భయం గుప్పిట్లో షాబాద్
ABN , Publish Date - Jul 13 , 2026 | 05:32 AM
షాబాద్ మండలంలో దారుణమారణకాండ నుంచి స్థానికప్రజలు ఇంకా కోలుకోలేదు. ఆరుగురిని అత్యంత కిరాతకంగా గొంతు కోసి హత్యచేసిన రాక్షసుడు రాజ్‌కుమార్ ఆచూకి ఇంకా దొరకకపోవడంతో బాధిత కుటుంబాలతోపాటు..
ఆరుగురి హత్యలతో భయాందోళనలో ప్రజలు
నిందితుడి ఆచూకీపై వీడని సస్పెన్స్
బాధిత కుటుంబాలకు నేతల పరామర్శ
దివ్యాంగురాలైన బాలికకు ఆర్థిక సాయం
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి/చేవెళ్ల/షాబాద్)
షాబాద్ మండలంలో దారుణమారణకాండ నుంచి స్థానికప్రజలు ఇంకా కోలుకోలేదు. ఆరుగురిని అత్యంత కిరాతకంగా గొంతు కోసి హత్యచేసిన రాక్షసుడు రాజ్‌కుమార్ ఆచూకి ఇంకా దొరకకపోవడంతో బాధిత కుటుంబాలతోపాటు షాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కొత్తూరు మునిసిపాలిటీ పరిధిలోని అక్కవానిగూడలో నిందితుణ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతున్నా.. పోలీసు అధికారులు ధ్రువీకరించకపోవడంతో ఈ విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. దీంతో అతను మళ్లీ తిరిగి వచ్చి ఎవరినైనా ఏమైనా చేస్తాడేమోనన్న భయంతో స్థానికులు భయాందోళనతో గడుపుతున్నారు. తమ పిల్లలను బయటకు, స్కూల్‌కు పంపేందుకు కూడా భయపడుతున్నామని వారు అంటున్నారు. రాజ్‌కుమార్‌ను చంపేయాలని షాబాద్, దేవాలగూడ గ్రామంలోని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు జిల్లా అంతటా ప్రజలు ఈ ఘటనపైనే చర్చించుకుంటున్నారు. రాజ్‌కుమార్‌పై పెట్టిన పోక్సో కేసును స్థానిక పోలీసులు నీరుగార్చారని, అతణ్ని ముందే అరెస్టు చేసి జైలుకు పంపితే ఇన్ని ప్రాణాలు పోయేవి కావని చెబుతున్నారు. పోలీసులకు నిందితుడు లంచాలు ఇచ్చి స్థానికంగా ఆరోపణలు వస్తున్నాయి.
బాధిత కుటుంబాలకు నేతల పరామర్శ
ఉన్మాది రాజ్‌కుమార్ చేతిలో హత్యలకు గురైనవారి కుటుంబసభ్యులను ఆదివారం పలువురు నేతలు పరామర్శించారు. వికలాంగురాలైన బాలికకు అండగా ఉంటామని ప్రకటించారు. ఆయా పార్టీల నేతలు ఈ ఘటనలో అందరినీ కోల్పోయిన వికలాంగురాలైన బాలికకు అండగా ఉంటామన్నారు.కొందరు ఆర్థిక సహాయం అందజేశారు. ఒకే వ్యక్తి ఒకేరోజు ఆరుగురిని అత్యంత దారుణంగా హత్య చేయడం రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యానికి నిదర్శనమని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. మహిళలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, మృతదేహాలను తరలించడంలో చూపిన శ్రద్దను బాధిత కుటుంబంలో జీవించి ఉన్న మానసిక వికలాంగురాలి రక్షణ పట్ల చూపలేదని విమర్శించారు. షాబాద్‌లో మైనర్ బాలిక కుటుంబ సభ్యులను ఆదివారం కొండగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో కలిసి ఆమె పరామర్శించారు. బాధిత కుటుంబానికి పట్నం అవినా్‌షరెడ్డి రూ.5లక్షల చెక్కును అందజేశారు. కాగా, మైనర్ బాలిక కుటుంబాన్ని హతమార్చిన ఉన్మాదిని ఎన్‌కౌంటర్ చేయాలని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాబాద్‌లో మైనర్‌బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించి, బాధిత కుటుంబానికి నివాళి అర్పించారు. అనాథగా మిగిలిన వికలాంగురాలిని ఆదుకునేందుకు రూ.లక్ష నగదును అందజేశారు. ఎస్సైని సస్పెండ్ చేసి చేతులు దులుపుకొంటే సరిపోదని, ఈ సంఘటనకు పోలీసు ఉన్నతాధికారులు బాద్యత వహించాలని డిమాండ్ చేశారు. కాగా, బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చీఫ్ విఫ్ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు.