SI Caught Red Handed Taking Bribe: పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా కేసు నిందితుడి పేరు తీసేందుకు 30 వేలు డిమాండ్
ABN , Publish Date - Jan 03 , 2026 | 03:11 AM
అసలే పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా కేసు.. అందులో తన పేరు తొలగించాలని సంబంధిత ఎస్సైకి సదరు లారీ యజమాని అభ్యర్థన..
20 వేల లంచంతో ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ఎస్‌ఐ
రామచంద్రాపురం, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): అసలే పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా కేసు.. అందులో తన పేరు తొలగించాలని సంబంధిత ఎస్సైకి సదరు లారీ యజమాని అభ్యర్థన.. దానికి రూ.30 వేల లంచం డిమాండ్ చేసిన ఎస్‌ఐ.. తీరా రూ.20 వేలు లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఘటన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోని సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీ్‌సస్టేషన్‌లో చోటు చేసుకుంది. ఏసీబీ మెదక్ డీఎస్పీ సుదర్శన్ తెలిపిన వివరాల మేరకు తెల్లాపూర్‌లో అక్రమంగా పీడీఎస్ బియ్యం రవాణాపై 2 నెలల క్రితం పోలీసులు కేసు నమో దు చేశారు. ఈ కేసులో తన పేరు తొలగించాలని 2025 డిసెంబరు 17న ఎస్సై రమేశ్‌ను లారీ యజమాని ఆశ్రయించాడు. రూ.30 వేలు లంచం కావాలని డిమాండ్ చేసిన ఎస్సైకి అదేరోజు రూ.5,000 చెల్లించాడు. మిగతా మొత్తం కూడా ఇవ్వాలని ఎస్సై అడగడంతో సదరు లారీ యజమాని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు ఎస్సై రమేశ్‌కు రూ.20 వేల నగదు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎస్సైపై కేసు నమోదు చేసి హైదరాబాద్ అదనపు ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరిచినట్లు డీఎస్పీ సుదర్శన్ తెలిపారు.