శుభక్షేత్ర వెంచర్స్ కేసులో ప్రధాన నిందితుడి అరెస్టు
ABN , Publish Date - Apr 17 , 2026 | 04:33 AM
మైక్రో ఫైనాన్స్, స్థిరాస్తిలో పెట్టుబడుల పేరుతో హైదరాబాద్‌లో వెలుగు చూసిన రూ.150 కోట్ల భారీ మోసం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 16 (ఆంధ్ర జ్యోతి): మైక్రో ఫైనాన్స్, స్థిరాస్తిలో పెట్టుబడుల పేరుతో హైదరాబాద్‌లో వెలుగు చూసిన రూ.150 కోట్ల భారీ మోసం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో ప్రధాన నిందితులలో ఒకరైన రామావత్ మధును గురువారం సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మధు, అతని సహచరులు గోకుల నందన ఇన్‌ఫ్రా పేరుతో ఓ కంపెనీని ఏర్పాటు చేశారు. పఠాన్‌చెరులో, సంగారెడ్డి జిల్లా దామరగిద్దలో శుభక్షేత్ర పేరుతో వెంచర్లు ప్రారంభించినట్లు నకిలీ ప్రచారం మొదలు పెట్టారు. రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే హైదరాబాద్ శివారులో 102 గజాల ప్లాటు రిజిస్టర్ చేయడంతో పాటు, 42 నెలల పాటు రూ. 25 వేల చొప్పున చెల్లిస్తామని ప్రకటనలు గుప్పించారు. వాటిని నమ్మిన అనేక మంది బాధితులు అందులో రూ. కోట్ల పెట్టుబడులు పెట్టి మోసపోయారు. నిందితులు మైక్రో ఫైనాన్స్ పేరుతో కూడా ప్రజల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.