మెడలో వజ్రాభరణాలు.. కోట్లలో ఆస్తులు!
ABN , Publish Date - Jun 26 , 2026 | 04:48 AM
ఇటీవల రూ.2లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన శామీర్‌పేట తహసీల్దార్ సుచరిత పై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన....
శామీర్‌పేట తహసీల్దార్‌పై ఆదాయానికి మించి ఆస్తుల కేసు
ఇటీవల ఏసీబీకి పట్టుబడ్డ సుచరిత.. 4 చోట్ల సోదాలు
5 కోట్లకు పైగా అక్రమాస్తులు
మార్కెట్ ధర 50 కోట్లకు పైనే..
సుచరిత ఇంట్లో 12 లక్షల నగదు
రూ.1.20 కోట్ల ఆభరణాలు
బ్యాంకు ఖాతాలో రూ.38 లక్షలు
హైదరాబాద్, మేడ్చల్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): ఇటీవల రూ.2లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన శామీర్‌పేట తహసీల్దార్ సుచరిత పై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసును నమోదు చేసి గురువారం వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి భారీగా ఆస్తులను గుర్తించారు. సుచరిత మెడలో ధరించే వజ్రాభరణాలు కూడా అక్రమ సంపాదనలో భాగమేనని ఏసీబీ అధికారుల విచారణలో వెల్లడైంది. 11.94 క్యారెట్ల వజ్రాభరణం విలువ దాదాపు రూ.15లక్షలు వరకు ఉండొచ్చని తెలుస్తోంది. గురువారం సుచరిత ఆమె బంధువులకు చెందిన నాలుగు ఇళ్లల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సిద్దిపేట జిల్లా దామరకుంటలో 2.17ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్‌లోని వివిధ ముఖ్య ప్రాంతాల్లో మూడు ఫ్లాట్లు, కీసర, ఖానామెట్‌లో రెండు ఇళ్ల స్థలాలు సుచరితకు చెందినవిగా ఏసీబీ అధికారులు గుర్తించారు. సుచరిత ఇంట్లో జరిపిన సోదాల్లో రూ. 12లక్షల నగదు, బ్యాంకు ఖాతాల్లో రూ.38 లక్షల బ్యాలెన్స్, వోక్స్ వ్యాగన్, హోండాయ్ క్రెటా కార్లతో పాటు రూ.1.20కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. సుచరిత ఆస్తుల విలువ రూ.5,05,52,465గా ఉందని, ఇది కేవలం రిజిస్ర్టేషన్ ధర ప్రకారమే వాస్తవ మార్కెట్ విలువ రూ.50కోట్లకు పైగానే ఉండొచ్చని తెలుస్తోంది. గత నెల 26న ఒక ఫైల్ క్లియరెన్స్‌కు సంబంధించి ఎకరానికి రూ.1లక్ష చొప్పున 30 ఎకరాలకు రూ.30లక్షలు లంచం డిమాండ్ చేసి అడ్వాన్స్‌గా రూ.2లక్షలు తీసుకుంటుండగా సుచరితను ఏసీబీ అధికారులు పట్టుకుని జైలుకు తరలించారు. ఆపై సుచరిత అక్రమాదాయానికి సంబంధించి ఏసీబీ అధికారులు ప్రాధమిక విచారణ నిర్వహించి ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి గురువారం సోదాలు నిర్వహించారు. సుచరితకు సంబంధించిన ఆస్తుల విచారణ కొనసాగుతుందని ఏసీబీ డీజీ చారుసిన్హా తెలిపారు. కాగా, సుచరిత ఏసీబీకి పట్టుబడినప్పటి నుంచి జిల్లాలోని రెవెన్యూ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పలు మండలాల తహసీల్దార్ కార్యాలయాల్లో అధికారులు బిక్కు బిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు. పలువురు తహసీల్దార్లు సెలవుల్లో వెళ్లిపోతుండగా కొందరు కార్యాలయాలకు రాకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఓ తహసీల్దార్ అయితే ఏకంగా తన కార్యాలయంలోనే అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరడం తీవ్ర చర్చనీయాంశమైంది.
