kumaram bheem asifabad- ‘ఉపాధి’లో క్షేత్ర సహాయకుల కొరత
ABN , Publish Date - Feb 21 , 2026 | 10:45 PM
ఉపాధి హామీ పథకంలో క్షేత్ర సహాయకుల (ఫీల్డ్ అసిస్టెం ట్ల) కొరత ఏర్పడింది. జిల్లాలో 335 పంచాయతీల్లో కేవలం 160 మంది మాత్రమే పని చేస్తున్నారు. దీంతో కూలీలకు చేయూత కరవవుతోంది.
- కూలీలకు తప్పని ఇబ్బందులు
- నియామకంపై సర్కార్‌కు పట్టింపు కరువు
బెజ్జూరు, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకంలో క్షేత్ర సహాయకుల (ఫీల్డ్ అసిస్టెం ట్ల) కొరత ఏర్పడింది. జిల్లాలో 335 పంచాయతీల్లో కేవలం 160 మంది మాత్రమే పని చేస్తున్నారు. దీంతో కూలీలకు చేయూత కరవవుతోంది. గ్రామాల్లో వలసలు నివారిస్తూ ఉపాధితో పాటు అన్నదాతలకు చేయూత అందించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఏటా వేసవిలో వ్యవసాయ పనులు తక్కువగా ఉండటంతో ఉపాధి పనులకు కూలీలు అధిక సంఖ్యలో హాజరవుతుంటారు. కొత్తగా ఏర్పడ్డ పంచాయతీల్లో క్షేత్ర సహాయకులను నియమించకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొత్త పంచాయతీలు ఏర్పడి దాదాపు పదేళ్లు కావస్తున్నా ఇప్పటికి ఆ పంచాయతీల్లో నియామకం లేకపోవడంతో ఉన్న క్షేత్ర సహాయకులే రెండు, మూడు పంచాయతీలకు పనులు చూడడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
- వారే కీలకం..
గ్రామాల్లో కూలీలకు పనులు కల్పించడం, మస్టర్ల కేటాయింపు, పనుల పర్యవేక్షణ, జాబ్ కార్డుల మంజూరు, అధార్ అనుసంధానం, కూలీలకు వసతి ఏర్పాటు వంటి పనులను క్షేత్ర సహాయకులే పని చేస్తున్నారు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం 335పంచాయతీలున్నాయి. వీటిలో 160మంది క్షేత్ర సహాయకులు పని చేస్తున్నారు. జిల్లాలో కొత్తగా 175 పంచాయతీలు ఏర్పడ్డాయి. కానీ క్షేత్ర సహాయకులను మాత్రం నియమించలేదు. దీంతో అనుభవం ఉన్న కూలీలను మేట్‌గా గుర్తించి పనులు చేయించే బాధ్యత అప్పగిస్తున్నారు. ఇలా కొందరు క్షేత్ర సహాయకులు అదనపు గ్రామాల ఉపాధి పనుల బాధ్యతలను చూసుకోవాల్సి వస్తోంది. మరికొద్ది రోజుల్లో వ్యవసాయ పనులు పూర్తయ్యే దశకు చేరడంతో ఇక గ్రామాల్లో ఉపాధి పనులు ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో జిల్లాలో పూర్తిస్థాయిలో క్షేత్ర సహాయ కులు లేని కారణంగా అదనపు పంచాయతీల భారంతో ఇబ్బందులు పడుతున్నారు. కొత్త పంచాయతీలు ఏర్పడి పదేళ్లు కావస్తున్నా ఇప్పటికి పాత వారితోనే పనులు చేయిస్తుండటంతో అవస్థలు తప్పడం లేదు.
- పర్యవేక్షణ కొరవడి..
మేట్‌లు చురుకైన వారు లేనిచోట్ల పంచాయతీ కార్యదర్శులు ఉపాధి పనుల బాధ్యత చూసుకుంటున్నారు. దీంతో వారు పంచాయతీ పనులతో పాటు ఉపాధి పనులపై దృష్టి సారించలేకపోతున్నారు. మేట్‌లు ఎలాంటి తప్పిదాలు చేసినా క్షేత్ర సహాయకులు, పంచాయతీ కార్యదర్శులు బాధ్యులు కావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వారికి పూర్తిస్థాయి బాధ్యతలు లేకపోవడంతో ఉపాధి పనుల్లో పురోగతి లేకుండా పోతోందని ప్రజలు పేర్కొంటున్నారు. గ్రామాలకు కొత్త పనులు కేటాయించడం, ఉపాధి గ్రామసభలు నిర్వహించడం, హాజరు నమోదు, కూలీలకు వేతనాలు మంజూరు వంటి విషయాల్లో పర్యవేక్షణ కొరవడుతోంది. దీంతో సరైన సమయానికి కూలీ డబ్బులు జమ కాకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. జాబ్ కార్డుకు వంద రోజుల పనులు కల్పించడంలో విఫలం అవుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా జాబ్ కార్డులు 1,22లక్షలు ఉండగా, 1.61లక్షల మంది కూలీలు పని చేస్తున్నారు. క్రియాశీలకంగా ఉన్న కార్డులు 88వేలు, మొత్తం కూలీలు 2.39లక్షలమంది ఉన్నారు. ఇందులో ఎస్సీలు 16.21శాతం, ఎస్టీలు 36.87శాతం మంది కూలీలు ఉన్నారు.
ఆదేశాలు వస్తే నియమిస్తాం..
- దత్తారాం, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి
కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీలకు క్షేత్ర సహాయకుల నియామకాలకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. వస్తే వెంటనే నియామకాలు చేపడుతాం. ప్రస్తుతం గ్రామాల్లో ఉపాధి పనుల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. సమస్య తలెత్తకుండా ఉండేందుకు ఇప్పటికే కొందరికి అదనపు బాధ్యతలు కూడా అప్పగించాం.. ఉపాధి పనులకు ఎలాంటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నాం.