షేర్ బజార్ కేసులో మరో మలుపు!
ABN , Publish Date - Jul 08 , 2026 | 06:50 AM
దేశవ్యాప్తంగా వందలాది మంది డిపాజిట్‌దారులను మోసగించిన షేర్ బజార్.. కిసాన్ పరివార్ కేసు దర్యాపుపై తీవ్ర ప్రభావం చూపే సంఘటన వెలుగులోకి వచ్చింది.
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో
కంపెనీ డైరెక్టర్ అట్లూరి ప్రసన్న మృతి
హైదరాబాద్, ఇబ్రహీంపట్నం (విజయవాడ), జూలై 7 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా వందలాది మంది డిపాజిట్‌దారులను మోసగించిన షేర్ బజార్.. కిసాన్ పరివార్ కేసు దర్యాపుపై తీవ్ర ప్రభావం చూపే సంఘటన వెలుగులోకి వచ్చింది. షేర్ బజార్ కంపెనీ డైరెక్టర్ అట్లూరి ప్రసన్న(30) ఈనెల 5వ తేదిన అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామానికి చెందిన అట్లూరి వసంతరావు, మల్లేశ్వరి దంపతుల కుమార్తె ప్రసన్న. చార్టర్డ్ అకౌంటెన్సీ పూర్తి చేసిన ఆమె న్యూయార్క్‌లో మాస్టర్ ఫైనాన్స్ చేసి కొద్ది రోజుల క్రితమే ఉద్యోగం సంపాదించారు. ఉద్యోగం వచ్చిందన్న ఆనందంలో ఆమె తన స్నేహితులతో కలిసి ఒక దేవాలయానికి బయల్దేరారు. దారిలో సిగ్నల్ వద్ద ఆగిన వారి కారును వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రసన్న, మరో అమ్మాయి మరణించినట్టు న్యూయార్క్ పోలీసులు ప్రకటించారు. కాగా, షేర్‌బజార్ స్ధాపన, రిజిస్ట్రేషన్ వ్యవహారాలను ప్రసన్న చక్కదిద్దారని, పెట్టుబడిదారులతో కుదుర్చుకున్న అనేక ఒప్పందాల్లో ప్రసన్న సంతకాలు ఉన్నాయని దర్యాప్తు అధికారులు పేర్కొంటున్నారు. ఆల్గో ట్రేడింగ్‌లో పెట్టుబడిదారులకు 18-48శాతం వరకు రాబడులను, కిసాన్ పరివార్‌లో 24శాతం ట్యాక్స్ ఫ్రీ రాబడులు ఇస్తామని వందల మంది నుంచి షేర్ బజార్ సంస్ధ పెట్టుబడులు స్వీకరించింది. ఇలా తెలంగాణలో రూ.4.8 కోట్లు.. దేశవ్యాప్తంగా రూ.1400 కోట్లు సేకరించి.. చేతులెత్తేసింది. ఈ మేరకు నానావత్ భూపాల్ నాయక్, బాబు నాయక్, రజనీ నానావత్, అనూష నానావత్, రాంబాబు దంటు, శంకర్‌రావు, అట్లూరి ప్రసన్నపై ఈవోడబ్ల్యూ పోలీసులు కేసు నమోదు చేశారు. గుజరాత్ పోలీసుల కస్టడీలో ఉన్న షేర్ బజార్ నిర్వాహకుడు భూపాల్‌నాయక్‌ను హైదరాబాద్ తీసుకొచ్చి విచారించారు. ఈ క్రమంలోనే అమెరికాలో ప్రసన్న మరణించడంతో దర్యాప్తు తీరు మారే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.