గాలివాన బీభత్సం పలు జిల్లాల్లో తీవ్ర విధ్వంసం
ABN , Publish Date - May 26 , 2026 | 04:52 AM
రాష్ట్రంలో సోమవారం పలుచోట్ల గాలివాన బీభత్సం సృష్టించింది. ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం, మక్కలు తడిసిపోయాయి. గాలిదుమారానికి తోటపంటలు, భారీ చెట్లు, విద్యుత్ స్తంభాలు...
నేలకొరిగిన తోటపంటలు, విద్యుత్ స్తంభాలు
కొట్టుకుపోయిన ఇళ్ల పైకప్పులు
కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం, మక్కలు
పంటలు నష్టపోయి లబోదిబోమంటున్న రైతులు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
రాష్ట్రంలో సోమవారం పలుచోట్ల గాలివాన బీభత్సం సృష్టించింది. ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం, మక్కలు తడిసిపోయాయి. గాలిదుమారానికి తోటపంటలు, భారీ చెట్లు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు నేలకొరిగాయి. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసిపోయింది. పత్తిపాక ఎక్స్‌రోడ్ సమీపంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి. ఎలిగేడు మండలం రాములపల్లి బైపాస్ రోడ్డు వద్ద విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ కూలింది. కాల్వశ్రీరాంపూర్ మండలంలో ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సోమవారం మధ్యాహ్నం గాలివాన బీభత్సం సృష్టించింది. ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్ పూర్, రాజన్నపేట, గుంటపల్లిచెరువుతండా గ్రామాల్లో చెట్లు విరిగిపడ్డాయి. ఇల్లంతకుంట మండలంలోని కేసన్నపల్లె, పత్తికుంటపల్లె, గాలిపెల్లి, జవారిపేట తదితర గ్రామాల్లో ఈదురుగాలితో వడగళ్లవాన కురిసింది. మండలంలో ఈదురుగాలులకు 30 విద్యుత్ స్తంభాలు, 5 ట్రాన్స్‌ఫార్మర్లు విరిగి కిందపడ్డాయని ఎన్పీడీసీఎల్ ఏఈ నగేష్ తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ గాలివాన విధ్వంసం సృష్టించింది. పలుచోట్ల వడగళ్ల వర్షం కురిసింది. సూర్యాపేట జిల్లా అడ్లూరు, శోభనాద్రిగూడెం, తమ్మారం, జాన్‌పహాడ్ తదితర ప్రాంతాల్లో గాలుల ధాటికి ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. భువనగిరి జిల్లా వలిగొండ మండలం రెడ్లరేపాక, కంచనపల్లిలో వడగళ్ల వాన కురిసింది. పలుచోట్ల చెట్లు రోడ్లకు అడ్డంగా పడడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రైతులకు తీవ్ర నష్టం
గాలివానతో నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండలంలో కొనుగోలు కేంద్రాల్లోని మొక్కజొన్నలు, ధాన్యం తడిసిపోయాయి. మెదక్‌లో వృక్షా లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. మార్కెట్ యార్డులో ధాన్యం తడిసింది. చాలాప్రాంతాల్లో 3 గంటలపాటు కరెంట్ నిలిచిపోయింది. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం, కోహీర్ మండలాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. సిద్దిపేట జిల్లా కుందనవానిపల్లి, మైసమ్మవాగు తండా, గండిపల్లి, చౌటకుంట తండాలో కురిసిన వర్షానికి ధాన్యం తడిసింది. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్, పోచారం ఎదులాబాద్ డివిజన్లలో గాలివాన తీవ్ర నష్టం కలిగించింది. వికారాబాద్ జిల్లా మర్పల్లిలో గాలివానతో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గొల్లపల్లిలో సోమవారం ఓల్లాల లక్ష్మయ్య (60) అనే గొర్రెల కాపరిపై గోడ కూలి మృతి చెందాడు.