Karimnagar: భార్య వలపు వల.. భర్త వీడియో రికార్డింగ్
ABN , Publish Date - Jan 15 , 2026 | 04:38 AM
ఇన్‌స్టాగ్రామ్‌లో అర్ధనగ్న ఫొటోలు, వీడియోలు పోస్టు చేసి వలపువల విసిరే ఓ మహిళ.. తన వలలో పడిన వారు డబ్బిస్తే వాళ్లతో ఏకాంతంగా గడిపేది.
కరీంనగర్‌లో ఓ దంపతుల గలీజు దందా
అర్ధనగ్న ఫొటోలు, వీడియోలతో ఇన్‌స్టాగ్రామ్‌లో భార్య ఎర
నమ్మివచ్చిన వారితో రాసలీలలు
గుట్టుచప్పుడు కాకుండా వీడియోలు తీసే ఆమె భర్త
వాటితో బ్లాక్‌మెయిల్, లక్షలు వసూలు
బాధితుల్లో వ్యాపారులు, వైద్యులు
నిందితుల అరెస్టు
కరీంనగర్ క్రైం, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): ఇన్‌స్టాగ్రామ్‌లో అర్ధనగ్న ఫొటోలు, వీడియోలు పోస్టు చేసి వలపువల విసిరే ఓ మహిళ.. తన వలలో పడిన వారు డబ్బిస్తే వాళ్లతో ఏకాంతంగా గడిపేది. ఆ సమయంలో ఆమె భర్తే గుట్టుగా వీడియోలు తీసేవాడు. ఆపై దంపతులిద్దరూ ఆ వీడియోలను చూపి బెదిరింపులకు దిగి అందినకాడికి దోచుకునేవారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రెండేళ్లుగా ఈ గలీజు దందాకు పాల్పడుతున్న కరీంనగర్‌కు చెందిన దంపతుల బాధితుల్లో వ్యాపారులు, వైద్యులు, వైద్య విద్యార్థులు, పలువురు యువకులు ఉన్నారు. ఓ బాధితుడి ఫిర్యాదుతో దంపతుల గుట్టును బట్టబయలు చేసిన పోలీసులు.. నిందితులను కటకటాల్లోకి నెట్టారు. కరీంనగర్ రూరల్ సీఐ ఏ నిరంజన్‌రెడ్డి కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లాకు చెందిన దంపతులు పదేళ్లుగా కరీంనగర్‌లోని ఆరెపల్లిలో నివాసం ఉంటున్నారు. భర్త గ్రానైట్, ఇంటీరియర్ డిజైన్ వ్యాపారం చేయగా, భార్య యూట్యూబ్ చానల్ నిర్వహిస్తోంది. భర్త వ్యాపారంలో నష్టం పోగా.. సులువుగా డబ్బులు సంపాదించేందుకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వలపు వల వేసేందుకు దంపతులు పథకం రచించారు. దంపతుల్లోని మహిళకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1200 మందికిపైగా ఫాలోవర్స్ ఉండగా.. అర్ధనగ్న ఫొటోలు పోస్టు చేసేది.
వాటిని చూసి ఆకర్షితులై తమ వద్దకు వచ్చిన వారిపై దంపతులిద్దరూ తమ పథకాన్ని అమలు చేసేవారు. డబ్బు తీసుకొని ఆ మహిళ వారితో ఏకాంతంగా గడుపుతుండగా భర్త గుట్టుగా వీడియోలు తీసేవాడు. ఆపై, ఆ వీడియోలను చూపి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతుండేవారు. అడిగినంత డబ్బు ఇవ్వకుంటే వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పెడతామంటూ వారు చేసిన బెదిరింపులకు భయపడి చాలా మంది వారికి డబ్బులు సమర్పించుకున్నారు. ఇలా వసూలు చేసిన డబ్బుతో ఆ దంపతులు రూ. 65 లక్షలతో ఒక ప్లాట్, ఖరీదైన ఫర్నిచర్, రూ.10 లక్షల విలువైన కారు కూడా కొనుగోలు చేశారు. తన ఫాలోయర్స్‌లో 100 మందితో ఆమెకు సంబంధం ఉన్నట్టు తెలిసింది. అయితే, ఏడాది క్రితం ఈ దంపతులకు పరిచయమైన కరీంనగర్‌కు చెందిన ఓ వ్యక్తి.. దంపతులతో బాగా చనువుగా ఉండేవాడు. ఆ దంపతులు అతడి నుంచి వివిధ రూపాల్లో రూ.14 లక్షల దాకా తీసుకున్నారు. చివరికి డబ్బు లేక ఆ వ్యక్తి కొద్ది రోజులుగా దంపతులకు దూరంగా ఉంటున్నాడు. దీంతో అతడికి ఫోన్ చేసిన దంపతులు.. తమకు రూ.5 లక్షలు ఇవ్వకుంటే.. నగ్న వీడియోలను బహిర్గతం చేస్తామని, చంపేస్తామని బెదిరించారు. దీంతో ఆ వ్యక్తి కరీంనగర్ శ్రీపురం కాలనీ వద్ద సదరు దంపతులకు మంగళవారం రూ.లక్ష ఇచ్చి మిగిలిన సొమ్మును రెండ్రోజుల్లో ఇస్తానని బతిమాలుకున్నాడు. చెప్పినట్టు డబ్బు ఇవ్వకుంటే వీడియోలు బయటపెట్టేస్తామని ఆ దంపతులు బెదిరించారు. దీంతో ఆ వ్యక్తి జరిగిన విషయాన్ని బంధువులు, మిత్రులకు చెప్పి వారి సూచన మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు, బాధితుడు సమర్పించిన ఆధారాల ప్రకారం కేసు నమోదు చేసిన కరీంనగర్ రూరల్ పోలీసులు నిందితులైన దంపతులను బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. నిందితుల నుంచి కారు, నగ్న వీడియోలు తీసిన మొబైల్ ఫోన్లు, నగదును, బాధితుడికి చెందిన చెక్కును స్వాధీనం చేసుకున్నారు.