Share News

సీనియర్‌ రచయిత తెలిదేవర భానుమూర్తి కన్నుమూత

ABN , Publish Date - Apr 30 , 2026 | 05:11 AM

తెలంగాణ నుడికారానికి వన్నెలద్దిన రచయిత, సీనియర్‌ జర్నలిస్టు తెలిదేవర భానుమూర్తి(73) ఇకలేరు. గుండెపోటుతో హైదరాబాద్‌ మల్కాజిగిరి ఆనంద్‌బాగ్‌లోని...

సీనియర్‌ రచయిత తెలిదేవర భానుమూర్తి కన్నుమూత

  • తెలంగాణ నుడికారంలో కవిత్వం, కథా, వ్యంగ్య రచనలు

  • పాత్రికేయరంగంలో సుదీర్ఘకాలం సేవలు

  • నేడు మల్కాజిగిరిలో అంత్యక్రియలు

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ నుడికారానికి వన్నెలద్దిన రచయిత, సీనియర్‌ జర్నలిస్టు తెలిదేవర భానుమూర్తి(73) ఇకలేరు. గుండెపోటుతో హైదరాబాద్‌ మల్కాజిగిరి ఆనంద్‌బాగ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. భానుమూర్తి సొంతూరు యాదాద్రి జిల్లా భువనగిరి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు పూర్తి చేశారు. ఉమ్మడి ఏపీ వాణిజ్యపన్నుల శాఖలో కొన్నాళ్లు పనిచేశారు. అక్కడి పరిస్థితులమీద విముఖతతో ప్రభుత్వ కొలువుకు రాజీనామా చేసి, పాత్రికేయ రంగంలో అడుగుపెట్టారు. ‘ఉదయం’ దినపత్రిలో ‘పలుకుబడి’, ‘చల్నేదో బాల్‌కిషన్‌’ శీర్షికల ద్వారా భానుమూర్తి రాసిన వ్యాసాలు తెలుగు పాఠకుల ఆదరణ పొందాయి. తెలంగాణ అస్తిత్వ సోయి వ్యాప్తికి ముందే ఈ నేల నుడికారంలో విస్తృత రచనలు చేసిన ఘనత తెలిదేవర భానుమూర్తి సొంతం. 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకుగాను నల్లగొండ జైల్లో కొద్దిరోజులు శిక్ష అనుభవించారు. తెలంగాణ భాషలో ‘ఊరోల్లు’ కవితాసంకలనం, ‘నెమ్లీక’, ‘ఆక్సిజన్‌ బార్‌’, ‘గులేర్‌’ కథాసంపుటాలు, ‘లత్కోర్‌సాబ్‌’ వ్యంగ్య నవల తదితర రచనలు తెలుగు సాహిత్యంలో తెలిదేవరకు ప్రత్యేక స్థానాన్ని కల్పించాయి. పలు పత్రికల్లో రాసిన హాస్య, వ్యంగ్య వ్యాసాలు ‘గిల్లిదండ’, ‘పలుకుబడి’, ‘చల్నేదో బాలకిషన్‌’ పేరుతో పుస్తకాలుగా ప్రచురితమయ్యాయి. రచయితలు మందలపర్తి కిషోర్‌, మెహక్‌ హైదరాబాదీ, కవి యార్లగడ్డ రాఘవేంద్రరావుతో పాటు పలువురు కవులు, రచయితలు, పాత్రికేయులు మల్కాజిగిరి విమలాదేవి నగర్‌లోని స్వగృహంలో భానుమూర్తి భౌతికకాయాన్ని సందర్శించి, నివాళులు అర్పించారు. గురువారం ఉదయం11 గంటలకు మల్కాజిగిరిలోని స్థానిక శ్మశానవాటికలో భానుమూర్తి అంత్యక్రియలు జరుగుతాయని ఆయన కుమారులు అరుణ్‌తేజ్‌, చైతన్య తెలిపారు.

Updated Date - Apr 30 , 2026 | 05:11 AM