Share News

kumaram bheem asifabad- శివరాత్రికి శైవక్షేత్రాలు ముస్తాబు

ABN , Publish Date - Feb 13 , 2026 | 11:40 PM

జిల్లాలో శనివారం నుంచి నిర్వహించే మహా శివరాత్రి ఉత్సవాలకు శైవక్షేత్రాలను ముస్తాబు చేశారు. వాంకిడి మండల కేంద్రంలోని చిక్లీనదీ తీరాన కాకతీయుల కాలంలో నిర్మించిన శివకేశవాలయం చరిత్రకు చిహ్నంగా నిలుస్తోంది. ఆలయాన్ని కాకతీయులు తమ విజయానికి సూచికంగా ఇక్కడ నిర్మించారు.

kumaram bheem asifabad-    శివరాత్రికి శైవక్షేత్రాలు ముస్తాబు
వాంకిడి శివాలయం

వాంకిడి, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో శనివారం నుంచి నిర్వహించే మహా శివరాత్రి ఉత్సవాలకు శైవక్షేత్రాలను ముస్తాబు చేశారు. వాంకిడి మండల కేంద్రంలోని చిక్లీనదీ తీరాన కాకతీయుల కాలంలో నిర్మించిన శివకేశవాలయం చరిత్రకు చిహ్నంగా నిలుస్తోంది. ఆలయాన్ని కాకతీయులు తమ విజయానికి సూచికంగా ఇక్కడ నిర్మించారు. ఆలయంలో శివకేశవులతో పాటు, రేణుకామాత విగ్రహాలు ఉన్నాయి. శివకేశవులు ఒకే చోట కొలువుదీరడం విశేషం. ఆలయ నిర్మాణం పరిశీలిస్తే ఆనాటి శిల్పకళ వైభవం ఉట్టిపడుతుంది. ఆలయం నిరాధరణకు గురవడతో శిథిలావస్థకు చేరుకునే సమయంలో గ్రామస్థులు ముందుకు వచ్చి మరమత్తులు చేపట్టి ఆలయాన్ని కాలగర్భంలో కలసిపోకుండా కాపాడుకున్నారు. ఏటా మహాశివరాత్రి రోజున ఆలయ ప్రాంగణంలోని చికిలీ నదీ తీరాన జాతర, రథోత్సవం నిర్వహిస్తారు.

- నేటి నుంచి శివరాత్రి ఉత్సవాలు..

మండల కేంద్రంలోని చికిలి నదీ తీరాన గల శివాలయంలో మహాశివరాత్రి సందర్భం గా శనివారం నుంచి ఆలయంలో ఉత్సవాలు నిర్వహిస్తారు. శనివారం రోజున గంగాజల భిషేకం, 15న పల్లకిసేవ, రథోత్సవం, 16న శివ పార్వతుల కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవాలకు మండలం నుంచి కాకుండా చుట్టుపక్కల మండలాలైన కెరమెరి, ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌తో పాటు సరిహద్దులో గల మహారాష్ట్రలోని వివిధా గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి శివకేశవులను దర్శించుకుని పునీతులవుతారు. మహాశివరాత్రి పర్వదినాన సాయంత్రం ఐదు గంటలకు ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఊరేగిస్తారు. భజన కార్యక్రమాలతో ఊరేగింపుగా తీసుకొచ్చి చిక్లీ నది తీరంలో రథోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మహాశివరాత్రి సందర్బంగా ఆలయ సమీపంలోని చిక్లీ నదీ తీరాన రెండు రోజుల పాటు జాతర నిర్వహించనున్నారు.

చింతలమానేపల్లి, (ఆంధ్రజ్యోతి): చింతలమానేపల్లి మండలం కర్జెల్లి గ్రామ సమీపంలోని రెండు కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో ఉన్న ముసలమ్మ గుట్టపై ఉన్న శివాలయం భక్తులకు కొంగు బంగారంగా మారుతోంది. ఏటా శివరాత్రి సందర్భంగా మూడు రోజుల పాటు జాతర ఉత్సవాలు ఘనంగా జరుపుతారు. ఇక్కడికి భక్తులు తెలంగాణలోని కౌటాల, బెజ్జూరు, చింతలమానేపల్లి తదితర మండలాల నుండే కాకుండా మహారాష్ట్ర నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ జాతర సందర్భంగా భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో ఆలయ కమిటీ, గ్రామస్థుల సహకారంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాల కల్పనతో పాటు అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణంలో భక్తులతో భజనా, మహాభాగవతం, అలాగే నృత్య కార్యక్రమాలు చేపట్టేందుకు ఆలయ కమిటీ ఆద్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అటవీ ప్రాంతంలో ఉన్న ఈ ముసలమ్మ గుట్టపై ఉన్న శివాలయం సంసృతీ సాంప్రదాయాలకు నిలయంగా ఉంది. ప్రతీ ఏటా శివరాత్రికి జరిగే జాతర కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి సంప్రదాయంగా మొక్కులు చెల్లించుకుంటారు. జాతర సందర్భంగా పలు గ్రామాల ప్రజలు ఇక్కడే కలుసుకొని సామూహిక భోజనాలు చేస్తుంటారు.

కౌటాల, 3(ఆంధ్రజ్యోతి): కౌటాల మండలంలోని తాటిపల్లి కుర్తాలో ఉన్న సిద్ది హనుమాన్‌ ఆలయాన్ని శివరాత్రి జాతరకు ముస్తాబు చేస్తున్నారు. ఈ ఆలయం వార్ధా నది మధ్యలో డెల్టా ప్రాంతంలో ఉంది. తెలంగాణను సరిహద్దుగా వార్ధా నది మధ్యలో తాటిపల్లి గ్రామ శివారులో ఈ లయం ఉంది. ఏటా శివరాత్రి సందర్భంగా నిర్వహించే జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కులు చెల్లించుకుంటారు. మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. 13వ శతాబ్దంలో తాటిపల్లి శివారులోని వార్ధా నది మధ్యలోని ఎత్తైన ప్రదేశంలో ఈ ఆలయం వెలిసింది. అప్పటి నుంచి ప్రతి శివరాత్రికి నది ఒడ్డున జాతర నిర్వహిస్తున్నారు.

సిర్పూర్‌(యు), (ఆంధ్రజ్యోతి): శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలోని శైవక్షేత్రాలను ముస్తాబు చెస్తున్నారు. మండల కేంద్రంలోని గోండు రాజుల కాలం నాటీ అతిపూరతన ప్రసిద్ద శైవక్షేత్రంమైన మహాదేవ్‌ ఆలయం, మహగాంలోని కైలాస్‌ టేక్డీ ఆలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా ఆలయాలు శివనామస్మరణతో మారుమోగనున్నాయి. మండల కేంద్రంలోని మహాదేవ్‌ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆలయ కమిటీ విస్తృత ఏర్పాట్లు చేసింది. మహాశివరాత్రి రోజున తెల్లవారుజాము నుంచి అభిషేకాలు, రుద్రపారాయణాలు, బిల్వార్చనలు నిర్వహించనున్నారు. రాత్రి వేళ జాగరణ కార్యక్రమాలు, భజనలు, శివతాండవ స్తోత్ర పారాయణం నిర్వహంచనున్నారు.

Updated Date - Feb 13 , 2026 | 11:40 PM