Share News

ముమ్మరంగా ’సర్‌’...

ABN , Publish Date - May 19 , 2026 | 11:12 PM

దేశవ్యాప్తంగా కేంద్ర ఎన్ని కల సంఘం చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమంలో భాగంగా మ్యాపింగ్‌ ప్రక్రియ జిల్లాలో ముమ్మరంగా సాగుతోంది.

ముమ్మరంగా ’సర్‌’...

-పకడ్బంధీగా మ్యాపింగ్‌

-నాలుగు విభాగాలుగా ఓటరు జాబితా

-నియోజకవర్గాల వారీగా ఓటర్ల కూర్పు

-90 శాతం మేర పూర్తయిన ప్రక్రియ

మంచిర్యాల, మే 19 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా కేంద్ర ఎన్ని కల సంఘం చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమంలో భాగంగా మ్యాపింగ్‌ ప్రక్రియ జిల్లాలో ముమ్మరంగా సాగుతోంది. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం కేంద్రం ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకున్న విషయం తెలిసిందే. ’సర్‌’ కార్యక్ర మాన్ని జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే చేశారు. ఈ మేరకు గత నవం బర్‌ నుంచే జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. ప్రత్యేక ఓటర్ల సవరణలో భాగంగా అర్హులైన ఓటర్ల నమోదు, తప్పుల సవరణ, ఓట్ల తొలగింపు ప్రక్రియలు చేపడతారు.

మ్యాపింగ్‌ ప్రక్రియలో వేగం..

ప్రాథమిక దశలో భాగంగా జిల్లాలో ప్రస్తుతం ’సర్‌’ మ్యాపింగ్‌ ప్రక్రియను ముమ్మరంగా చేపడుతున్నారు. జూన్‌ నుంచి ’సర్‌’ షెడ్యూల్‌ విడుదల అవుతున్నందున బీఎల్‌వోలు మ్యాపింగ్‌ ప్రక్రి యలో వేగం పెంచారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా దాదాపు 90 శాతం మేర మ్యాపింగ్‌ ప్రక్రియ పూర్తి చేశారు. అర్హులైన ఓటర్లతో కొత్త జాబితా విడుదల చేయాలనే సంకల్పంతో ఎన్నికల సంఘం ’సర్‌’కు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పకడ్బం ధీ గా సర్వే నిర్వహించి నియోజక వర్గాల వారీగా ఓటరు జాబితాల ను తయారు చేయడం కోసం ముందుగా మ్యాపింగ్‌ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో ’సర్‌’ను జూన్‌ 25 నుంచి జూలై 24వ తేదీ వరకు నెల రోజులపాటు బూత్‌ స్థాయి అధికారులు, సూపర్‌ వైజర్లు ఇంటింటికి తిరిగి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ చేపడ తారు. ముసాయిదా ఓటర్ల జాబితాను జూలై 31న ప్రకటిస్తారు. తుది ఓటర్ల జాబితాలను అక్టోబర్‌ 1న విడుదల చేస్తారు. మ్యా పింగ్‌ ప్రక్రియను ప్రతి శాసనసభ నియోజక వర్గానికి ఒక ఎలక్టోర ల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ (ఈఆర్‌వో) పర్యవేక్షిస్తున్నారు. వీరికి తోడు గా ప్రతి మండలానికి ఒక ఏఈఆర్‌వో (తహసీల్దార్‌) పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఓటరు జాబితా మ్యాపింగ్‌ ప్రక్రియ ను త్వరలో ముగించడం ద్వారా ’సర్‌’ను ప్రారంభించేందుకు ఏర్పా ట్లు చేస్తున్నారు.

నాలుగు విభాగాలుగా మ్యాపింగ్‌...

’సర్‌’-2025లో భాగంగా ఓటరు జాబితాను నాలుగా విభాగా లుగా వర్గీకరించి మ్యాపింగ్‌ చేస్తున్నారు. ఎన్నికల సంఘం ఆదే శం మేరకు ఏ,బీ,సీ,డీ గ్రూపులుగా విభజించారు. ముందుగా 2025 ఓటరు జాబితాను 2002, ఓటరు జాబితా ప్రకారం పోల్చుతు న్నారు. అంటే ఏ కేటగరీలో 2002, 2025 జాబితాల్లో పేర్లు ఉన్న వారిని గుర్తిస్తున్నారు. ఇక బీ కేటగరీలో 38 సంవత్సరాల (1987 జూలై 1కంటే ముందు జన్మించినవారు) వయస్సున్న వారిని గు ర్తించి వివరాలు నమోదు చేస్తున్నారు. సీ కేటగరీలో 1987 నుంచి 2001 మధ్య జన్మించిన వారిని గుర్తిస్తున్నారు. డీ కేటగరీలో 18-21 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారిని గుర్తించడం ద్వారా మొబైల్‌ యాప్‌లో మ్యాపింగ్‌ చేపడుతున్నారు. ఓటర్ల జాబితాలో ఖశ్చి తత్వం, పారదర్శకత, సమస్యలకు సకాలంలో పరిష్కారానికి రాజకీ య పార్టీల పక్షాన పోలింగ్‌ బూత్‌ స్థాయి ఏజెంట్లను నియమిం చుకునేందుకు ఎన్నికల సంఘం అనుమతిని ఇచ్చింది. దీంతో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు జిల్లాలోని ప్రతి పోలింగ్‌ బూత్‌కు ఒకరి చొప్పున ఏజెంట్‌ నియమించాయి. బూత్‌ స్థాయిలో క్రియాశీల కార్యకర్తలను ఎంపిక చేసి పని అప్పగించారు. పోలింగ్‌ బూత్‌ల పరిధిలో జరిగే ఓటరు మ్యాపింగ్‌, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై అభ్యంతరాలు, ఓటర్ల తొలగింపు, చేర్పులపై సందేహాలను ఎన్నికల అధికారులకు ఏజెంట్లు ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పించారు.

జిల్లాలో 6.5 లక్షల పై చిలుకు ఓటర్లు...

ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమం ప్రకారం 5-2-2026 నాటికి జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి మూడు అసెం బ్లీ నియోజక వర్గాల పరిధిలో మొత్తం 6,58,880 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 3,25,592 మంది ఉండగా స్త్రీలు 3,33,242 మంది ఉన్నారు. వీరితో పాటు ఇతరులు 46 మంది ఉండగా, ఎన్‌ఆర్‌ఐ, సర్వీసు (దేశ భద్రత బలగాలు) ఓటర్లు మరో 683 మంది ఉన్నారు.

Updated Date - May 19 , 2026 | 11:12 PM