శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అత్యాధునిక ‘కార్గో టెర్మినల్-2’ ప్రారంభం
ABN , Publish Date - May 19 , 2026 | 05:34 AM
హైదరాబాద్ శంషాబాద్‌లోని జీఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం మరో మైలు రాయిని అందుకుంది. దేశీయ, అంతర్జాతీయ సరుకు రవాణా...
శంషాబాద్ రూరల్, మే 18 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ శంషాబాద్‌లోని జీఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం మరో మైలు రాయిని అందుకుంది. దేశీయ, అంతర్జాతీయ సరుకు రవాణా (కార్గో) అవసరాలను తీర్చేందుకు అత్యాధునిక వసతులతో నిర్మించిన ‘కార్గో టెర్మినల్-2’ సోమవారం ప్రారంభమైంది. విమానయాన సంస్థలు, ఫ్రైట్ ఫార్వార్డర్స్, లాజిస్టిక్స్ ఆపరేటర్లకు ప్రపంచ స్థాయి సేవలు అందించడమే లక్ష్యంగా దీనిని రూపకల్పన చేశారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టు లిమిటెడ్ సీఈవో కదిర్ కదిరవన్ మాట్లాడుతూ..‘‘ఈ కొత్త టెర్మినల్ ప్రారంభం హైదరాబాద్‌ను ఆసియాలోనే ప్రముఖ ఎయిర్ కార్గో, లాజిస్టిక్స్ గేట్‌వేగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఔషధాల నుంచి అత్యవసర సరుకుల వరకు దేనినై అత్యంత వేగంగా, కచ్చితత్వంతో రవాణా చేసేలా ఈ టెర్మినల్‌ను అభివృద్ధి చేశాం. ’’ అని పేర్కొన్నారు. జీఎంఆర్ ఏరో కార్గో అండ్ లాజిస్టిక్స్ సీఈవో సంజీవ్ ఎడ్వర్డ్ మాట్లాడుతూ.. ఈ టెర్మినల్ భారత ఎయిర్ లాజిస్టిక్స్ రంగాన్ని మరింత బలోపేతం చేస్తుందని, పరిశ్రమల వ్యాపార వృద్ధికి జీఎంఆర్ కట్టుబడి ఉందనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు.