సర్వర్ షట్‌డౌన్
ABN , Publish Date - Mar 25 , 2026 | 04:44 AM
సర్కారుకు ప్రతియేటా రూ.15 వేల కోట్ల ఆదాయం తెచ్చి పెట్టేశాఖ.. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ. కానీ, ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం ఉమ్మడి రాష్ట్రంలో 2001లో కొనుగోలు చేసిన సర్వర్‌నే వినియోగిస్తున్నారు.
2 గంటల పాటు నిలిచిన రిజిస్ట్రేషన్లు
మంగళవారం ఒక్కరోజే 4,400 రిజిస్ట్రేషన్లు
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, మార్చి 24 (ఆంధ్ర జ్యోతి): సర్కారుకు ప్రతియేటా రూ.15 వేల కోట్ల ఆదాయం తెచ్చి పెట్టేశాఖ.. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ. కానీ, ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం ఉమ్మడి రాష్ట్రంలో 2001లో కొనుగోలు చేసిన సర్వర్‌నే వినియోగిస్తున్నారు. నాటి సర్వర్‌నే ఇప్పటికీ వినియోగిస్తుండటంతో తరచుగా అది మొరాయిస్తోంది. మంగళవారం ఉదయం 10 గంటలకు స్లాట్ బుక్ చేసుకున్న వినియోగదారులు వచ్చేసరికి సర్వర్ పని చేయట్లేదని సిబ్బంది చెప్పడంతో అసహనానికి గురయ్యారు. నారపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. సర్వర్ మొరాయించిందని రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్‌లందరి నుంచి ఫోన్లు రావడంతో రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ కార్యాలయం, నానక్‌రాం గూడలోని స్టేట్ డేటా సెంటర్ అధికారుల మధ్య ఫోన్ సంభాషణల్లో సర్వర్ రీస్టార్ట్ అయిందని తేలింది. ఎట్టకేలకు మధ్యాహ్నం 12.30 గంటలకు సర్వర్ పని చేయడంతో రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. ఉదయం, మధ్యాహ్నం స్లాట్‌లు బుక్ చేసుకున్న వారంతా ఒక్కసారే రావడంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కిటకిటలాడాయి. మంగళవారం ఒక్కరోజే 4,400 రిజిస్ట్రేషన్లు జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో రాత్రి 10 గంటల వరకూ రిజిస్ట్రేషన్లు జరిగాయని సమాచారం. 10-15 నిమిషాల్లో పూర్తవుతుందనుకున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికి ఆరేడు గంటలు పట్టింది. 2 గంటల పాటు రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన మాట వాస్తవమేనని ఆశాఖ డీఐజీ సుభాషిణి చెప్పారు.
కొత్త సర్వర్‌కోసం ప్రతిపాదనలు పంపినా..
కొత్త సర్వర్ కోసం 2 నెలల క్రితం రూ.10.54 కోట్ల అంచనాలతో రిజిస్ట్రేషన్లశాఖ ఉన్నతాధికారులు ప్ర భుత్వానికి ప్రతిపాదనలు పంపినా నిధులు మంజూ రు కాలేదు. దీంతో అధికారులు పాత సర్వర్‌మీదే కాలం నెట్టుకొస్తున్నారు. కానీ, ఒక ఫొటో సైజ్ పెరిగినా, ఒక దస్త్రంలో 4 పేజీలు ఎక్కువగా ఉన్నా సర్వర్ నిలిచిపోతోంది. మరమ్మత్తు బిల్లులు సకాలంలో చెల్లించడం లేదని సిబ్బంది సర్వర్ నిర్వహణను గాలికొదిలేశారన్న విమర్శలున్నాయి. రెండేళ్లుగా సమస్య తలెత్తినప్పుడల్లా తాత్కాలిక మరమ్మత్తులతో కాలం గడుపుతున్నట్లు సబ్ రిజిస్ట్రార్‌లు వాపోతున్నారు.