డంపింగ్ యార్డు హఠావో.. సిద్ధాపూర్ బచావో
ABN , Publish Date - Jul 11 , 2026 | 06:36 AM
రంగారెడ్డి జిల్లా కొత్తూర్ మండల పరిధిలోని సిద్దాపూర్‌లో ఎకోటౌన్ (డంపింగ్‌యార్డు)కు ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో గ్రామస్థులు ఆందోళనకు దిగారు.
ఆందోళనకు దిగిన గ్రామస్థులు.. తీవ్ర ఉద్రిక్తత
జవహర్‌నగర్‌కు వెళ్లే యత్నం.. అడ్డుకున్న పోలీసులు
ఆపై పాదయాత్రకు సిద్ధమైన వందలాది మహిళలు
మళ్లీ అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్టు
కొత్తూర్, జూలై 10 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా కొత్తూర్ మండల పరిధిలోని సిద్దాపూర్‌లో ఎకోటౌన్ (డంపింగ్‌యార్డు)కు ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ‘డంపింగ్ యార్డు హఠావో.. సిద్ధాపూర్ బచావో’ నినాదంతో గ్రామానికి చెందిన పలువురు మహిళలు శుక్రవారం హైదరాబాద్‌లోని జవహర్‌నగర్ డంపింగ్ యార్డు ప్రాంతాన్ని పరిశీలించేందుకు బస్సులో వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు చీపుర్లు చేతపట్టుకుని బస్సు ముందు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి, షాద్‌నగర్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో పోలీసులకు, గ్రామస్తులకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరిగింది. కోపోద్రిక్తులైన గ్రామస్తులు బీజేపీ నేత పాలమూరు విష్ణువర్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో నినాదాలు చేస్తూ పాదయాత్రగా ముందుకు సాగారు. మళ్లీ పోలీసులు వారిని అడ్డుకోవడంతో గ్రామస్తులు తిరిగి ఆందోళనకు దిగారు. విష్ణువర్దన్‌రెడ్డితో పాటు పలువురు బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేసి కొత్తూర్ పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా మహిళలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. డంపింగ్ యార్డు జీవోను ఉపసంహరించుకునేంత వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని మహిళలు హెచ్చరించారు. సిద్దాపూర్‌లోనే బస చేస్తూ ఆందోళనలు చేస్తామని విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. చివరకు పోలీసులు ఆందోళనకారులతో మాట్లాడి శాంతింపజేశారు. అరెస్ట్ అయిన వారిని కొత్తూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించి, సాయంత్రం విడుదల చేశారు. ప్రస్తుతం గ్రామంలో పోలీసు పికెటింగ్ కొనసాగుతోంది.