హౌసింగ్ శాఖలో లైంగిక వేధింపుల కలకలం
ABN , Publish Date - Jan 23 , 2026 | 04:33 AM
సంగారెడ్డి జిల్లా హౌసింగ్ శాఖలో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపుల వ్యవహారం కలకలం రేపింది.
సంగారెడ్డి హౌసింగ్ పీడీపై మహిళా ఉద్యోగుల ఫిర్యాదు
సంగారెడ్డి క్రైం, జనవరి 22(ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లా హౌసింగ్ శాఖలో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపుల వ్యవహారం కలకలం రేపింది. హౌసింగ్ శాఖ పీడీ చలపతి తమను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేస్తున్నారని పలువురు మహిళా ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్యకు ఇటీవల ఫిర్యాదు చేశారు. ఫీల్డ్ విజిట్‌కు వెళ్తున్న సందర్భాల్లో మహిళా ఏఈలు వేరేగా కారులో వెళ్తుంటే తన కారులోనే రావాలని పీడీ ఒత్తిడి చేస్తున్నట్టుగా వారు ఆరోపించారు. విధులు ముగిసిన తర్వాత కూడా తమకు ఫోన్లు చేసి వేధింపులకుగురిచేస్తున్నారని పేర్కొన్నారు. పీడీపై చర్యలు తీసుకోవాలంటూ సదరు మహిళా ఉద్యోగులంతా కలెక్టర్ ముందు కన్నీరుమున్నీరైనట్టు తెలిసింది. కాగా, ఈ విషయమై సమగ్ర విచారణ జరుపుతామని కలెక్టర్ వారికి హామీ ఇచ్చినట్టు సమాచారం. ఈ మేరకు ఒక కమిటీని నియమించినట్లు తెలిసింది.