యూట్యూబర్ వైష్ణవిని చంపితే ఏం చేశారు? నన్నేం చేస్తారు?
ABN , Publish Date - Jul 13 , 2026 | 04:22 AM
తనపై పోక్సో కేసు పెట్టినందుకు మైనర్ బాలిక కుటుంబాన్ని చంపిన రాజ్‌కుమార్.. తన భార్య సరితపై కూడా పగతోనే ఉన్నట్లు తెలిసింది. తన విచ్చలవిడి జీవితానికి..
4 రోజులు మొత్తుకుంటారు
తర్వాత ఎవరూ పట్టించుకోరు
నిన్ను చంపినా అంతే.. భార్య సరితను బెదిరించిన రాజ్‌కుమార్
ఇంటర్నెట్ విభాగం: తనపై పోక్సో కేసు పెట్టినందుకు మైనర్ బాలిక కుటుంబాన్ని చంపిన రాజ్‌కుమార్.. తన భార్య సరితపై కూడా పగతోనే ఉన్నట్లు తెలిసింది. తన విచ్చలవిడి జీవితానికి అడ్డువస్తుందనే కారణంతో ఆమెను అడ్డు తొలగించుకునేందుకు ముందు నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోక్సో కేసు తరువాత రాజ్‌కుమార్ కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. అతడు మైనర్ బాలిక వెంటపడడాన్ని భార్య ప్రశ్నించింది. దీంతో ఆమెపై పగ పెంచుకున్న రాజ్‌కుమార్.. ఆమెను చంపేస్తానంటూ పలుమార్లు బెదిరించాడు. ‘‘యూట్యూబర్ వైష్ణవిని ఆమె భర్త హత్య చేస్తే పోలీసులు, ప్రభుత్వం ఏం చేసింది? నన్ను కూడా ఏం చేయలేరు. అందరూ నాలుగు రోజులు మొత్తుకున్నారు.. ఇప్పుడెవరూ పట్టించుకోవడంలేదు. నిన్ను చంపినా ఇంతే’’ అంటూ రాజ్‌కుమార్ తనను భయపెట్టినట్లు అతని భార్య సరిత తన ఆడపడుచు మౌనికకు చెప్పింది. అయితే ఈ విషయాన్ని తిరిగి అతణ్ని అడగవద్దని సరిత బతిమాలడంతో తాను అడగలేదని మౌనిక తెలిపింది. ఇంతలోనే దారుణానికి పాల్పాడ్డాడంటూ సరిత కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. మరోవైపు రాజ్‌కుమార్ తల్లిదండ్రులను, అన్నను పోలీసులు శంషాబాద్ స్టేషన్‌లో విచారిస్తున్నట్లు తెలిసింది. అయితే కేసు విచారణకు సంబంధించిన వివరాలన్నీ పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు.