెట్టామని చెప్పారు. డబ్బు, అధికారం, పరపతిని ఉపయోగించి సాక్ష్యాలను నాశనం చేశారు. గాంధీ ఆస్పత్రి మార్చురీలో నిర్జీవంగా పడి ఉన్న ప్రత్యూష మెడపై పంటి గాట్లు గమనించి డాక్టర్లను అడిగితే.. చికిత్స చేసేటప్పుడు జరిగినవని బదులిచ్చారు. ప్రత్యూషపై అత్యాచారం జరిగిందని మునిస్వామి నివేదిక వెల్లడించినా.. పక్కన పెట్టేశారు. నెల గడిచిన తర్వాత ముగ్గురు వైద్యులతో త్రిసభ్య కమిటీ వేశారు. వాళ్లు ఇచ్చిన రిపోర్టును మాత్రమే ఇప్పటిదాకా కోర్టులకు సమర్పిస్తున్నారు. కనీసం పోస్టుమార్టం చేసినప్పటి వీడియోలు, ఫొటోలను బయటపెట్టలేదు. సుప్రీంకోర్టు తీర్పు కాపీ చదివిన తర్వాత మా న్యాయవాది సలహాతో ముందుకు వెళతాను. నా కుమార్తె చావుకు కారణమైన వారికి తగిన శిక్షపడే వరకు పోరాటం కొనసాగిస్తా’’ అని పేర్కొన్నారు.

Updated Date - Feb 18 , 2026 | 07:01 AM