Share News

ఎస్‌హెచ్‌జీలకు ఆగిన ఆరోగ్య పరీక్షలు

ABN , Publish Date - May 07 , 2026 | 05:03 AM

రాష్ట్రంలోని మహిళ స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) సభ్యులకు హెల్త్‌ ప్రొఫైల్‌లో భాగంగా చేసే ఆరోగ్య పరీక్షలు అర్ధంతరంగా నిలిచిపోయాయి.

ఎస్‌హెచ్‌జీలకు ఆగిన ఆరోగ్య పరీక్షలు

  • నిలిపివేయాలని వైద్యశాఖకు పంచాయతీరాజ్‌ శాఖ లేఖ

  • మళ్లీ ఎప్పుడనేది స్పష్టం చేయని పంచాయతీరాజ్‌ శాఖ

  • 46 లక్షల మంది ఎస్‌హెచ్‌జీలకు టెస్టులు చేస్తామన్న సర్కారు

  • పరీక్షలకు ఆసక్తిచూపని ఎస్‌హెచ్‌జీలు.. ఉపాధి హామీ పనులు కారణం

హైదరాబాద్‌, మే 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మహిళ స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) సభ్యులకు హెల్త్‌ ప్రొఫైల్‌లో భాగంగా చేసే ఆరోగ్య పరీక్షలు అర్ధంతరంగా నిలిచిపోయాయి. ఎస్‌హెచ్‌జీ సభ్యులకు ఆరోగ్య పరీక్షలను ప్రస్తుతానికి ఆపివేయాలని వైద్య శాఖను పంచాయతీ రాజ్‌ శాఖ కోరింది. ఈ మేరకు తాజాగా ఓ లేఖ రాసింది. మళ్లీ ఎప్పటి నుంచి తిరిగి ప్రారంభించాలన్న దానిపై కూడా స్పష్టతనివ్వలేదు. పంచాయతీ రాజ్‌ ఆదేశాలతో వైద్య ఆరోగ్యశాఖ మహిళా సంఘ సభ్యులకు ఆరోగ్య పరీక్షలను నిలిపివేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 46 లక్షల మంది ఎస్‌హెచ్‌జీ మహిళలకు 30 రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ మహిళాదినోత్సవమైన మార్చి 8 నుంచి మూడు దశల్లో ఆరోగ్య పరీక్షలు చేయాలని తొలుత నిర్ణయించారు. తొలిదశలో ప్రతి జిల్లా నుంచి 5 మండలాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, రెండో దశలో మరో పది మండలాల్లో, చివరి దశలో మిగిలిన అన్ని మండలాల్లో స్ర్కీనింగ్‌ చేపట్టాలనుకున్నారు. మొత్తం స్ర్కీనింగ్‌ 6 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. హెల్త్‌ ప్రొఫైల్‌లో భాగంగా డిజిటల్‌ హెల్త్‌ కార్డు జారీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్డులు జారీ చేసేముందు వారికి 30 రకాల ఆరోగ్య పరీక్షలు తెలంగాణ డయాగ్నస్టిక్‌ కేంద్రాల ద్వారా నిర్వహిస్తామని సర్కారు వెల్లడించింది. 46 లక్షల మంది మహిళలకు 30 రకాల టెస్టులు చేయాలంటే రూ.30 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. పైలెట్‌ ప్రాజెక్టులో భాగంగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో వెయ్యి మందిలోపు సభ్యులకు ఆరోగ్యపరీక్షలు నిర్వహించినట్లు పంచాయతీరాజ్‌ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ ఆరోగ్య పరీక్షలు చేయించుకునేందుకు ఎస్‌హెచ్‌జీ సభ్యులు ఆసక్తి చూపడం లేదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. పైగా ప్రస్తుతం పల్లెల్లో ఉపాధి హామీ పనులు కొనసాగుతున్నాయి.ఎస్‌హెచ్‌జీ సభ్యులు వైద్య పరీక్షలకు రాకపోవడానికి ఇదే ప్రధాన కారణమని క్షేత్రస్థాయి సిబ్బంది చెబుతున్నారు. వారిని పల్లెల నుంచి సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ)కు తరలించే బాధ్యత పంచాయతీ రాజ్‌ శాఖదే. పీహెచ్‌సీకి తీసుకొచ్చాక వారికి ఆరోగ్య పరీక్షలు దగ్గరుండి చేయించే బాధ్యత క్షేత్రస్థాయి వైద్య సిబ్బందే చూసుకోవాలని ఆ మార్గదర్శకాల్లో సర్కారు వెల్లడించింది. ఎస్‌హెచ్‌జీ మహిళలను సమీప పీహెచ్‌సీ కేంద్రాలకు తరలించడంలో పంచాయతీ రాజ్‌ శాఖ సిబ్బంది చేతులెత్తిసినట్లు సమాచారం. ముఖ్యంగా క్షేత్రస్థాయి ఆరోగ్య సిబ్బందికి కూడా సహకరించడం లేదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. దాంతో ఆరోగ్య పరీక్షలను అర్ధంతరంగా ఆపేసినట్లు సమాచారం. మార్చి నుంచి జూన్‌ మొదటివారంలోపే ఈ ఆరోగ్య పరీక్షలు చేయించేందుకు సరైన సమయమని నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలం మొదలైతే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు ఊపందుకుంటాయి. పిల్లలకు బడులూ మొదలవుతాయి. ఈ నేపథ్యంలో మహిళలంతా బాగా బిజీగా ఉంటారు. ఒకవైపు కుటుంబం, మరోవైపు వ్యవసాయ పనులతో ఊరు దాటడమే గగనమవుతుంది.

Updated Date - May 07 , 2026 | 05:03 AM