కాంగ్రెస్‌కు జీవన్‌రెడ్డి రాంరాం?
ABN , Publish Date - Mar 17 , 2026 | 04:52 AM
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ మారడానికి ఆయన ముహూర్తం సిద్ధం చేసుకున్నారని జగిత్యాల జిల్లాలో .....
ఈ నెల 25, 26 తేదీల్లో నిర్ణయం ప్రకటిస్తారని ప్రచారం
బీఆర్‌ఎస్‌లో చేరతారని అంటున్న అనుచరులు
కాంగ్రెస్‌లో కొనసాగే పరిస్థితి లేదు: జీవన్‌రెడ్డి
జగిత్యాల, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ మారడానికి ఆయన ముహూర్తం సిద్ధం చేసుకున్నారని జగిత్యాల జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నెల 25 లేదా 26వ తేదీన కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం. ఉగాది తర్వాత శ్రీరామ నవమి పర్వదినానికి ముందు జీవన్‌రెడ్డి.. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌లో చేరతారన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై నిర్ణయం తీసుకోవటానికి ఆయన తన ప్రధాన అనుచరులు, కార్యకర్తలతో త్వరలో సమావేశం కానున్నట్లు తెలిసింది. ఈ మేరకు జీవన్‌రెడ్డి ముఖ్య అనుచరులకు సంకేతాలు అందినట్లు సమాచారం. సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని జీవన్‌రెడ్డి ఇంటి వద్ద కాంగ్రెస్ ఫ్లెక్సీలను ఆయన అనుచరులు తొలగించడం ఇందుకు మరింత బలాన్ని చేకూర్చింది. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లతో జీవన్‌రెడ్డి టచ్‌లో ఉన్నట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా గెలుపొందిన మాకునూరి సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి జీవన్‌రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నిక విషయంలోనూ మనస్తాపానికి గురయ్యారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
కాంగ్రెస్‌లో ఉండే పరిస్థితి లేదు
కాంగ్రెస్‌లో కొనసాగడంపై ఆలోచించుకునే పరిస్థితి వచ్చింది. ఆ పార్టీలో ఉండే పరిస్థితి ప్రస్తుతం లేదు. ఎప్పుడు, ఏ సందర్భం అనే అంశం భవిష్యత్ నిర్ణయిస్తుంది. కేసీఆర్, కేటీఆర్‌లతో టచ్‌లోకి వెళ్లినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. ఇప్పటివరకు ఎవరితోనూ చర్చలు జరపలేదు. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
- తాటిపర్తి జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి