రూ.1000 కోట్ల భూకుంభకోణం..శంషాబాద్ తహశీల్దార్‌పై చర్యలు
ABN , Publish Date - May 23 , 2026 | 05:40 AM
శంషాబాద్ మండలంలో ఖరీదైన భూములు చేతులు మారుతున్న వైనంపై ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనం సంచలనంగా మారింది. పెద్దషాపూర్ సర్వే నంబరు 172 నుంచి 180 పరిధిలోని 94.73 ఎకరాల...
కలెక్టరేట్‌లో ఎన్నికల సెక్షన్ సూపరింటెండెంట్‌గా బదిలీ
తహశీల్దార్ ఇచ్చిన ఉత్తర్వులు నిలిపివేత
సివిల్ సూట్-7 భూమి పేరుతోఅక్రమాల పర్వం
హైదరాబాద్, మే 22 (ఆంధ్ర జ్యోతి): శంషాబాద్ మండలంలో ఖరీదైన భూములు చేతులు మారుతున్న వైనంపై ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనం సంచలనంగా మారింది. పెద్దషాపూర్ సర్వే నంబరు 172 నుంచి 180 పరిధిలోని 94.73 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసిన శంషాబాద్ తహసీల్దార్ కె.రవీందర్ దత్తును రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌రేట్‌లో ఎన్నికల సూపరింటెండెంట్(హెచ్ సెక్షన్)గా బదిలీ చేశారు. ఆ భూములను కట్టబెడుతూ ఆయన ఇచ్చిన ఉత్తర్వులపై కలెక్టర్ నారాయణ రెడ్డి స్టే విధించారు. ఆయన స్థానంలో కొత్త తహసీల్దార్‌గా అమరలింగంని నియమించారు. తహశీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు జరిపి, రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే.. తహశీల్దార్ ఇచ్చిన ఆర్డర్‌లో కోర్టు ఉత్తర్వులను ప్రస్తావించిన నేపథ్యంలో ఆ ఉత్తర్వులకుసంబంధించిన సర్టిఫైడ్ కాపీలను అందించాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా అధికారులు కోర్టును ఆశ్రయించారు. నగరంలో భూముల విలువలు భారీగా పెరగడంతో సివిల్ సూట్-7 (సీఎస్ 7), సివిల్ సూట్-14 (సీఎస్ 14) భూములు కొంత మంది రెవెన్యూ అధికారులకు వరంగా మారాయి (నిజాంల ఆస్తుల పంపకాలకు సంబంధించి హైకోర్టులో దాఖలైన సివిల్ సూట్ నంబర్లు. ఈ కేసుల పరిధిలోకి వచ్చే వివాదాస్పద భూములను సీఎస్ 7, సీఎస్ 14 భూములంటారు). ఈ సీఎస్ 7, సీఎస్ 14 పరిధిలో ఏఏ ప్రాంతాలు ఉన్నాయి.. అనే వివరాలతో సంబంధం లేకుండా వాటిని అడ్డుపెట్టుకుని కొందరు అధికారులు పలు అక్రమాలకు పాల్పడుతున్నారు. సీఎస్-7, సీఎస్-14 పరిధిలో ఉన్న భూముల వివాదాల మీద ఫైనల్ డిక్రీ వస్తే.. అందులో పేర్కొన్న వివరాల ఆధారంగా తదుపరి చర్యల కోసం ప్రభుత్వ అనుమతి కోరుతూ అధికారులు ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుంది. అయితే ఇవేమీ పట్టించుకోని కొంత మంది అధికారులు.. సీఎస్-7 ముసుగులో ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నారు. శంషాబాద్ పరిధిలో ఇదే జరిగిందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఈప్రాంతం సీఎస్-7 పరిధిలో లేకున్నా.. ఉన్నట్లుగా చూపుతూ.. వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎయిర్‌పోర్టును ఆనుకునే ఉన్న ప్రభుత్వ భూముల విషయంలోనూ సీఎస్ 7 పేరుతో అక్రమాలకు పాల్పడి విలువైన భూములను ప్రైవేటు వ్యక్తులకుకట్టబెట్టినట్లు విమర్శలు ఉన్నాయి. తాజా సంఘటనతో సీఎస్7 పేరుతో నోటీసులు ఇచ్చి అక్రమాలకు పాల్పడినట్లు కొన్ని ఫిర్యాదులు వస్తున్నాయని కలెక్టర్ నారాయణ రెడ్డి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.