‘శుభక్షేత్ర’ కేసులో హేమకాంత్‌రెడ్డి అరెస్టు
ABN , Publish Date - May 03 , 2026 | 05:06 AM
హైదరాబాద్‌లో శుభక్షేత్ర ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో అమాయకుల నుంచి రూ.కోట్లు కొల్లగొట్టిన కేసులో మరో ప్రధాన నిందితుడు హేమకాంత్‌రెడ్డిని సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు అరెస్టు చేశారు.
అతడిని విచారిస్తే కీలక సమాచారం తెలిసే అవకాశం
రమావత్ మధుకు ముగిసిన పోలీస్ కస్టడీ
మధు నుంచి మంగ్లీ ఖతాకు 25 లక్షలు వెళ్లినట్లు గుర్తింపు
అందులో 20 లక్షలను ఆమె తిరిగిచ్చినట్లు సమాచారం
హైదరాబాద్ సిటీ, మే 2(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో శుభక్షేత్ర ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో అమాయకుల నుంచి రూ.కోట్లు కొల్లగొట్టిన కేసులో మరో ప్రధాన నిందితుడు హేమకాంత్‌రెడ్డిని సైబరాబాద్ ఈవోడబ్ల్యూ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో కీలక నిందితుడైన రమావత్ మధును ఇప్పటికే అరెస్టు చేసి నాలుగు రోజులు విచారించారు. శనివారంతో మధు పోలీస్ కస్టడీ ముగియటంతో అతడిని న్యాయస్థానంలో హాజరుపరిచి జైలుకు తరలించారు. అదే రోజు హేమకాంత్‌రెడ్డి పోలీసులకు దొరకడం గమనార్హం. మధు నుంచి పోలీసులు పలు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. ఒక ఫ్లాట్ కొనుగోలు విషయమై మాత్రమే మధు నుంచి గాయని మంగ్లీ ఖాతాకు రూ.25 లక్షలు వెళ్లినట్లు గుర్తించారు. అయితే, రూ.20 లక్షలను మంగ్లీ వెంటనే తిరిగి చెల్లించినట్లు ఆధారాలు లభించాయని సమాచారం.
హేమకాంత్ వద్దేఅసలు చిట్టా..?
శుభక్షేత్ర పేరుతో జరిగిన ఆర్థిక మోసంలో మధు, హేమకాంత్‌రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హేమకాంత్‌రెడ్డి పోలీసులకు చిక్కడంతో ఈ మోసంలో అసలు సూత్రదారులు, పాత్రదారులు ఎవరు..? కొల్లగొట్టిన డబ్బును ఏం చేశారు..? ఎక్కడ భూములు కొన్నారు..? ఎవరెవరు ఎంత పంచుకున్నారు..? అనేది పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. మంగ్లీతో, ఆమె తమ్ముడు శివ చౌహాన్‌తో దిగిన ఫొటోలు, వీడియోలను హేమకాంత్ రెడ్డి ప్రచారానికి ఎక్కువగా వినియోగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో ఇదే ముఠా నల్లగొండ జిల్లాలో గోకులనంద ఇన్‌ఫ్రా పేరుతో రూ. కోట్లలో కొట్టేసినట్లు గుర్తించిన పోలీసులు.. సీఐడీలో 5 కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు. ఆ కేసు విచారణలో ఉండగానే శుభక్షేత్ర పేరుతో మియాపూర్‌లో కార్యాలయం ప్రారంభించి సైబరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెట్టుబడులు సేకరించారు. రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే 102 గజాల స్థలాన్ని రిజిస్టర్ చేయడంతో పాటు.. ప్రతి నెలా 5 శాతం చొప్పున 42 నెలలపాటు రిటర్న్‌లు వస్తాయని ప్రజలను నమ్మించారు. ఈ కేసులో మిగిలిన నిందితులు భరత్, శివ, శైలజ కోసం పోలీసులు గాలిస్తున్నారు.