పోక్సో కేసు పెట్టారని.. ఉన్మాది నరమేధం
ABN , Publish Date - Jul 12 , 2026 | 05:39 AM
రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో అత్యంత దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికను వేధించినందుకు పోక్సో కేసు పెట్టారని కక్షగట్టిన ఓ ఉన్మాది కిరాతకానికి పాల్పడ్డాడు. అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడి ఆరుగురిని దారుణంగా హత్య చేశాడు
ఆరుగురిని గొంతు కోసి చంపిన కిరాతకుడు
మైనర్ బాలిక, ఆమె తల్లి, నానమ్మతోపాటు
తన భార్య, ఇద్దరు కుమారుల దారుణ హత్య
పెళ్లయి.. పిల్లలుండి.. మైనర్ బాలికపై కన్ను
వేధింపులపై కేసు పెట్టిన బాలిక కుటుంబం
అరెస్టు కాకుండానే బెయిల్ తెచ్చుకున్న నిందితుడు
శుక్రవారం అర్ధరాత్రి ఆరుగురిని హత్యచేసి పరారీ
తండ్రికి ఫోన్ చేసి హత్యల విషయం వెల్లడి
అర్ధరాత్రి వరుస హత్యలతో ఉలిక్కిపడ్డ షాబాద్
హత్యలకు ముందు బాధిత కుటుంబానికి బెదిరింపులు
పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఘటన.. స్థానికుల ఆందోళన
బాధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం: కలెక్టర్
ఎస్సై సస్పెన్షన్.. సీఐపై శాఖాపరమైన చర్యలు
నిందితుడి ఆచూకీ చెబితే రూ.2 లక్షల బహుమానం
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి/షాబాద్/షాద్‌నగర్)
రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో అత్యంత దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికను వేధించినందుకు పోక్సో కేసు పెట్టారని కక్షగట్టిన ఓ ఉన్మాది కిరాతకానికి పాల్పడ్డాడు. అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడి ఆరుగురిని దారుణంగా హత్య చేశాడు. మైనర్ బాలిక, ఆమె తల్లి, నానమ్మతోపాటు ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్యను, ముక్కుపచ్చలారని ఇద్దరు పసిపిల్లలను గొంతుకోసి చంపాడు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ నరమేధం రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేకెత్తించింది. ఈ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం కూడా ఉండడంతో ప్రజాగ్రహం పెల్లుబికింది. నిందితుడు పార్వతి రాజ్‌కుమార్ (35) చేతిలో బలైన వారిలో మైనర్ బాలిక(17), ఆమె తల్లి చిట్యాల లక్ష్మి(45), బాలిక నానమ్మ చిట్యాల రుక్కమ్మ(65)తోపాటు అతని భార్య సరిత(30), కుమారులు పరీక్షిత్(4), దైవీక్షిత్(2) ఉన్నారు. షాబాద్ మండలం దైవాలగూడకు చెందిన రాజ్‌కుమార్ 2018లో సరితను ప్రేమవివాహం చేసుకున్నాడు. వీరి పెళ్లికి ఇరువైపు కుటుంబాల పెద్దలు అంగీకరించకపోవడంతో షాబాద్ మండల కేంద్రంలో ఇంటిని కొనుగోలు చేసి అక్కడే నివాసం ఉంటున్నారు. అతనికి 8 ఎకరాల భూమి ఉండగా.. జల్సాలకు అలవాటుపడ్డ రాజ్‌కుమార్ కొంత భూమిని అమ్మేశాడు. ఈ క్రమంలో షాబాద్‌లో తన ఇంటి సమీపంలో ఉన్న ఓ బాలికపై కన్నేశాడు. ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. ఈ విషయం తెలిసిన బాలిక తల్లితండ్రులు రాజ్‌కుమార్‌ను హెచ్చరించారు. శంషాబాద్‌లో ఇంటర్మీడియట్ చదువుతున్న బాలికను క్లాసులు మాన్పించారు. కేవలం పరీక్షలు రాసేందుకు వారు వెంట ఉండి తీసుకువెళ్లారు. పరీక్ష రాసేందుకు వెళ్లిన సమయంలో శంషాబాద్‌లో కాలేజీ నుంచి వస్తున్న బాలిక వెంటపడి బలవంతంగా ఆమెను కారులో ఎక్కించుకునేందుకుయత్నించాడు. బాలిక తల్లి అతణ్ని అడ్డుకొని కూతురిని కాపాడుకుంది. అనంతరం షాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రాజ్‌కుమార్‌పై మే 16న పోక్సో కేసు నమోదు చేశారు. అయితే అన్నీ బెయిలబుల్ సెక్షన్లు కావడంతో.. అప్పటినుంచి తప్పించుకు తిరిగిన రాజ్‌కుమార్ ఇటీవలే ఎల్బీనగర్‌లోని స్ఫెషల్ సెషన్స్ జడ్జి పోక్సో కోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందాడు. అనంతరం.. తనపై కేసు పెట్టారన్న కసితో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో బాలిక ఇంట్లోకి చొరబడి ఆమె తల్లి లక్ష్మిని, నానమ్మ రుక్కమ్మను కత్తితో గొంతుకోసి కిరాతకంగా హతమార్చాడు. వికలాంగురాలైన బాలిక అక్క మేఘన(19) కూడా ఇంట్లోనే ఉండగా.. ఆమెను మాత్రం చంపకుండా వదిలేశాడు. అనంతరం బాలికను బలవంతంగా లాక్కెళ్లి తన కారులో ఎక్కించుకున్నాడు. షాబాద్‌కు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న తన స్వగ్రామమైన దైవాలగూడ సమీపంలోని చెరువు వద్దకు తీసుకువెళ్లి దారుణంగా హత్య చేశారు.
పిల్లలను, భార్యను కూడా..
బాలిక హత్య తరువాత అక్కడి నుంచి రాజ్‌కుమార్ తన ఇంటికి చేరుకుని.. నిద్రిస్తున్న తన భార్యను లేపాడు. తన కుమారులు పరిక్షిత్, దైవిక్షిత్‌లను కత్తితో పొడిచి చంపడానికి యత్నిస్తుండగా భార్య అడ్డుపడింది. దీంతో కత్తితో ఆమె కడుపులో పొడిచి చంపాడు. అనంతరం ఇద్దరు పిల్లలను హత్య చేశాడు. ఆ తర్వాత తన తల్లితండ్రులకు ఫోన్ చేసి.. ఆరుగురిని చంపిన విషయం చెప్పాడు. తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి షాబాద్ నుంచి పరారయ్యాడు. ఈ విషయాన్ని రాజ్‌కుమార్ తండ్రి పోలీసులకు చెప్పడంతో వారు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. శనివారం తెల్లవారుజామునే మృతదేహాలను తరలించారు. దీనిపై బాధిత బంధువులు ఆగ్ర హం వ్యక్తం చేశారు. తమకు సమాచారం ఇవ్వకుండానే హడావిడిగా మృతదేహాలను ఎలా తరలిస్తారని పోలీసులను ప్రశ్నించారు.
బాధిత కుటుంబానికి బెదిరింపులు..
పోక్సో కేసులో బెయిల్ రాకముందు, వచ్చిన తరువాత కూడా రాజ్‌కుమార్ బాలిక కుటుంబాన్ని బెదిరిస్తూనే ఉన్నాడు. ఇటీవల బాలిక తండ్రి మరణించగా, ‘‘అతడు గుండెపోటుతో చనిపోలేదు. మీ అయ్యను కూడా నేనే చంపాను. మీకూ అదే గతి పడుతుంది’’ అని రాజ్‌కుమార్ హెచ్చరించడంతో బాలిక తల్లి, మేనమామ ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే పోలీసులు అలసత్వం వహించారని, అతను ఎక్కడ ఉన్నాడో చెబితే తాము వచ్చి పట్టుకుంటామని తాపీగా చెప్పారని బాలిక బంధువులు, స్థానికులు తెలిపారు. ఆ సమయంలో పోలీసులు స్పందించి ఉంటే ఈ ఘోరం జరిగేది కాదన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ వారి బంధువులు, స్థానికులు, రాజకీయ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీస్‌స్టేషన్ ఎదుట 5 గంటలపాటు బైఠాయించారు. వారి ఆందోళనకు బీఆర్‌ఎస్, ఇతర సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. కాగా, బాధిత కుటుంబాల బంధువులను పరామర్శించడానికి వచ్చిన చేవేళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యపై ఆందోళనకారులు దాడికి యత్నించారు. పోలీసులు వారిని అడ్డగించి ఎమ్మెల్యేను పంపించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బాధితుల కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. కాగా, రాజ్‌కుమార్ నందిగామ వరకు కారులో వెళ్లి అక్కడ నుంచి పరారయ్యాడు. పోలీసులు కారును స్వాధీనం చేసుకుని, దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రత్యేక బృందాలు అతడి కోసం గాలిస్తున్నాయి.
ప్రభుత్వ వైఫల్యం వల్లే హత్యలు: సబితారెడ్డి
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే షాబాద్‌లో ఆరు హత్యలు జరిగాయని, ఇందుకు ప్రభుత్వమే భాద్యత వహించాలని మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితారెడ్డి అన్నారు. శనివారం బాధితులను పరామర్శించేందుకు వెళ్తుతుండగా ఆమెతోపాటు బీఆర్‌ఎస్ నేతలు సత్యవతి రాథోడ్, పద్మా దేవేందర్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌లను పోలీస్‌లు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సబితారెడ్డి చేవెళ్ల పోలీస్ స్టేషన్ ఆవరుణలో మాట్లాడుతూ.. పోక్సో కేసు నమోదైనా పోలీస్‌లు సరైన చర్య తీసుకోకపోవడంత వల్లనే ఈ దుర్ఘటన జరిగిందన్నారు. రాష్ట్రంలో ప్రభు త్వం నిర్వాకం వలన రోజు రోజుకు క్రైమ్ రేట్ పెరుగుతోందని, సీఎం రేవంత్‌రెడ్డి హోం శాఖను తన వద్ద పెట్టుకుని కనీసం రివ్యూ కూడా చేయలేకపోతున్నారని ఆరోపించారు. కాగా, పోక్సోకేసు నిందితులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఎందుకింత ప్రేమ అని ఆర్‌ఎస్. ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. బాధిత కుటుంబీకులను పరామర్శించేందుకు వెళుతున్న తమను అరెస్టు చేయ డం ఏంటని, బీఆర్‌ఎస్ నాయకులు అంటేనే రేవంత్‌రెడ్డి భయపడుతున్నారని అన్నారు. పోక్సో కేసు పెట్టి.. నిందితుణ్ని ఒక్కరోజైనా అరెస్టు చేయలేదని, ఘటన జరిగి 55 రోజులైనా విచారించలేదని మండిపడ్డారు. బండి భగీరథ్‌ను కూడా పోక్సో కేసులో జైలుకు వెళ్లకుండా సీఎం రేవంతర్‌రెడ్డి ప్రయత్నించారని అన్నారు. కేంద్ర హోంమంత్రి కొడుకు అయినందునే బండి భగీరథకు బెయిల్ వచ్చే విధంగా ముఖ్యమంత్రి వ్యవహరించారని ఆరోపించారు.
రూ.5లక్షల పరిహారం
షాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొడంతో జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధిత కుటుంబాలతో మాట్లాడి.. తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పోలీసుల పాత్రపై విచారణ జరుపుతామన్నారు. మైనర్ బాలిక అక్క, వికలాంగురాలైన మేఘనకు రూ.5 లక్షల పరిహారంతోపాటు సొంతింటిని నిర్మించి ఇస్తామని హామీ ఇవ్వడంతో స్థానికులు ఆందోళన విరమించారు. ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్ జోషి మాట్లాడుతూ నిందితుడు ఆచూకీ కొంత లభ్యమైందని, త్వరలోనే పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. రాజ్‌కుమార్‌కు బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వంటి వ్యసనాలు ఉన్నాయని, దీనివల్ల అతనికి రూ. కోటిన్నరకుపైగా అప్పులు అయినట్లు తేలిందన్నారు. అతడిపై గతంలో మరో భూవివాదం కేసు కూడా నమోదైందన్నారు. నిందితుణ్ని పట్టుకోవడానికి ఏడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు తెలిపారు. అతని ఆచూకీ తెలిపిన వారికి రూ.2 లక్షల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. సమాచారం తెలిసినవారు చేవెళ్ల పోలీస్ కంట్రోల్ రూమ్ ఫోన్ నంబరు 8712665324కి ఫోన్‌కాల్ లేదా వాట్సాప్ ద్వారా తెలియజేయవచ్చునన్నారు. మైనర్ బాలికను వేధించిన కేసు దర్యాప్తు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన షాద్‌నగర్ ఎస్‌ఐ రమే్‌షను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. సీఐ కాంతారెడ్డిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
ఒంటరైన వికలాంగురాలు
చేవెళ్ల/షాబాద్: పుట్టుకతోనే మూగ.. దివ్యాంగురాలు... ఏడాది క్రితం తండ్రి అనారోగ్యంతో మృతి చెందగా.. ఏడాది తిరగక ముందే ఆ ఇంట్లో మరో ముగ్గురు కుటుంబ సభ్యులు కళ్ల ఎదుటనే కత్తి కాటుకు బలయ్యారు. దీంతో ఒంటరిగా మిగిలింది చిట్యాల మేఘన. కుటుం బ సభ్యులందరూ చనిపోవడంతో మేఘన ఆలనా పాలన చూసేది ఎవరు అని స్థానికులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. కాగా, రాజ్‌కుమార్ చేతిలో హత్యకు గురైన ఆరుగురి మృతదేహాలకు వేర్వేరుగా పోస్టుమార్టం నిర్వహించారు. మూడు మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి, మరో మూడు మృతదేహాలను నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి పోలీస్ బందోబస్తు మధ్య శనివారం తెల్లవారుజామున తరలించారు. తొలుత బంధువులు పోస్టుమార్టం జరిగే ఆస్పత్రికి రాకుండా షాబాద్‌లో బైఠాయించడంతో ఈ పక్రియ ఆలస్యమైంది.