అమ్మల సన్నిధిలోనే శివసత్తి తుదిశ్వాస
ABN , Publish Date - Jan 31 , 2026 | 04:36 AM
అమ్మవారి ఆరాధనకు తన జీవితాన్ని అంకితం చేసిన ఓ భక్తురాలు (శివసత్తి) మేడారం సమ్మక్క సారక్క జాతరలోనే తుది శ్వాస విడిచారు.
మారేడుపల్లి, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): అమ్మవారి ఆరాధనకు తన జీవితాన్ని అంకితం చేసిన ఓ భక్తురాలు (శివసత్తి) మేడారం సమ్మక్క సారక్క జాతరలోనే తుది శ్వాస విడిచారు. సికింద్రాబాద్‌లోని ఓల్డ్ మారేడుపల్లికు చెందిన ఎల్లమ్మ అమ్మవారి భక్తురాలు శోభారాణి(70) మేడారంలో గుండెపోటుతో మరణించారు. శివసత్తి శోభారాణికి అమ్మవారి భక్తురాలిగా స్థానికంగా విశేషం గుర్తింపు ఉంది. అమ్మవారు ఆమెను ఆవహిస్తుండడంతో స్థానికులు చాలా మంది నిత్యం ఆమె ఆశీస్సులు తీసుకుంటుంటారు. అయితే, కొడుకు, మనుమడితో కలిసి మంగళవారం రాత్రి మేడారం జాతరకు వెళ్లిన శోభారాణి గురువారం రాత్రి సమ్మక్క,సారలమ్మలకు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రాత్రి 12గంటల సమయంలో సికింద్రాబాద్‌లో ఉంటున్న తన కటుంబ సభ్యులతో వీడియో కాల్ మాట్లాడారు. ఆ తర్వాత కాసేపటికే గుండెపోటుకు గురై గద్దె సమీపంలోనే తుది శ్వాస విడిచారని కుటుంబసభ్యులు తెలిపారు.