లైన్‌మెన్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
ABN , Publish Date - Jun 30 , 2026 | 05:02 AM
రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో విద్యుత్‌శాఖ సిబ్బంది నిర్లక్ష్యానికి ఓ మైనర్ బాలుడు బలయ్యాడు. మరమ్మతు కోసం నిబంధనలకు విరుద్ధంగా ఓ బాలుడిని కరెంట్ స్తంభం...
కరెంట్ స్తంభంపై షాక్‌తో బాలుడు మృతి
లైన్‌మెన్‌కు బదులుగా స్తంభం ఎక్కిన 17 ఏళ్ల సాయితేజ
రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఘటన
షాబాద్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో విద్యుత్‌శాఖ సిబ్బంది నిర్లక్ష్యానికి ఓ మైనర్ బాలుడు బలయ్యాడు. మరమ్మతు కోసం నిబంధనలకు విరుద్ధంగా ఓ బాలుడిని కరెంట్ స్తంభం ఎక్కించడమే ఈ ప్రమాదానికి కారణమైంది. స్థానికుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని ఓ ట్రాన్స్‌ఫార్మర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో.. సాజిత్ అనే లైన్‌మెన్ మరమ్మతుల కోసం 17ఏళ్ల సాయితేజ అనే బాలుడిని వెంటపెట్టుకొని వెళ్లాడు. స్వయంగా పని చేయాల్సిన సాజిత్ తాను కిందే ఉండి, సాయితేజను కరెంట్ స్తంభం ఎక్కించాడు. ఈక్రమంలో ఒక్కసారిగా విద్యుత్ సరఫరా కావడం తో షాక్‌కు గురై కరెంట్ బాలుడు స్తంభంపైనే కుప్పకూలాడు. సాజిత్ భయంతో పరారయ్యాడు. మృతుడి తండ్రి శంకర్‌పల్లి మండలంలో సబ్‌స్టేషన్ ఆపరేటర్ గా పనిచేస్తుండగా, సోదరుడు షాబాద్‌లో కాంట్రాక్ట్ పద్ధతిలో మీటర్ బిల్లింగ్ చేస్తున్నాడు. తండ్రి, అన్నలాగే విద్యుత్‌శాఖలో పనిచేయాలనే తపనతో ట్రాన్స్‌కో సిబ్బందితో తిరిగే వాడు. ఇదే అదనుగా కొందరు విద్యుత్ సిబ్బంది, అతనికి కొద్దిపాటి డబ్బులు ఇస్తూ తమ పనులు చేయించుకునేవారని తెలుస్తోంది. కనీస రక్షణ పరికరాలు లేకుండా ప్రైవేట్ వ్యక్తులతో చేయించడం వల్లే ఘోరం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబానికి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ప్రమాదంపై షాబాద్ విద్యుత్‌శాఖ ఏఈ కోటేశ్వర్ రావు స్పందిస్తూ.. సాయితేజ విద్యుత్ శాఖ ఉద్యోగి కాదని, స్పష్టం చేశారు. స్థానిక లైన్‌మెన్‌లకు సహాయకుడిగా పనిచేసేవాడని, విద్యుత్‌శాఖ తరపున మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.