Share News

శ్రావణం.. శుభప్రదం

ABN , Publish Date - Aug 13 , 2026 | 01:40 AM

ఆషాఢ మాసంలో ముహూర్తాలు లేకపోవడంతో నిలిచిపోయిన వివాహాల సందడి శ్రావణంలో మళ్లీ మొదలవనుంది. శ్రావణ మాసం గురువారం నుంచి ప్రారంభం కానుంది. నెలన్నర రోజులుగా వేడుకలు పెద్దగా లేకపోవడంతో వివిధ వృత్తుల వారు, వ్యాపారులు ఉపాధికి దూరమయ్యారు. మళ్లీ ముహూర్తాలు మొదలు కానుండడంతో

శ్రావణం.. శుభప్రదం

జగిత్యాల, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ఆషాఢ మాసంలో ముహూర్తాలు లేకపోవడంతో నిలిచిపోయిన వివాహాల సందడి శ్రావణంలో మళ్లీ మొదలవనుంది. శ్రావణ మాసం గురువారం నుంచి ప్రారంభం కానుంది. నెలన్నర రోజులుగా వేడుకలు పెద్దగా లేకపోవడంతో వివిధ వృత్తుల వారు, వ్యాపారులు ఉపాధికి దూరమయ్యారు. మళ్లీ ముహూర్తాలు మొదలు కానుండడంతో డెకరేషన్‌, ఫోటోగ్రఫీ, ఈవెంట్లు, కేటరింగ్‌తో పాటు జ్యూవెలరీ, వస్త్ర, కిరాణ తదితర వ్యాపారాలకు మరింత గిరాకీ పెరగనుంది. ఈ మాసంలో ఒక వైపు నోములు, వ్రతాలు, పండుగలతో ఇళ్లు, ఆలయాలు, దుకాణాలు కళకళలాడుతుంటాయి. సామూహిక వరలక్ష్మీ వ్రతాలు, పవిత్రోత్సవాలు, కృష్ణాష్టమి, రాఖీ పౌర్ణమి, నాగుల పంచమి వంటి వేడుకలు వరుసగా జరగనున్నాయి. జిల్లాలో వివాహాల కోలహాలం, గృహ ప్రవేశాలు, గృహ నిర్మాణాలు ప్రారంభం, నామకరణం ఉత్సవాలు ఆరంభం కానున్నాయి. శ్రావణ మాసం ప్రారంభం అవుతుండడంతో మంచి ముహూర్తాలల్లో పెళ్లిళ్లు జరిపించడానికి తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారు. జిల్లాలోని ప్రధాన పట్టణాలయిన జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్‌ పట్టణాలతో పాటు పలు గ్రామాల్లో అధిక సంఖ్యలో వివాహ వేడుకలు జరగనున్నాయి.

ఫఇవీ శుభ ముహూర్తాలు..

వివాహానికి యోగ్యమైన ముహూర్తాలను పండితులు సూచిస్తున్నారు. శ్రావణ మాసం ప్రారంభం తదుపరి ఈనెల 16వ తేదీ, 17, 20, 21, 22, 23, 26, 27, 28, 29, 30వ తేదీల్లో పలు ముహూర్తాలు ఉన్నట్లు పురోహితులు అంటున్నారు. సెప్టెంబరు నెల 3వ తేదీ, 4, 5, 7, 8, 10వ తేదీల్లో సైతం వివాహాలు జరిపించుకునే అవకాశాలున్నాయంటున్నారు. భూమి పూజలు, శంకుస్థాపనలు, గృహ ప్రవేశాలు, కేశ ఖండనాలు, ప్రతిష్ఠాపనల నిర్వాహకులు పురోహితులను సంప్రదించి ముహూర్తాలను నిర్ణయించుకుంటున్నారు. మళ్లీ ఆశ్వయుజ, కార్తిక మాసాల్లో శుభకార్యాలు నిర్వహించుకోవడానికి వీలుగా ముహూర్తాలున్నాయని వేద పండితులు అంటున్నారు.

ఫఫంక్షన్‌హాళ్ల ముందస్తు బుకింగ్‌లు...

జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో పెళ్లిళ్లు జరగనుండడంతో తల్లిదండ్రులు ముందస్తు పనులపై దృష్టి సారించారు. ఈ మూడు నెలల ముహూర్తాల్లో సుమారు వెయ్యికి పైగా వివాహాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఫంక్షన్‌హాళ్లు, క్యాటరింగ్‌, పురోహితులు, భాజా భజంత్రీలు, ఆర్కెస్ట్రా, డెకరేషన్‌, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ స్టుడియోలు ఇలా పెళ్లికి అవసరమైన వాటిని ముందస్తుగా బుక్‌ చేసుకోవడంపై దృష్టి సారించారు. అదేవిధంగా వివాహాలకు అవసరమైన పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు ముందస్తు కొనుగోలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో సుమారు 150 వరకు ఫంక్షన్‌ హాళ్లు, సుమారు 300 వరకు కమ్యూనిటీ హాళ్లు, పదుల సంఖ్యల్లో దేవాలయాల్లో పెళ్లి మండపాలున్నాయి. వీటిని ముందస్తుగా బుక్‌ చేసుకోవడంపై వివాహాల నిర్వాహకులు దృష్టి సారించారు.

ఫఊపందుకోనున్న వ్యాపారాలు...

పెళ్లిళ్ల సీజన్‌ ప్రారంభం కానుండడంతో జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో పలు వ్యాపారాలు జోరుగా సాగనున్నాయి. షాపింగ్‌మాల్స్‌, బట్టల దుకాణాలు, జ్యూవెల్లరీ దుకాణాలు, లేడిస్‌ ఎంపోరియంలు, ఫొటో స్టూడియోలు, వీడియోగ్రఫీ సెంటర్లు, ఫ్రీ వెడ్డింగ్‌ షూట్‌ స్టూడియోలు, ఫంక్షన్‌హాల్స్‌, క్యాటరింగ్‌ కేంద్రాలు, ఫ్లవర్‌ డెకరేటర్స్‌, వంట మాస్టర్స్‌ ఇలా పలు వ్యాపారాలు పుంజుకోనున్నాయి. ప్రధానంగా జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లిలలో బంగారం, వస్త్ర వ్యాపారం ఎక్కువగా ఉంటుంది. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి నూతన డిజైన్లతో కూడిన వస్త్రాలను వ్యాపారులు తీసుకువచ్చి విక్రయానికి సిద్ధంగా ఉంచారు. వినియోగదారులను ఆకర్షించడానికి డిస్కౌంట్‌లు, ఇతర బహుమతులను అందిస్తామని ప్రచారం చేస్తున్నారు. వివాహాల సీజన్‌లో జిల్లా మొత్తంగా రోజుకు రూ. కోటి నుంచి రూ.మూడు కోట్ల వరకు వ్యాపార లావాదేవీలు జరుగుతాయని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Updated Date - Aug 13 , 2026 | 01:40 AM