పోలీసుల అదుపులో ఉన్మాది?
ABN , Publish Date - Jul 13 , 2026 | 04:18 AM
రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఆరుగురిని కిరాతకంగా హత్య చేసి పరారైన ఉన్మాది రాజ్‌కుమార్.. పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం ముఖానికి మాస్క్ ధరించిన ఓ వ్యక్తిని..
కొత్తూరు మునిసిపాలిటీ పరిధిలో చిక్కిన రాజ్‌కుమార్!
ముఖానికి మాస్క్ ధరించి టిఫిన్ కోసం..
హోటల్‌కు వెళుతుండగా పట్టుకున్న పోలీసులు
వెంటాడి చాకచక్యంగా పట్టుకున్న కానిస్టేబుల్
ఇంకా ధ్రువీకరించని పోలీసు అధికారులు
నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది..
వదంతులు నమ్మొద్దు: చేవెళ్ల డీసీపీ
కొత్తూర్/షాద్‌నగర్, జూలై 12 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఆరుగురిని కిరాతకంగా హత్య చేసి పరారైన ఉన్మాది రాజ్‌కుమార్.. పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం ముఖానికి మాస్క్ ధరించిన ఓ వ్యక్తిని కొత్తూరు మునిసిపాలిటీ పరిధిలోని అక్కవానిగూడలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టిఫిన్ చేసేందుకు హోటల్‌కు వెళుతున్న సమయంలో ఓ కానిస్టేబుల్ సినీ ఫక్కీలో వెంటాడి పట్టుకున్నాడు. ఇతడు షాబాద్ హత్యల కేసు నిందితుడు రాజ్‌కుమారేనని ప్రచారం జరుగుతోంది. అయితే పోలీసులు మాత్రం ఈ విషయాన్ని ధ్రువీకరించడంలేదు. తనపై పోక్సో కేసు పెట్టారన్న కోపంతో షాబాద్‌కు చెందిన రాజ్‌కుమార్ అనే వ్యక్తి.. మైనర్ బాలికతోపాటు ఆమె తల్లి, నానమ్మ, తన భార్య, ఇద్దరు కుమారులను కత్తితో పొడిచి చంపి పరారైన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించడంతో నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు బృందాలు గాలింపు చేపట్టాయి. కాగా, హత్యల తరువాత నిందితుడు తిమ్మాపూర్ రైల్వే అండర్‌పాస్ సమీపంలోని ఓ వెంచర్ గేటు ముందు కారును వదిలేసి పరారయ్యాడు. ఆదివారం ఉదయం 8.30 గంటల సమయంలో అతడు కొత్తూరు మునిసిపాలిటీ పరిధిలోని అక్కవానిగూడలో ప్రత్యక్షమైనట్లు తెలిసింది. వ్యవసాయ పనుల కోసం పొలం వద్దకు వెళ్లి తిరిగి ఇంటికి వెళుతున్న సుధాకర్ అనే వ్యక్తికి.. రోడ్డుపై ఓ అపరిచిత వ్యక్తి కనిపించాడు.
వెంటాడి పట్టుకున్న కానిస్టేబుల్..
ముఖానికి మాస్క్ ధరించిన అపరిచిత వ్యక్తి.. సుధాకర్‌ను ఆపి, ఇక్కడ టిఫిన్ ఎక్కడ దొరుకుతుందని అడిగాడు. ముందుకు వెళితే తిమ్మాపూర్‌లో దొరుకుతుందని సుధాకర్ సమాధానమిచ్చాడు. అదే సమయంలో తిమ్మాపూర్ వైపు బైక్‌పై వెళుతున్న ఓ వ్యక్తిని ఇతడు ఆపి.. లిఫ్ట్ అడిగి ఎక్కాడు. ఇంతలో ఎదురుగా బైక్‌పై వచ్చిన కానిస్టేబుల్.. మాస్క్ ధరించిన వ్యక్తిని అనుమానించి వెంటపడి తన బైక్‌ను అడ్డుపెట్టాడు. దీంతో అతడు బైక్ పైనుంచి దూకి పక్కనే వెంచర్ గోడ దూకేందుకు ప్రయత్నించాడు. కానిస్టేబుల్ అతణ్ని వెంటాడి.. అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తుల సహకారంతో అతని చేతులు కట్టి.. బైక్‌పై కూర్చోపెట్టుకుని తీసుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షి సుధాకర్ తెలిపారు. అయితే కానిస్టేబుల్‌తోపాటు అపరిచిత వ్యక్తిని తీసుకువెళ్లిన వారు పోలీసులా? కాదా? అనే విషయం తనకు తెలియదన్నారు. మరోవైపు కొత్తూరు స్థానిక పోలీసులు గానీ, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ గానీ నిందితుణ్ని అరెస్టు చేసినట్లు ధ్రువీకరించడంలేదు. ఈ విషయం తెలుసుకునేందుకు మీడియా ప్రయత్నించినా పోలీస్ ఉన్నతాధికారులు ఫోన్లు లిఫ్ట్ చేయడంలేదు. అయితే నిందితుడు రాజ్‌కుమార్ దొరికినట్లు, ఎన్‌కౌంటర్ అయినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని, వదంతులను నమ్మొద్దని చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతమ్ ప్రజలకు సూచించారు. నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు వేగవంతం చేశామన్నారు.