నిధుల దుర్వినియోగంపై సెర్ప్ సీఈవో ఆరా
ABN , Publish Date - Apr 08 , 2026 | 12:07 AM
భువనగిరిలో సంచలనంగా మారిన సమభావన సంఘాల నిధుల దుర్వినియోగంపై సెర్ప్, మెప్మా సీఈవో దివ్యదేవరజాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
భువనగిరిలో సమభావన సంఘాల ఘటనపై ఆగ్రహం
భువనగిరి టౌన్, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): భువనగిరిలో సంచలనంగా మారిన సమభావన సంఘాల నిధుల దుర్వినియోగంపై సెర్ప్, మెప్మా సీఈవో దివ్యదేవరజాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె మంగళవారం జిల్లా అధికారులకు ఫోన్‌చేసి ఘటనలపై అడిగి తెలుసుకున్నారు. నిధుల దుర్వినియోగం పై అదనపు కలెక్టర్ వేసిన కమిటీ, కెనరా బ్యాంకు బృందం దర్యాప్తు చేస్తున్నాయని అధికారులు తెలిపారు. త్వరలోనే మెప్మా ఉన్నతాధికారుల బృందం కూడా భువన గిరికి రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేయడం, ముగ్గురు ఆర్పీలు చంచల్‌గూడా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అదనపు కలెక్టర్ నియమించిన, కెనరా బ్యాంకు ఆడిట్ బృందాల నివేదికలతో పాటు మెప్మా సేకరించిన ఆధారాలతో నిధుల దుర్వినియోగం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె భావిస్తున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు.
బ్యాంకు ఎదుట మహిళల ఆందోళన
వడ్డీలేని రాయితీని అక్రమంగా వినియోగించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 7వ వార్డు తులసి సమభావన సంఘం సభ్యులు మంగళవారం భువనగిరి కెనరా బ్యాంకు ఎదుట ధర్నా చేశారు. కెనరా బ్యాంకులో ఉన్న తులసీ సమభావన సంఘం ఖాతాను 2018లో ఏపీజీవీబీకి బదలాయించారు. వడ్డీలేని రాయితీ కోసం కెనరా బ్యాంకులో సంఘం ఖాతాను మూసివేయోద్దని ఆర్పీ సూచించారు. కాని కొంత వ్యవధి అనంతరం సంఘం లీడర్లను ఐదుగురు సభ్యులను మార్చి రూ.10లక్షలు బ్యాంకు లింకేజీ రుణం పొంది డ్రా చేశారు. ఈ క్రమంలో బ్యాంకు లింకేజీ రుణాల దుర్వినియోగం వెలుగులోకి రావడంతో ఇటీవలే రోజుకు రూ.మూడు లక్షల చొప్పున మూడు రోజుల పాటు రూ.9లక్షలు రుణ ఖాతాలో జమ చేయగా మిగతా మొత్తాన్ని సంఘానికి మంజూరైన వడ్డీలేని రాయితీని 20ఏళ్లుగా చెల్లించిన పొదుపును ఆ బ్యాంకు అధికారులు రుణ ఖాతాలో జమ జమ చేశారు. ఆర్పీ ఇప్పటికే జైలులో ఉండడంతో మెప్మా సీవో సువర్ణను సంప్రదిస్తే పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని, బ్యాంకు ఖాతా బదిలీ సువర్ణకు కూడా తెలుసని ఆందోళనలో పాల్గొన్న మహిళలు అన్నారు. మూడు రోజుల్లో రూ.9లక్షలు చెల్లించిన వారి వివరాలను అడిగితే చెప్పేందుకు బ్యాంకు అధికారులు నిరాకరిస్తున్నారని, ఆన్ లైన్ పేమెంట్ చేసిన వారి వివరాలు వెల్లడిస్తే అక్రమంగా రుణాన్ని కాజేసిన వారు ఎవరో తేలుతారని అంటున్నారు. దర్యాప్తు జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు.