Share News

20 లక్షలకు డీల్‌?

ABN , Publish Date - Jul 13 , 2026 | 04:14 AM

రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఆరు హత్యలు చేసిన నిందితుడిపై పోక్సో కేసు విషయంలో స్థానిక పోలీసులు సరిగా వ్యవహరించలేదా? అతని వద్ద పెద్దమొత్తంలో వసూలు చేసి..

20 లక్షలకు డీల్‌?

  • షాబాద్‌ హత్యల నిందితుడి నుంచి పోలీసులు తీసుకున్నట్లు ఆరోపణలు

  • దాంతోనే పోక్సో కేసులో బెయిల్‌ వచ్చే సెక్షన్లు!.. అరెస్టు చేయకుండా న్యాయపరంగా సహకారం

  • ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం.. డీజీపీ ఆదేశాలూ బేఖాతరు!

హైదరాబాద్‌, జూలై 12 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఆరు హత్యలు చేసిన నిందితుడిపై పోక్సో కేసు విషయంలో స్థానిక పోలీసులు సరిగా వ్యవహరించలేదా? అతని వద్ద పెద్దమొత్తంలో వసూలు చేసి.. బెయిల్‌ వచ్చే సెక్షన్లు నమోదు చేశారా? ఇప్పుడు అందరి నోటా ఇవే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిందితుడు రాజ్‌కుమార్‌ నుంచి రూ.20 లక్షలు తీసుకొని అతనికి సహకరించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దాంతోనే అతడు బెయిల్‌ తెచ్చుకొని అత్యంత కిరాతకంగా ఆరుగురిని హత్య చేశాడని అంటున్నారు. ఈ ఘటనతో రాష్ట్రంలో పోక్సో కేసుల దర్యాప్తు, పర్యవేక్షణ జరుగుతున్న తీరుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ విషయంలో సాక్షాత్తూ రాష్ట్ర డీజీపీ ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. బాలలపై లైంగిక నేరాలకు సంబంధించిన పోక్సో కేసులు నమోదైన తర్వాత తప్పనిసరిగా ఆ కేసులను డీఎస్పీ లేదా ఏసీపీ స్థాయి అధికారి పర్యవేక్షించాలని, ఇందులో ఏమాత్రం అలసత్వాన్ని సహించేది లేదని డీజీపీగా బాధ్యతలు చేపట్టిన వెంటనే సీవీ ఆనంద్‌ రాష్ట్ర పోలీసులకు స్పష్టంగా చెప్పారు. రాష్ట్రంలోని ఎస్సై నుంచి యూనిట్‌ ఆఫీసర్‌ (కమిషనర్‌ లేదా ఎస్‌పీ) వరకు ఇటీవల ఆన్‌లైన్‌లో ఆయన రెండుసార్లు సమీక్ష నిర్వహించారు. నేరాల నమోదు, పర్యవేక్షణ, నమోదైన నేరాలను ఎప్పటికపుడు ఆన్‌లైన్‌లోని సిటిజన్‌ చార్టర్‌లో అప్‌లోడ్‌ చేసే విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని డీజీపీ స్పష్టం చేశారు.


డీజీపీగా ఎవరున్నా.. పోలీసుశాఖలో అమలవుతున్న స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌(ఎస్‌వోపీ) ప్రకారం.. పోక్సో కేసులు నమోదైన తర్వాత బాధిత బాలికకు, ఆమె కుటుంబానికి రక్షణ కల్పించి, వారికి భరోసా ఇవ్వడం పోలీసుల ప్రాథమిక బాధ్యత. మరోవైపు నిందితుల మానసిక స్థితిని పరిశీలించడం, నేరతీవ్రత ఆధారంగా వారిపై నిఘా పెట్టడం స్థానిక పోలీసులు చేయాల్సి ఉంటుంది. దీనిని ఎప్పటికప్పుడు సంబంధిత ఇన్‌స్పెక్టర్‌, ఏసీపీ మానిటరింగ్‌ చేయాలి. జిల్లా అధికారి క్రమం తప్పకుండా పోక్సో కేసుల నమోదు, దర్యాప్తుపై సమీక్షలు నిర్వహించాలి. అయితే ఈ మార్గదర్శకాలను పాటించడంలో పోలీసులు అనేక సందర్భాల్లో విఫలమవుతున్నారని, లాలూచీకి పాల్పడుతున్నారని తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. షాబాద్‌ పోక్సో కేసు విషయంలో బాధిత బాలిక కుటుంబసభ్యులు ఈ ఏడాది మే 16న పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజ్‌కుమార్‌ అనే వ్యక్తి ఏడాది నుంచి బాధితురాలిని ఫోన్‌లో మాట్లాడాలంటూ ఒత్తిడి చేస్తున్నాడని, ఆమె వెంట పడుతున్నాడని, కాలేజీకి వెళ్లే సమయంలో అడ్డుకుంటున్నాడని, ప్రేమించాలని బలవంతం చేస్తున్నాడని, తిరస్కరిస్తే చంపేస్తానని బెదిరించాడని, ఇంటివైపు సీసీ కెమెరాలు పెట్టి బాలిక కదలికలను నిరంతరం గమనిస్తునాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు.. పరీక్ష పూర్తయ్యాక బాలిక చేయి పట్టుకుని లాక్కెళ్లే ప్రయత్నం చేశాడని, తల్లి అడ్డుకోగా.. నీ భర్తను చంపినట్టే నిన్నూ చంపుతానని బెదిరించాడని తెలిపారు. ఇందులో చంపుతాననే తీవ్రమైన బెదిరింపులు ఉన్నాయి.


కానీ, స్ధానిక పోలీసులు మాత్రం బీఎన్‌ఎ్‌స సెక్షన్‌ 78 (వెంట పడటం), బీఎన్‌ఎ్‌స 351(2) తీవ్రమైన బెదిరింపులు, పోక్సో చట్టం 11, 12 (బాలికపై లైంగిక వేధింపులు) సెక్షన్లు పెట్టి చేతులు దులుపుకొన్నారు. దీనిపై నిందితుడు కోర్టును ఆశ్రయించడంతో.. ఏడేళ్లలోపు శిక్ష పడే నేరాలు కావడంతో రూ.20 వేల వ్యక్తిగత బాండ్‌తో బెయిల్‌ లభించింది. అయితే ఈ కేసులో నిందితుడిని స్థానిక పోలీసులు సరైన రీతిలో విచారించకుండా అతనికి న్యాయపరమైన అవకాశాలు కల్పించడానికి రూ.20 లక్షలు తీసుకున్నారని గ్రామస్థులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక ఎస్సైఐ, సీఐలను చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. నిందితుడు రాజ్‌కుమార్‌పై మే 16న పోక్సో కేసు న మోదైతే.. జూన్‌ 12న బెయిల్‌ లభించింది. బెయిల్‌ పిటిషన్‌ను బాలిక సోదరుడు వ్యతిరేకించినా.. ఇప్పటివరకు బాధితురాలి వాంగ్మూలం నమోదు చేయలేదు. నిందితుణ్ని పోలీసులు కస్టడీలోకి తీసుకోలేదు. చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన ఒక నేత నిందితుణ్ని అన్ని దశల్లో కాపాడారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పైగా, ఈ కేసులో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తున్నా.. కిందిస్థాయి అధికారులపైనే వేటు వేయడం పోలీసుశాఖలో చర్చనీయాంశమైంది. బెయిల్‌ పిటిషన్‌ దాఖలయ్యే వరకు పోలీసులు అతణ్ని అరెస్టు చేయకపోవడం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కిందకే వస్తుందని చెబుతున్నారు. బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులోనూ..తొలుత ఏడేళ్ల లోపు శిక్షపడే సెక్షన్లు పెట్టినా, ఉన్నతాధికారుల పర్యవేక్షణ తర్వాత అదనపు సెక్షన్లు చేర్చారని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో షాబాద్‌ కేసులో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంపై విచారణ జరపాల్సి ఉందని మాజీ పోలీసు అధికారులు పేర్కొంటున్నారు.

Updated Date - Jul 13 , 2026 | 04:16 AM