Share News

దేశాన్ని ముక్కలు చేయడమే కాంగ్రెస్‌ లక్ష్యం

ABN , Publish Date - Apr 20 , 2026 | 05:36 AM

దేశాన్ని ముక్కలు చేయడం, ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య విద్వేషాలు రగల్చడం కాంగ్రెస్‌ లక్ష్యమని, అందులో భాగంగానే మహిళా రిజర్వేషన్‌, డీలిమిటేషన్‌ బిల్లులను అడ్డుకుందని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే ఆరోపించారు.

దేశాన్ని ముక్కలు చేయడమే కాంగ్రెస్‌ లక్ష్యం

  • సీఎం రేవంత్‌ ప్రజలను మోసం చేశారు

  • కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే విమర్శ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 19(ఆంధ్రజ్యోతి): దేశాన్ని ముక్కలు చేయడం, ఉత్తర, దక్షిణ ప్రాంతాల మధ్య విద్వేషాలు రగల్చడం కాంగ్రెస్‌ లక్ష్యమని, అందులో భాగంగానే మహిళా రిజర్వేషన్‌, డీలిమిటేషన్‌ బిల్లులను అడ్డుకుందని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే ఆరోపించారు. కాంగ్రెస్‌ జాతి వ్యతిరేక చర్యకు పాల్పడిందని, ప్రతీ రాష్ట్రంలో 50శాతం స్థానాలు పెంచుతామని కేంద్రం ప్రకటించినా ఈ బిల్లులను ఎందుకు అడ్డుకున్నారో సమాధానం చెప్పాలని కాంగ్రెస్‌ను డిమాండ్‌ చేశారు. ఆమె ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌ రాంచందర్‌రావు, ఎంపీ డీకే అరుణతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి పిక్‌పాకెట్‌ అని ఆమె తీవ్ర విమర్శ చేశారు. ‘మహిళలకు రూ.2,500సాయం, విద్యార్థినులకు స్కూటీలు, పెళ్లి చేసుకున్న ఆడపిల్లలకు తులం బంగారం, వృద్ధాప్య పింఛన్ల పెంపు, నిరుద్యోగ భృతి వంటి హామీల అమలులో సీఎం రేవంత్‌ ప్రజలను మోసం చేయడం సీరియస్‌ అంశం. హామీలివ్వడం.. అధికారంలోకి రాగానే మోసం చేయడం కాంగ్రెస్‌ నైజం. రేవంత్‌ తెలంగాణ పిక్‌పాకెట్‌.. ఇలాంటి నేతపై ఏం కేసు పెట్టాలి?’ అని ప్రశ్నించారు. హామీల అమలులో విఫలమైన రేవంత్‌.. అధినాయకత్వాన్ని సంతోషపెట్టేందుకే ప్రధాని మోదీపై విమర్శలు చేస్తున్నారన్నారు. మోదీని మారీచుడితో పోలుస్తూ రేవంత్‌ చేసిన వ్యాఖ్య చూస్తే.. ఆయనకు సంస్కారం లేదనిపిస్తోందన్నారు. కర్ణాటక తరహాలో తెలంగాణలో కూడా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అమలు చేస్తున్నా 80 శాతం బస్సు సర్వీసులను రద్దు చేశారని ఆరోపించారు. ‘తెలంగాణ ప్రజల మనోభావాలు కించపరచడం ఎంపీ తేజస్వీ సూర్య ఉద్దేశం కానేకాదు. ఒకవేళ ఆయన వ్యాఖ్యలతో మనసు నొచ్చుకుని ఉంటే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెబుతున్నాన’ని ఆమె పేర్కొన్నారు. కాగా, ‘మహిళా రిజర్వేషన్‌ను అమలు చేయాలని డిమాండ్‌ చేసిన కాంగ్రెస్‌... ఇప్పుడు బిల్లును వ్యతిరేకించడం విడ్డూరంగా ఉంద’ని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి విమర్శించారు. గతంలో మూడుసార్లు చేసిన డీలిమిటేషన్‌ సందర్భంగా నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం దక్షిణాదికి అన్యాయం చేసిందని ఆరోపించారు.

Updated Date - Apr 20 , 2026 | 05:37 AM