Share News

kumaram bheem asifabad- బీసీ మహిళలకు కుట్టుమిషన్లు

ABN , Publish Date - Sep 24 , 2026 | 10:35 PM

తెలంగాణలో బీసీ మహిళలకు కుట్టు మిషన్లు ఇవ్వాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం మహిళల సాధికారత, ఆర్థికాభి వృద్ధికి ఇందిరా మహిళా శక్తి ద్వారా సంక్షేమ పథకాలు, అవకాశాలు కల్పిస్తోంది. ఈక్రమంలోనే బీసీ సామాజిక వర్గంలో నిరుద్యోగ మహిళలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా 100 శాతం సబ్సిడీతో ఉచితంగా ప్రభుత్వం ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్‌’ పథకాన్ని ప్రకటించింది

kumaram bheem asifabad- బీసీ మహిళలకు కుట్టుమిషన్లు
లోగో

- 18 నుంచి 55 ఏళ్లలోపు వారు అర్హులు

కెరమెరి, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో బీసీ మహిళలకు కుట్టు మిషన్లు ఇవ్వాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం మహిళల సాధికారత, ఆర్థికాభి వృద్ధికి ఇందిరా మహిళా శక్తి ద్వారా సంక్షేమ పథకాలు, అవకాశాలు కల్పిస్తోంది. ఈక్రమంలోనే బీసీ సామాజిక వర్గంలో నిరుద్యోగ మహిళలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా 100 శాతం సబ్సిడీతో ఉచితంగా ప్రభుత్వం ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్‌’ పథకాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా చేసుకునే విధంగా షెడ్యూల్‌ ప్రకటించింది. ప్రభుత్వం ఇప్పటికే మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తెల్లరేషన్‌ కార్డు కలిగిన కుటుంబాలకు రూ.500కే గ్యాస్‌సిలిండర్‌, మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా వ్యాపార అవకాశాలు, వడ్డీ లేని రుణాలు, రుణ బీమా పథకం, ఆరోగ్యలక్ష్మి, స్వయంఉపాధి పథకాలను అందిస్తోంది. ఈ క్రమంలోనే కుమరం భీం జిల్లాలోని వెనుకబడిన తరగతుల మహిళలకు ఇందిరమ్మ కుట్టు మిషన్‌ పథకం మరింత ప్రయోజనం కలుగుతుందని భావిస్తు న్నారు. ప్రభుత్వ తొలి విడతగా రూ.12 వేల విలువైన ఆటోమేటిక్‌ కుట్టుమిషన్లు పంపిణీ చేయడానికి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను ఆహ్వానించింది.

- తొలి విడతగా..

ప్రభుత్వం తొలి విడతగా ప్రతీ నియోజకవర్గానికి వెయ్యి కుట్టుమిషన్లు వంద శాతం సబ్సిడీ తో అందించాలని నిర్ణయించింది. కుమరం భీం జిల్లాలో ఆసిఫాబాద్‌, సిర్పూర్‌ రెండు నియోజకవర్గాలు ఉన్నాయి. జిల్లాలోని బీసీ సామాజిక వర్గానికి చెందిన 18 నుంచి 55 సంవత్సరాల వరకు ఉన్న మహిళలు ఆన్‌లైన్‌ ద్వారా సెప్టెంబరు 30 తేదీ వరకు దరఖాస్తులు చేసుకునే వీలు కల్పించారు. మహిళలు కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షల వరకు మించకూడదు. ఒక కుటుంబం నుంచి ఒక రేషన్‌ కార్డుపై ఒకరికి మాత్రమే ఇందిరమ్మ ఉచిత కుట్టు మిషన్‌ పథకాన్ని వర్తింపచేస్తారు. దరఖాస్తు చేసుకునే మహిళ తప్పనిసరిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారై ఉండాలి. పేద మహిళలు, నిరాశ్రయులు, వితంతువులు, ఒంటరి మహిళలు, అనాథలకు ప్రాధాన్యం ఇస్తారు. దీంతో పాటు మేర, మేరు సామాజిక వర్గానికి చెందిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఇందిరమ్మ ఉచిత కుట్టు మిషన్‌ లబ్ధి పొందాలంటే మహిళలకు కనీస విద్యార్హత ఉన్నవారికి ప్రా ధాన్యం ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌ దర ఖాస్తు చేసుకునే క్రమంలో ఆధార్‌కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, రేషన్‌ కార్డ్‌, సమ్మర్‌ పత్రాలను అప్లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను మండల, మున్సిపాలిటీ స్థాయి కమిటీల ద్వారా అర్హులను నిర్ణయిస్తారు. ఆన్‌లైన్‌ చేసిన దరఖాస్తులను డౌన్లోడ్‌ చేసుకొని మండల పరిషత్‌, మున్సిపల్‌ కార్యాలయాల్లో అందజేయాల్సి ఉంటుంది.

అర్హులు దరఖాస్తులు చేసుకోవాలి..

-అంజద్‌ పాషా, కెరమెరి ఎంపీడీవో

బీసీ మహిళలకు స్వయం ఉపాధి కోసం అర్హులైన మహిళలు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 30 వరకు గడువు ఉంది. కనీస అర్హత పదో తరగతి పాసై ఉండాలి. అలాగే వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు కలిగి ఉండాలి. తెల్లరేషన్‌ కార్డు తప్పకుండా ఉండాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు పత్రం ఆన్‌లైన్‌లో డౌన్‌ చేసుకొని పూర్తి వివరాలతో సమర్పించాల్సి ఉంటుంది. అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవచ్చు.

Updated Date - Sep 24 , 2026 | 10:35 PM